తెలుగు ప్రేక్షకుల ఆక్రోశం అర్థమవుతోందా?

ఈ గురువారం రిలీజ్ కానున్న ‘వార్-2’, ‘కూలీ’ చిత్రాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ టికెట్ల ధరలు పెంచుకోవడానికి గట్టి ప్రయత్నాలు జరిగాయి.;

Update: 2025-08-13 04:18 GMT

ఓవైపు థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య నానాటికీ తగ్గిపోతోందని బాధ పడతారు నిర్మాతలు. ఇంకోవైపు నెల తిరక్కుండానే ఓటీటీలోకి సినిమాను తీసుకొచ్చేస్తారు. అది చాలదన్నట్లు కాస్త డిమాండ్ ఉన్న సినిమాకు రేట్లు పెంచి సొమ్ము చేసుకోవాలని చూస్తారు. ఇక ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాలు చూడాలని ఎలా అనుకుంటారు? ముఖ్యంగా ఓవైపు ఓటీటీకి త్వరగా సినిమా వచ్చేస్తుంటే, మరోవైపు టికెట్ల ధరలు పెంచేస్తుంటే.. ఇక మధ్య తరగతి జనాలు కుటుంబాలను తీసుకుని థియేటర్లకు ఎందుకు రావాలని కోరుకుంటారు?

టికెట్ల ధరలు అందుబాటులో ఉండడం వల్ల ఒనగూరే ప్రయోజనమేంటి? అవి పెరిగితే సినిమాకు ఎంత చేటు జరుగుతుంది? అనడానికి గత కొన్ని వారాల్లోనే రెండు గొప్ప ఉదాహరణలున్నాయి. రేట్లు పెంచి రిలీజ్ చేసిన ‘హరిహర వీరమల్లు’ వీకెండ్లోనే కళ్లు తేలేసింది. అదే సమయంలో ‘మహావతార నరసింహ’ అనే సినిమాకు మంచి టాక్ వచ్చి, టికెట్ల ధరలు తక్కువగా ఉండడంతో వారాల తరబడి అద్భుతంగా ఆడుతోంది. ఈ ఉదాహరణలు చూశాక కూడా ప్రేక్షకుల ఆలోచన ఎలా ఉందో నిర్మాతలు అర్థం చేసుకోకపోవడమే ఆశ్చర్యం కలిగించే విషయం.

ఈ గురువారం రిలీజ్ కానున్న ‘వార్-2’, ‘కూలీ’ చిత్రాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ టికెట్ల ధరలు పెంచుకోవడానికి గట్టి ప్రయత్నాలు జరిగాయి. నిజానికి ఇవి రెండూ డబ్బింగ్ చిత్రాలే అయినప్పటికీ రేట్ల పెంపు కోసం ప్రయత్నించారు. మామూలుగా అయితే డబ్బింగ్ సినిమాలకు రేట్ల పెంపు ఉండదు. కానీ వీటిని రిలీజ్ చేస్తున్న వాళ్లు పెద్ద స్థాయి వాళ్లు కావడంతో ప్రభుత్వ పెద్దల దగ్గర గట్టిగా లాబీయింగ్ చేశారు. ఐతే తెలంగాణలో మాత్రం వారి ప్రయత్నాలు ఫలించలేదని తెలుస్తోంది. ఏపీలో మాత్రం రెండు చిత్రాలకూ ధరలు పెంచడం ఖాయంగా కనిపిస్తోంది.

‘కూలీ’ బేసిగ్గా తమిళ సినిమా. ఐతే చెన్నైలో మల్టీప్లెక్సుల్లో ఈ చిత్రాన్ని రూ.200 లోపు రేటుతో చూడబోతున్నారు అక్కడి ప్రేక్షకులు. కానీ తెలుగులో మాత్రం ఈ డబ్బింగ్ సినిమా చూసేందుకు రూ.400‌కు పైగా రేటు పెట్టాల్సి ఉంటుందన్న వార్తలు ప్రేక్షకులకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. ఇది దోపిడీ కాదా.. తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమను ఇలా సొమ్ము చేసుకుంటారా అంటూ సోషల్ మీడియాలో మండి పడుతున్నారు నెటిజన్లు.

ఈ క్రమంలోనే నిన్నట్నుంచి #Stophikesintelugustates, #ShameonTFIProducers, #BoycottHikedMovies, #SaveTFIAudience లాంటి హ్యాష్ ట్యాగ్‌లు పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతోంది. సోషల్ మీడియాలో ఈ వ్యతిరేకత చూసే తెలంగాణ వరకు టికెట్ల ధరల పెంపుపై వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. కానీ అవకాశం ఉంటే ఇక్కడా వదిలేవారు కాదు. అమెరికా దగ్గర్నుంచి అనకాపల్లి వరకు ఈ దోపిడీ కొనసాగుతోందని.. వేరే భాషల చిత్రాలకు టికెట్ల ధరలు అందుబాటులో ఉండగా.. తెలుగు వెర్షన్లకు మాత్రం అయినకాడికి రేట్లు పెడుతున్నారని.. ఇలా ప్రేక్షకులను దోచుకుంటుంటే థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య మున్ముందు మరింత తగ్గిపోవడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News