జనాలు రావట్లేదంటారు.. వస్తే బాదేస్తారు

జనం లేక షోలు క్యాన్సిల్ చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. త్రినాథరావు మాటల్లో అతిశయోక్తేమీ లేదు.;

Update: 2025-04-27 13:30 GMT

ఈ మధ్యే 'చౌర్యపాఠం' అనే చిన్న సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్లో ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన దర్శకుడు త్రినాథరావు నక్కిన.. థియేటర్ల దుస్థితి గురించి తీవ్ర ఆవేదన స్వరంతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి దారుణంగా ఉందని.. జనం థియేటర్లకు రావట్లేదని.. స్టార్ల సినిమాలకు కూడా థియేటర్లు ఖాళీగా ఉంటున్నాయని.. జనం లేక షోలు క్యాన్సిల్ చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. త్రినాథరావు మాటల్లో అతిశయోక్తేమీ లేదు.

కొవిడ్ తర్వాత మారిన పరిస్థితుల్లో థియేటర్ల ఆక్యుపెన్సీలు బాగా పడిపోయాయి. ఓటీటీలకు అలవాటు పడ్డ ప్రేక్షకులు.. ఎప్పుడో కానీ థియేటర్లకు రావట్లేదు. చిన్న సినిమాల కోసం థియేటర్లకు జనాన్ని రప్పించడం చాలా కష్టమవుతోంది. మిడ్ రేంజ్ చిత్రాల పరిస్థితి కూడా బాగా లేదు.

ఐతే రోజు రోజుకూ పడిపోతున్న ఆక్యుపెన్సీలను చూసి ఓవైపు ఇండస్ట్రీ బెంబేలెత్తుతోంది. జనాన్ని థియేటర్లకు ఎలా రప్పించాలో తెలియక సతమతమవుతోంది. ఈ విషయంలో బాధ పడుతూనే.. ఇంకోవైపు ఏదైనా సినిమాకు క్రేజ్ కనిపించి, ప్రేక్షకులు థియేటర్లకు బాగా వస్తారనిపిస్తే చాలు.. టికెట్ల ధరలు పెంచేస్తున్నారు. గతంలో భారీ చిత్రాలకు మాత్రమే రేట్లు పెంచేవారు. కానీ ఇప్పుడు మిడ్ రేంజ్ చిత్రాలకు కూడా రేట్ల పెంచేస్తున్నారు.

సంక్రాంతి సినిమాల తర్వాత మంచి బజ్ క్రియేట్ చేసిన చిత్రాల్లో 'తండేల్' ఒకటి. దానికి ఏపీలో రేట్లు పెంచుకున్నారు. ఆ తర్వాత మళ్లీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న సినిమా 'హిట్-3'. దీనికీ ఏపీలో రేట్ల పెంపుకోసం దరఖాస్తు చేస్తున్నారట. తెలంగాణలో అవకాశం లేదు కాబట్టి ఆగిపోయారు. ఓవైపు ప్రేక్షకులు థియేటర్లకు రావట్లేదని హాహాకారాలు చేస్తూ.. ఇంకోవైపు వాళ్లు ఏదైనా సినిమాకు థియేటర్లకు వద్దాం అనుకుంటే చాలు.. ఈ రేట్ల పెంపు భారాన్ని మోపుతున్నారు. ఇది మరింతగా థియేటర్లకు ప్రేక్షకులను దూరం చేసే విషయం కాదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Tags:    

Similar News