చరణ్ 'పెద్ది'.. ఓవర్సీస్ ప్లాన్ ఎలా ఉందంటే?
అయితే ఇప్పుడు పెద్ది నార్త్ అమెరికా ఓవర్సీస్ హక్కులను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిరా సినిమాస్ దక్కించుకుంది.;
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఇప్పుడు పెద్ది మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా.. 1980స్ ఆంధ్రప్రదేశ్ బ్యాక్ డ్రాప్ తో సాగే పవర్ ఫుల్ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. సినిమాలో క్రికెట్ టోర్నమెంట్ థీమ్ కీలకంగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. చరణ్ కంప్లీట్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారని ఇప్పటికే విడుదలైన పోస్టర్లు చూస్తే అర్థమవుతుంది.
అయితే ఏప్రిల్ 30వ తేదీ సినిమా రిలీజ్ కానుండగా.. భారీ రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్ లో పెద్ది ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ రికార్డు స్థాయిలో అమ్ముడైనట్లు టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు పెద్ది నార్త్ అమెరికా ఓవర్సీస్ హక్కులను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిరా సినిమాస్ దక్కించుకుంది.
ఈ మేరకు మేకర్స్ తాజాగా సోషల్ మీడియాలో అనౌన్స్ చేశారు. ప్రపంచాన్ని జయించడానికి తన భూమి నుంచి వస్తున్నారంటూ రాసుకొచ్చారు. ప్రత్యంగిరా సినిమాస్ నార్త్ యూఎస్ లో రిలీజ్ చేస్తుందని చెబుతూ.. ప్రీమియర్స్ వేస్తున్న విషయాన్ని కూడా ప్రకటించారు. 29వ తేదీన ప్రీమియర్స్ ఉన్నాయని తెలిపారు. అదే సమయంలో మరోసారి రిలీజ్ డేట్ ను కూడా గుర్తు చేశారు.
అయితే మేకర్స్ పోస్టర్ కూడా రిలీజ్ చేయగా.. అది ఇప్పుడు వైరల్ గా మారింది. అందులో చరణ్.. లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో సీరియస్ లుక్ లో కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. పోస్టర్ అదిరిపోయిందని నెటిజన్లు, సినీ ప్రియులు కామెంట్లు పెడుతున్నారు. మూవీ కోసం వెయిట్ చేస్తున్నామని చెబుతున్నారు. బ్లాక్ బస్టర్ బొమ్మ అంటూ అభిమానులు సందడి చేస్తున్నారు.
కాగా.. పెద్ది నార్త్ అమెరికా రైట్స్ ను సుమారు 7 మిలియన్ డాలర్లకు (భారతీయ కరెన్సీలో దాదాపు రూ.29 కోట్లు) ప్రత్యంగిరా సినిమాస్ దక్కించుకున్నట్లు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. డీల్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ లేకపోయినా వార్తలు వైరల్ అవుతున్నాయి. నార్త్ అమెరికా కాకుండా మిగతా ప్రపంచ దేశాల మార్కెట్ లో మరో 2.5 మిలియన్ డాలర్లు (రూ.10- 11 కోట్లు)వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో నిజమెంతో మాత్రం తెలియదు.
సినిమా విషయానికొస్తే.. రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తున్నారు. కీలక పాత్రల్లో సీనియర్ యాక్టర్స్ శివ రాజ్ కుమార్, జగపతి బాబు కనిపించనున్నారు. ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కూడా నిర్మాణంలో భాగమయ్యాయి. మరి సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.