ఆ విషయంలో ఎందుకు లాజిక్ మిస్ అయ్యారు?

త్రేతాయుగం నేపథ్యంలో రూపొందుతున్న సినిమాలో రోల్స్ క్యారక్టరైజేషన్ విషయంలో మేకర్స్ ఎందుకు జాగ్రత్త తీసుకోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Update: 2026-07-31 10:53 GMT

భారీ బడ్జెట్‌, అద్భుతమైన విజువల్స్‌, స్టార్ క్యాస్టింగ్.. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో ప్రేక్షకుల ముందుకు రానున్న రామాయణ మూవీ ట్రైలర్‌ కు ఒకవైపు ప్రశంసలు దక్కుతుండగా, మరోవైపు అదే ట్రైలర్‌ లోని కొన్ని లుక్స్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. ముఖ్యంగా కైకేయి రోల్ లో కనిపించిన లారా దత్తా గెటప్‌ పై నెటిజన్లు ప్రశ్నలు వేస్తున్నారు. త్రేతాయుగం నేపథ్యంలో రూపొందుతున్న సినిమాలో రోల్స్ క్యారక్టరైజేషన్ విషయంలో మేకర్స్ ఎందుకు జాగ్రత్త తీసుకోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ట్రైలర్‌ లో లారా దత్తా ధరించిన శారీ, హాఫ్ స్లీవ్ డిజైనర్ బ్లౌజ్, స్ట్రైట్ హెయిర్‌ స్టైల్‌ ను చూసిన పలువురు నెటిజన్లు ఇవి పౌరాణిక కథకు సరిపోయేలా లేవని వ్యాఖ్యానిస్తున్నారు. త్రేతాయుగానికి చెందిన రాణి పాత్రను ఆధునిక ఫ్యాషన్‌ కు దగ్గరగా చూపించడం సహజంగా అనిపించలేదని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. కొందరైతే ఆమె లుక్‌ ను చూసి పౌరాణిక సినిమా కంటే టెలివిజన్ సీరియల్‌ ను గుర్తు చేసిందని కామెంట్ చేస్తున్నారు.

ఇది కేవలం లారా దత్తా వరకే పరిమితం కాలేదు. సీత పాత్రలో నటిస్తున్న సాయి పల్లవి కాస్ట్యూమ్స్‌ పైనా కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చీరలు, బ్లౌజ్‌ లు, హెయిర్ స్టైలింగ్‌ లో మోడ్రన్ స్టైల్ ఎక్కువగా కనిపిస్తోందని, పురాణ గాథకు తగ్గట్లు కనిపించడం లేదని విమర్శిస్తున్నారు. అయితే మరోవైపు ఇవి దర్శకుడి క్రియేటివిటీలో భాగమని, సినిమాను పూర్తిగా చూసిన తర్వాతే తుది అభిప్రాయం చెప్పాలని మరికొందరు అభిమానులు స్పందిస్తున్నారు.

పౌరాణిక కథలను తెరపై చూపించే సమయంలో ప్రేక్షకుల అంచనాలు సాధారణ సినిమాల కంటే భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా డ్రెస్సింగ్, ఆభరణాలు, హెయిర్ స్టైలింగ్ వంటి అంశాల్లో కాలానికి తగిన నేచురాలిటీని ప్రేక్షకులు కోరుకుంటారు. అందుకే ట్రైలర్‌ లో కనిపించిన చిన్న చిన్న డిజైన్ సెలక్షన్లు కూడా సోషల్ మీడియాలో పెద్ద చర్చకు కారణమయ్యాయి. విజువల్ గ్రాండియర్ ఎంత ఉన్నా, ఇలాంటి వివరాల్లో ఒరిజినాలిటీ ఉండాలనే అభిప్రాయం వినిపిస్తోంది.

అయితే ట్రైలర్‌ కు వచ్చిన రెస్పాన్స్ కంప్లీట్ గా నెగిటివ్ ఏం కాదు. రణబీర్ కపూర్, యశ్, సాయి పల్లవి యాక్టింగ్ తో పాటు విజువల్ ఎఫెక్ట్స్‌, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌, వార్ సీన్స్ డిజైనింగ్ కు ప్రశంసలు లభిస్తున్నాయి. అదే సమయంలో పాత్రల కాస్ట్యూమ్స్‌ పై వస్తున్న విమర్శలు మాత్రం మూవీ టీమ్ దృష్టికి వెళ్లే అవకాశముందని సమాచారం.

నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. రణబీర్ కపూర్, యశ్, సాయి పల్లవి, లారా దత్తా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తొలి భాగాన్ని దీపావళి సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ట్రైలర్‌ తో భారీ అంచనాలు పెరిగిన ఆ సినిమాపై ప్రస్తుతం ప్రశంసలతో పాటు కాస్ట్యూమ్ డిజైన్‌ కు సంబంధించిన చర్చ కొనసాగుతోంది. ఇప్పుడు ఆ విమర్శలపై మూవీ టీమ్ ఏ విధంగా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News