ప‌ర‌మ్ సుంద‌రి పై క‌లిదాస్ జ‌య‌రామ్ సెన్సేష‌న‌ల్ కామెంట్స్

బాలీవుడ్ సినిమాల్లో దక్షిణ భారతీయుల రిప్రెజెంటేష‌న్ పై తరచుగా విమర్శలు వినిపిస్తుంటాయి. కొన్నిసార్లు అతిగా, మరికొన్నిసార్లు డైరెక్ట్ స్టీరియోటైప్‌ల రూపంలో చూపించడం ప్రేక్షకుల్లో అసంతృప్తిని కలిగిస్తోంది.;

Update: 2026-02-27 17:03 GMT

బాలీవుడ్ సినిమాల్లో దక్షిణ భారతీయుల రిప్రెజెంటేష‌న్ పై తరచుగా విమర్శలు వినిపిస్తుంటాయి. కొన్నిసార్లు అతిగా, మరికొన్నిసార్లు డైరెక్ట్ స్టీరియోటైప్‌ల రూపంలో చూపించడం ప్రేక్షకుల్లో అసంతృప్తిని కలిగిస్తోంది. ఇటీవ‌ల రిలీజైన బాలీవుడ్ మూవీ ప‌ర‌మ్ సుంద‌రి ఈ అంశంపై మరోసారి చర్చకు దారి తీసింది. త‌మిళ‌, మ‌ల‌యాళ సినిమాల్లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న క‌లిదాస్ జ‌య‌రామ్ ఈ సినిమాపై త‌న అభిప్రాయాన్ని బ‌హిరంగంగా వ్య‌క్తం చేశారు.

ప‌ర‌మ్ సుంద‌రి సినిమాపై ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో విస్తృత చ‌ర్చ‌కు దారి తీశాయి. ఎంతో మంది ఆడియ‌న్స్ కూడా ఆయన అభిప్రాయానికి మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. జాన్వీ క‌పూర్, సిద్ధార్థ్ మ‌ల్హోత్రా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమాకు తుషార్ జ‌లోతా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా, మ‌డోక్ ఫిల్మ్ ప‌ర‌మ్ సుంద‌రి సినిమాను నిర్మించింది.

నార్త్ అబ్బాయి, సౌత్ అబ్బాయి మ‌ధ్య జ‌రిగే మీట్- క్యూట్ ప్రేమ క‌థ‌గా తెర‌కెక్కిన ప‌ర‌మ్ సుంద‌రిలో సంస్కృతిని ప్ర‌తిబింబించే విష‌యంలో లోపాలున్నాయ‌ని ఎంతో మంది అభిప్రాయ‌ప‌డ‌గా, జ‌య‌రామ్ ఈ సినిమా గురించి చాలా దారుణమైన వ్యాఖ్య‌లు చేశారు. రీసెంట్ టైమ్స్ లో తాను చూసిన సినిమాల్లో ఈ సినిమానే అత్యంత నిరాశ క‌లిగించిన సినిమా అని, ముఖ్యంగా సౌత్ ఇండియ‌న్ క‌ల్చ‌ర్, సంప్ర‌దాయాల‌ను స‌ర‌దాగా చూపించే ప్ర‌య‌త్నం చేయ‌డం ఎంతో బాధాక‌ర‌మ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

క‌ల్చ‌ర్ ను స‌ర‌దాగా మార్చ‌డం కాకుండా, దాన్ని గౌర‌వంగా చూపించాల్సిన బాధ్య‌త సినీ మేక‌ర్స్‌దే అనే భావాన్ని కూడా జ‌య‌రామ్ వ్య‌క్త‌ప‌రిచారు. కాగా ఈ విష‌యంలో ఎంతోమంది ఫ్యాన్స్ ఆయ‌న అభిప్రాయానికి మ‌ద్దుతు తెలిపారు. కొన్ని సీన్స్ లో చూపించిన అంశాలు ద‌క్షిణ భార‌త జీవ‌న‌శైలిన త‌ప్పుగా చూపించాయ‌ని వారు పేర్కొన్నారు. ఉత్తర భార‌తీయుల్లో సాధార‌ణంగా ఉన్న కొన్ని అపోహ‌ల‌ను క‌థ‌లో నేరుగా వినియోగించ‌డం వ‌ల్ల అస‌హ‌జ‌త పెరిగింద‌ని విమ‌ర్శ‌కులు అభిప్రాయ‌ప‌డ్డారు.

భార‌త‌దేశం లాంటి వైవిధ్య‌భ‌రిత దేశంలో ప్రాంతీయ సంస్కృతుల్ని సున్నితంగా, స‌మ‌గ్రంగా చూపించ‌డం ఎంతో అవ‌స‌ర‌మ‌ని, కేవ‌లం కొన్ని గుర్తింపు చిహ్నాల ఆధారంగా ఒక ప్రాంతాన్ని నిర్వ‌చించ‌డం వాస్త‌వాన్ని ప్ర‌తిబింబించ‌ద‌ని విశ్లేష‌కులు చెప్తున్నారు. అందుకే ఏదైనా సినిమా తీసే ముందు స‌రైన రీసెర్చ్, స్థానిక భావ‌జాలంపై అవ‌గాహ‌న లేకుండా తీస్తే అవి వివాదాల‌కు దారి తీసే అవ‌కాశ‌ముంద‌ని వారు హెచ్చ‌రిస్తున్నారు. ఈ సినిమా చుట్టూ నెల‌కొన్న వివాదం, బాలీవుడ్ లో సంస్కృతి ప్ర‌తినిధిత్వంపై మ‌రింత బాధ్య‌తాయుత‌మైన దృష్టికోణానికి నాంది కావ‌చ్చ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Tags:    

Similar News