పాన్ ఇండియా హీరోల పారితోషికం రేంజ్ 300 కోట్లు?

మొత్తానికి, కేవలం నటులుగానే కాకుండా సినిమా నిర్మాణ భాగస్వాములుగా, వ్యాపారవేత్తలుగా ఎదగడం వల్లే ఈ అగ్రనటులు రూ. 300 కోట్ల ఆదాయాన్ని అందుకోగలుగుతున్నారు.;

Update: 2026-02-27 16:30 GMT

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల పారితోషికాలు ఇప్పుడు ఊహించని స్థాయికి చేరుకున్నాయి. గతంలో 10 కోట్ల రూపాయల పారితోషికం అంటేనే పెద్ద విషయంగా ఉండేది.. అది 100 కోట్లు , 200 కోట్ల‌ను అధిగ‌మించింది. ఇప్పుడు కేవలం నటనకు ఇచ్చే ఫీజుతో పాటు లాభాల్లో వాటా కలుపుకుంటే.. ఒక సినిమాకు రూ.300 కోట్ల ఆదాయాన్ని అందుకునే స్థాయికి అగ్రనటులు చేరుకుంటున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ విస్తృతమై, దేశవ్యాప్త ఓపెనింగ్స్ రాబడుతున్న క్రమంలో ప్రభాస్, షారూఖ్ ఖాన్ వంటి నటులకు ఈ మైలురాయిని చేరుకోవడం అసాధ్యమేమీ కాదని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద అత్యధిక డిమాండ్ ఉన్న హీరోగా ప్రభాస్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఆయనకు ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా దేశవ్యాప్తంగా ఉన్న విపరీతమైన క్రేజ్, బాహుబ‌లి 1, బాహుబ‌లి 2, కల్కి 2898 AD, సలార్ వంటి భారీ చిత్రాల విజయాలు అతడి మార్కెట్ విలువను మరో స్థాయికి తీసుకెళ్లాయి. సందీప్ వంగా స్పిరిట్ తో ప్ర‌భాస్ రేంజ్ అమాంతం మారిపోతుంద‌ని అంచ‌నాలున్నాయి. మరోవైపు షారూఖ్ ఖాన్ పఠాన్, జవాన్ చిత్రాలతో కేవలం పారితోషికమే కాకుండా లాభాల్లో పెద్ద మొత్తాన్ని వాటాగా తీసుకుంటూ ఈ రూ. 300 కోట్ల క్లబ్‌లో ఇప్పటికే స్థిరపడినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఇద్దరు హీరోలు ప్రస్తుతం తమ సినిమాల బిజినెస్ మోడల్స్‌ను పూర్తిగా మార్చేశారు.

వీరితో పాటు అల్లు అర్జున్, యష్ వంటి హీరోలు కూడా ఈ రేసులో గట్టి పోటీని ఇస్తున్నారు. `పుష్ప 2` చిత్రం కోసం అల్లు అర్జున్ తీసుకుంటున్న పారితోషికం, హిందీ రైట్స్ వాటా కలిపితే అత‌డి ఆర్జ‌న‌ ఇప్పటికే 250 కోట్ల‌ నుండి రూ.300 కోట్ల వరకు ఉండవచ్చని వార్త‌లు వ‌చ్చాయి. అలాగే తన తదుపరి చిత్రాలకు గ్లోబల్ మార్కెట్‌లో భారీ డీల్స్ కుదుర్చుకుంటున్న యష్, రాజమౌళితో గ్లోబల్ ప్రాజెక్ట్ వార‌ణాసి (SSMB29) ద్వారా మహేష్ బాబు కూడా ఈ మైలురాయిని అందుకోగలరని ట్రేడ్ వర్గాల అంచనా. `KGF` సిరీస్‌తో ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న యష్, తన తదుపరి చిత్రం `టాక్సిక్`, `రామాయణ్` (రావణుడిగా) చిత్రాల కోసం భారీ ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

గ్లోబల్ ఆడియన్స్‌ను ఆకట్టుకునే సత్తా ఉండటంతో నిర్మాతలు కూడా అత‌డిపై భారీగా పెట్టుబడి పెట్టేందుకు వెనకాడటం లేదు. రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి హీరోలు కూడా ఆర్.ఆర్.ఆర్ త‌ర్వాత‌ అంతర్జాతీయంగా పెరిగిన క్రేజ్ దృష్ట్యా ఈ క్లబ్‌లో చేరే అవకాశం ఎక్కువగా ఉంది. చ‌ర‌ణ్ కి పెద్ది, ఎన్టీఆర్ కి డ్రాగ‌న్ విజ‌యాలు అత్యంత కీల‌కం కానున్నాయి. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియాలో సాధించే వ‌సూళ్లు చాలా విష‌యాల‌ను డిసైడ్ చేస్తాయ‌ని అంచ‌నా. త‌మిళంలో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ఒక్కో సినిమాకి ఏకంగా 225 కోట్లు పైగా అందుకుంటున్నార‌ని క‌థనాలొస్తున్నాయి. ద‌ళ‌ప‌తి విజ‌య్ కూడా 200కోట్లు పైగా పారితోషికం అందుకున్నార‌ని క‌థ‌నాలున్నాయి.

మొత్తానికి, కేవలం నటులుగానే కాకుండా సినిమా నిర్మాణ భాగస్వాములుగా, వ్యాపారవేత్తలుగా ఎదగడం వల్లే ఈ అగ్రనటులు రూ. 300 కోట్ల ఆదాయాన్ని అందుకోగలుగుతున్నారు. రణ్‌వీర్ సింగ్, విక్కీ కౌశల్ వంటి నటులు ప్రస్తుతం రూ.100 - రూ.150 కోట్ల రేంజ్‌లో ఉన్నప్పటికీ, సోలోగా బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ లేదా షారూఖ్ స్థాయి ఓపెనింగ్స్ సాధించడం వారికి ఒక సవాలుగానే ఉంది. భవిష్యత్తులో ఈ పారితోషికాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండగా, ప్రేక్షకులకు మాత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద పండుగలాంటి చిత్రాలు లభించడం విశేషం.

ఒక‌ప్ప‌టితో పోలిస్తే ...

ఒకప్పుడు వంద కోట్ల వసూళ్లు సాధిస్తే గొప్ప అనుకున్న దశ నుంచి, ఇప్పుడు ఏకంగా ఒక హీరో పారితోషికమే రూ.300 కోట్లకు చేరడం ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురి చేస్తోంది. ఈ భారీ మొత్తం కేవలం నటనకు ఇచ్చే ఫీజు మాత్రమే కాదు. గ్లోబల్ మార్కెట్ రైట్స్, డిజిటల్ ఆదాయం, సినిమా లాభాల్లో వాటా వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ అంకెను చేరుకోవడం అసాధ్యమేమీ కాదని ప్రస్తుత పరిణామాలు నిరూపిస్తున్నాయి. ముఖ్యంగా పాన్-ఇండియా స్టార్స్ ఇమేజ్ దేశ సరిహద్దులు దాటడం ఈ విప్లవాత్మక మార్పుకు ప్రధాన కారణం.

Tags:    

Similar News