సెక్యూరిటీ కానిస్టేబుల్ మృతి.. ప్రయివేట్ సెక్యూరిటీ కోసం సల్మాన్ కోట్లు ఖర్చు!
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ముంబైలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్ నివాసం వద్ద శనివారం ఒక తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ముంబైలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్ నివాసం వద్ద శనివారం ఒక తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. సల్మాన్ ఖాన్ భద్రత కోసం విధుల్లో ఉన్న 41 ఏళ్ల ముంబై పోలీస్ కానిస్టేబుల్ గణేష్ హఠాత్తుగా కుప్పకూలి మరణించారు.
పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం..విధి నిర్వహణలో ఉండగానే గణేష్ ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయారు. వెంటనే తోటి సిబ్బంది ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించినా.. పరిశీలించిన వైద్యులు ఆయన మార్గమధ్యలోనే మృతి చెందినట్లు ధృవీకరించారు. ప్రాథమిక నివేదికల ప్రకారం తీవ్రమైన గుండెపోటే ఆయన మరణానికి కారణమని తేలింది.
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా నుండి వరుస బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో సల్మాన్ ఖాన్ నివాసం వద్ద ముంబై పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక సెక్యూరిటీ కవరేజీలో భాగమైన కానిస్టేబుల్ గణేష్ అకస్మాత్తుగా మరణించడం అక్కడి భద్రతా సిబ్బందిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఈ విషాద వార్త సామాజిక మాధ్యమాల్లో వ్యాపించడంతో నెటిజన్లు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. దివంగత కానిస్టేబుల్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలని నెటిజన్లు ఆర్.ఐ.పి కామెంట్లతో శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు.
ప్రైవేట్ సెక్యూరిటీకే కోట్ల ఖర్చు!
సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి నిరంతరం వస్తున్న ప్రాణహాని హెచ్చరికల నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనకు వై-ప్లస్ కేటగిరీ భద్రతను కేటాయించింది. ముంబై పోలీస్ శాఖ నిరంతరం ఆయన నివాసం గెలాక్సీ అపార్ట్‌మెంట్ వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నా.. సల్మాన్ తన సొంత రక్షణ కోసం ప్రభుత్వ భద్రతపై మాత్రమే ఆధారపడటం లేదు. తన కుటుంబం, తన వ్యక్తిగత భద్రతను మరింత బలోపేతం చేసుకోవడానికి ఆయన ప్రతి నెలా లక్షల రూపాయలు వెచ్చించి అత్యున్నత స్థాయి ప్రైవేట్ సెక్యూరిటీ బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
సల్మాన్ ఖాన్ తన వ్యక్తిగత భద్రత కోసం నెలకు సుమారు 15 లక్షల నుండి 20 లక్షల వరకు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. అందులోనూ గత పాతికేళ్లుగా ఆయనకు నీడలా ఉంటున్న చీఫ్ బాడీగార్డ్ షేరాకే ఏడాదికి దాదాపు 2 కోట్ల నుండి 2.5 కోట్ల వరకు జీతంగా చెల్లిస్తున్నారు. ఇవే కాకుండా విదేశాల నుండి ప్రత్యేకంగా దిగుమతి చేసుకున్న బుల్లెట్ ప్రూఫ్ నిస్సాన్ పెట్రోల్ ఎస్.యు.వి, మెర్సిడెస్ కార్లు.. నిఘా పరికరాల కొనుగోలుతో కలిపి.. గత కొన్నేళ్లలో సల్మాన్ తన భద్రత కోసం ఇప్పటివరకు ఏకంగా 15 కోట్ల నుండి 20 కోట్ల వరకు వెచ్చించినట్లు రిపోర్టులు చెబుతున్నాయి .