బాక్సాఫీస్ వద్ద వైలెన్స్ జోరు!
రొమాంటిక్ డ్రామాలు, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లతో అలరించిన అగ్ర హీరోలు ఇప్పుడు బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి రక్తపాతంతో కూడిన మాస్ యాక్షన్ జానర్‌ను ఎంచుకుంటున్నారు.
రొమాంటిక్ డ్రామాలు, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లతో అలరించిన అగ్ర హీరోలు ఇప్పుడు బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి రక్తపాతంతో కూడిన మాస్ యాక్షన్ జానర్‌ను ఎంచుకుంటున్నారు. ప్రేక్షకులలో రక్తం మరిగించే ఫైట్లు, ఊరమాస్ ఎలివేషన్లకు క్రేజ్ పెరగడంతో దర్శక-నిర్మాతలు సైతం భారీ బడ్జెట్‌తో సరికొత్త వైలెంట్ డ్రామాలను తెరకెక్కించేందుకు పోటీ పడుతున్నారు. ఈ భారీ యాక్షన్ జాబితాలో నాని నటిస్తోన్న మోస్ట్ అవేటెడ్ మూవీ `పారడైస్` సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. వైవిధ్యమైన కథలతో పాటు విభిన్న పాత్రలు పోషించే నాని ఈసారి పూర్తి స్థాయి వైలెంట్ మాస్ యాక్షన్ అవతారంలో కనిపించనున్నారు.
`దసరా`ను మంచిన మాస్ యాంగిల్ ప్యారడైజ్ లో ఉంటుందని చెప్పొచ్చు. పాన్-ఇండియా స్టార్ యశ్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం `టాక్సిక్` ఆగస్ట్ 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులోనూ అత్యంత క్రూరమైన యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండబోతున్నట్లు సమాచారం. యశ్ పాత్ర ఆద్యం ఆకట్టుకుంటుందని...రెగ్యులర్ మాస్ రోల్స్ కు పూర్తి భిన్నంగా ఈ రోల్ ఉంటుందని వినిపిస్తోంది. యువ హీరోలే కాకుండా సీనియర్ స్టార్స్ కూడా ఈ వైలెంట్ ట్రెండ్‌కు ఏమాత్రం తీసిపోవడం లేదు. సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న సంచలన చిత్రం `జైలర్ 2` బాక్సాఫీస్‌ను కుదిపేసేందుకు సిద్ధమవుతోంది.
మొదటి భాగం అందించిన భారీ విజయంతో సీక్వెల్‌లో యాక్షన్ మోతాదును రెట్టింపు చేసినట్లు తెలుస్తోంది. అలాగే టాలెంటెడ్ హీరో ధనుష్ నటిస్తోన్న`ఓం` చిత్రం కూడా భారీ రక్తపాతం, ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో తెరకెక్కుతుండటం విశేషం. ఈ చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాయడానికి సర్వసిద్ధం అవుతున్నాయి. సినిమాల్లో ఈ రకమైన వైలెన్స్ పెరగడానికి ప్రధాన కారణం ప్రేక్షకుల అభిరుచుల్లో వస్తోన్న మార్పులే అని విశ్లేషకులు భావిస్తున్నారు.
సాధారణ కథల కంటే గూస్‌బంప్స్ తెప్పించే యాక్షన్ బ్లాక్స్, హై-వోల్టేజ్ డ్రామాలు ప్రేక్షకులను థియేటర్లకు క్యూ కట్టేలా చేస్తున్నాయి. దర్శకులు కూడా ఫైట్లకోసం ఫైట్లు కాకుండా, బలమైన భావోద్వేగాలను వైలెన్స్‌తో మిక్స్ చేసి తెరకెక్కించడంలో సఫలమవుతున్నారు. దీంతో తెరపై కనిపించే హింస కేవలం క్రూరత్వంగా కాకుండా కథలో ముఖ్యమైన భాగంగా ప్రేక్షకులను కట్టిపడేస్తోంది.
అయితే ఈ వైలెంట్ సినిమాల జోరుపై మరోవైపు భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నప్పటికీ చిన్న పిల్లలు , కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు దూరమయ్యే పరిస్థితి వస్తోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సినిమాకు `ఏ`లేదా `యూ/ఏ` సర్టిఫికెట్ రావడం విపరీతమైన రక్తపాతం ఉండటం వల్ల సినిమాల పరిధి కొంతమేర పరిమితమవుతోంది. అయినా నిర్మాతలు పెట్టిన పెట్టుబడులను రాబట్టడానికి యాక్షన్ ఫార్ములానే అత్యంత నమ్మకమైన మార్గంగా మారుతోంది.
చివరిగా రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ పోరు మరింత రసవత్తరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. వరుసబెట్టి వస్తున్న భారీ యాక్షన్ చిత్రాలు కలెక్షన్ల పరంగా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాయో? చూడాలి. ఏదేమైనా? ఇండియన్ సినిమా బాక్సాఫీస్ రూపురేఖలను వైలెంట్ యాక్షన్ చిత్రాలే శాసిస్తున్నాయనడంలో సందేహం లేదు.