'ది ఫ్యామిలీ మేన్ సీజన్ -4'.. ముగించేస్తున్నాం అంటూనే!
ఈ నేపథ్యంలో తాజా సీజన్ గురించి మనోజ్ బాజ్‌పాయ్ న్యూస్ 18తో కొన్ని ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసారు.
మనోజ్ బాజ్‌పాయ్ ప్రధాన పాత్రలో నటించిన `ది ఫ్యామిలీ మ్యాన్` సిరీస్ భారతదేశంలోనే అత్యంత ఆదరణ పొందిన వెబ్ సిరీస్‌లలో ఒకటి. ఒక సాదాసీదా మధ్యతరగతి ప్రభుత్వ ఉద్యోగిగా కనిపిస్తూనే... దేశాన్ని రక్షించే రహస్య గూఢచారి శ్రీకాంత్ తివారీగా మనోజ్ బాజ్‌పాయ్ నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటికే విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ సిరీస్ తదుపరి సీజన్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ సాధించింది. ఇటీవలే విడుదలైన మూడో సీజన్ ముగింపుపై ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. త్వరలోనే నాలుగో సీజన్ అధికారిక వార్త వెలువడుతుందని.. అందులో అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయని మనోజ్ బాజ్‌పాయ్ స్వయంగా ధృవీకరించారు.
ఈ నేపథ్యంలో తాజా సీజన్ గురించి మనోజ్ బాజ్‌పాయ్ న్యూస్ 18తో కొన్ని ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసారు. ప్రస్తుతం ఈ సిరీస్ సృష్టికర్తలు రాజ్ అండ్ డీకే తమ మరో ప్రాజెక్ట్ `ఫర్జీ` తదుపరి భాగం షూటింగ్‌లో బిజీగా ఉన్నారని తెలిపారు. అది పూర్తయిన వెంటనే `ది ఫ్యామిలీ మ్యాన్` కొత్త సీజన్‌పై దృష్టి పెడతారని చెప్పారు. ప్రస్తుతం స్క్రిప్ట్ చివరి డ్రాఫ్ట్ పూర్తి కావాల్సి ఉందని... ఆ తర్వాత నటీనటుల కాల్‌షీట్స్ తీసుకుంటారని స్పష్టం చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియోతో ప్రాథమిక చర్చలు జరిగాయని.. ప్రస్తుతానికి వారి ధ్యాస అంతా `ఫర్జీ సీజన్ 2` పైనే ఉందని వివరించారు.
సిరీస్ ఎప్పుడు విడుదల కావచ్చు అనే విషయంపై కూడా మనోజ్ బాజ్‌పాయ్ ఒక అంచనాకు వచ్చారు. ఈసారి ప్రేక్షకులు ఎక్కువ కాలం వేచి చూడాల్సిన అవసరం ఉండదని.. వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో ఈ సరికొత్త సీజన్ వచ్చే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాజ్ అండ్ డీకే ఫర్జీ2 షూటింగ్ పూర్తి చేసిన వెంటనే దీనిపైనే పూర్తి స్థాయిలో వర్క్ స్టార్ట్ చేస్తారని.. కాబట్టి షూటింగ్ చాలా వేగంగా మొదలవుతుందని మనోజ్ భాజ్ పాయ్ నమ్మకంగా చెప్పారు.
ప్రస్తుతానికి సిరీస్ సీజన్ 4 భవిష్యత్తుపై భాజ్ పాయ్ ఒక కీలకమైన అప్‌డేట్ ఇచ్చారు. ఒప్పందాల ప్రకారం చూస్తే.. నాలుగో సీజన్‌తో తమ కాంట్రాక్టులు ముగుస్తున్నాయని అతడు తెలిపారు. దీంతో పాటు మనోజ్ భాజ్ పాయ్ మరిన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చారు. సీజన్ 4తో రాజ్ అండ్ డీకే ముగించేస్తారా? అన్న ప్రశ్నకు .. అస్సలు నాకు ఐడియా లేదు. అమెజాన్ ప్రైమ్ వాళ్లు దర్శకులకు మరింత అదనపు డబ్బు ఇచ్చి సిరీస్ ని కొనసాగించినా ఆశ్చర్యపోనవసరం లేదని నవ్వుతూ ఛమత్కారంగా చెప్పారు. అయితే తనకు తెలిసినంతవరకూ ... నాలుగో సీజన్‌తో ప్రస్తుత కథ ముగుస్తుందని.. ఆ తర్వాత సిరీస్‌ను కొనసాగించాలా వద్దా అనేది ప్రైమ్ వీడియో నిర్ణయంపై ఆధారపడి ఉంటుందనే క్లారిటీ ఇచ్చారు.
`ది ఫ్యామిలీ మ్యాన్` అనేది యాక్షన్, హ్యూమర్, ఎమోషన్స్ కలగలిసిన ఒక అద్భుతమైన స్పై థ్రిల్లర్ సిరీస్. దేశ భద్రతకు సంబంధించిన అత్యంత ప్రమాదకరమైన మిషన్లలో పాల్గొంటూనే.. మరోవైపు తన కుటుంబ జీవితాన్ని.. వ్యక్తిగత సమస్యలను సమతుల్యం చేసుకోవడానికి శ్రీకాంత్ తివారీ పడే తాపత్రయం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఉగ్రవాదం, రాజకీయం... ఒక గూఢచారి రహస్య జీవితం వెనుక ఉండే త్యాగాలను ఎంతో వాస్తవికంగా చూపించిన ఈ సిరీస్ తదుపరి సీజన్‌తో మరింత రసవత్తరంగా సాగనుందని అర్థమవుతోంది.