మ‌రో ప్ర‌యోగానికి రెడీ అయిన సూర్య‌

ఇప్పుడు మరోసారి అలాంటి విభిన్నమైన ప్రయోగానికి సూర్య సిద్ధమవుతున్నట్టు కోలీవుడ్ వర్గాల్లో బలమైన చర్చ జరుగుతోంది.

Update: 2026-06-03 06:43 GMT

కంటెంట్‌కు ప్రాధాన్యం ఇచ్చే స్టార్ హీరోల లిస్ట్ లో సూర్య పేరు ఎప్పుడూ ప్రత్యేకంగా నిలుస్తుంది. కమర్షియల్ సినిమాలతో పాటు ప్రేక్షకులను ఆలోచింపజేసే కథలను ఎంచుకోవడంలో ఆయన చూపించే ధైర్యం సౌత్ లో చాలా అరుదుగా కనిపిస్తుంది. ఇప్పుడు మరోసారి అలాంటి విభిన్నమైన ప్రయోగానికి సూర్య సిద్ధమవుతున్నట్టు కోలీవుడ్ వర్గాల్లో బలమైన చర్చ జరుగుతోంది. జై భీమ్ తర్వాత డైరెక్ట‌ర్ టీజే జ్ఞానవేల్‌తో మరోసారి చేతులు కలపబోతున్న సూర్య, ఈసారి ప్రముఖ డాక్టర్ కృష్ణ వరదాచారి తిరువేంగడం జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించనున్నారనే వార్త ఆసక్తిని రేకెత్తిస్తోంది.

సూర్య కెరీర్‌ను పరిశీలిస్తే రియల్ లైఫ్ హీరోల కథలపై ఆయనకు ప్రత్యేకమైన ఆసక్తి కనిపిస్తుంది. సూరరై పొట్రులో సాధారణ వ్యక్తి అసాధారణ విజయాన్ని, జై భీమ్‌లో అణగారిన వర్గాల కోసం పోరాడిన న్యాయయోధుడి కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన సూర్య, ఇప్పుడు మరోసారి సమాజానికి సేవ చేసిన మహనీయుడి జీవితాన్ని ఎంచుకోవడం విశేషం. డాక్టర్ తిరువేంగడం పేరు తమిళనాడులో పేదల పాలిట దేవుడిగా నిలిచిపోయింది. పెద్ద హాస్పిటల్స్ భారీ ఫీజులు వసూలు చేస్తున్న కాలంలో ఆయన కేవలం రెండు లేదా ఐదు రూపాయల కన్సల్టేషన్ ఫీజుతో వైద్యం అందించేవారు. ఛాతీ వ్యాధుల నిపుణుడిగా అపారమైన గుర్తింపు పొందిన ఆయనను చాలామంది వాకింగ్ ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ మెడిసిన్‌గా కొనియాడేవారు. అలాంటి వ్యక్తిత్వాన్ని తెరపై ఆవిష్కరించడం నటుడిగా సూర్యకు మరో సవాల్‌గా మారనుంది.

ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి పెరగడానికి మరో ప్రధాన కారణం టీజే జ్ఞానవేల్. జై భీమ్ రూపంలో సూర్యకు కెరీర్‌లో గుర్తుండిపోయే క్లాసిక్ అందించిన ఆయన, తర్వాత రజనీకాంత్‌తో వేట్టయన్ తెరకెక్కించినా అది ఆశించిన స్థాయిలో స‌క్సెస్ ను అందుకోలేకపోయారు. దీంతో మళ్లీ సూర్యతో జతకట్టి ఎమోష‌న్స్, సోష‌ల్ మెసేజ్, హ్యూమ‌న్ వాల్యూస్ కలిసిన కథను ఎంచుకున్నారనే ప్రచారం జరుగుతోంది. జై భీమ్ స్థాయిలో ప్రేక్షకులను కదిలించే ఎమోషన్స్, ఆలోచింపజేసే సంఘటనలు ఈ బయోపిక్‌లోనూ ఉండే అవకాశముందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

ముఖ్యంగా ఇటీవల భారీ స‌క్సెస్ తో కెరీర్‌లో కొత్త ఉత్సాహాన్ని అందుకున్న సూర్య, పూర్తిగా మాస్ కమర్షియల్ ట్రాక్‌లో వెళ్లకుండా మరోసారి కంటెంట్ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ ను ఎంచుకోవడం ఆయన సినీ ప్రయాణాన్ని ప్రతిబింబిస్తోంది. బాక్సాఫీస్ ఫార్ములాల కంటే మంచి కథలపై నమ్మకం ఉంచే సూర్య, నటుడిగా కొత్త కోణాలను అన్వేషించడంలో ఎప్పుడూ ముందుంటారు. డాక్టర్ తిరువేంగడం బయోపిక్ వార్త నిజమైతే, అది సూర్య కెరీర్‌లో మరో స్పెషల్ రోల్‌గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ ఇంకా రాక‌పోయిన‌ప్ప‌టికీ, జై భీమ్ కాంబో మరోసారి కలుస్తోందనే వార్త మాత్రం ఇప్పటికే సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Tags:    

Similar News