'సూపర్ సుబ్బు' వెబ్ సిరీస్ రివ్యూ
మన సినిమాల్లో హీరోయిన్లతో హద్దులు దాటి ఎక్స్పోజింగ్ చేయించడం.. రొమాంటిక్ సన్నివేశాలను చాలా ఘాటుగా చూపించడం దశాబ్దాల ముందు నుంచే ఉన్నప్పటికీ.. పడక గదిలో విషయాల గురించి ఓపెన్ గా చర్చించే కథాంశాలతో సినిమాలు తీయడం మాత్రం అరుదే.
నటీనటులు: సందీప్ కిషన్- మిథిలా పార్కర్- మానస చౌదరి- మురళీ శర్మ- గెటప్ శీను- సంపూర్ణేష్ బాబు- జీవన్ తదితరులు
సంగీతం: అనుదీప్ దేవ్
ఛాయాగ్రహణం: ఏజే ఆరోన్
నిర్మాతలు: రాజీవ్ చిలక- భరత్ లక్ష్మీపాటి
రచన: మల్లిక్ రామ్- రమేష్ ఎలిగేటి- శివాని దోబల్
దర్శకత్వం: మల్లిక్ రామ్
మన సినిమాల్లో హీరోయిన్లతో హద్దులు దాటి ఎక్స్పోజింగ్ చేయించడం.. రొమాంటిక్ సన్నివేశాలను చాలా ఘాటుగా చూపించడం దశాబ్దాల ముందు నుంచే ఉన్నప్పటికీ.. పడక గదిలో విషయాల గురించి ఓపెన్ గా చర్చించే కథాంశాలతో సినిమాలు తీయడం మాత్రం అరుదే. వీర్యదానం గురించి బాలీవుడ్లో ‘విక్కీ డోనర్’ అనే సినిమా తీస్తే బ్లాక్ బస్టర్ కాగా.. అదే చిత్రాన్ని తెలుగులో ‘నరుడా డోనరుడా’ పేరుతో రీమేక్ చేస్తే డిజాస్టర్ అయింది. కానీ ఆ సినిమా వచ్చినప్పటి రోజులు వేరు. ఇప్పటి రోజులు వేరు. హీరో అంగం చిన్నదిగా ఉండడం మీద ‘ఏక్ మినీ కథ’ అంటూ సినిమా తీసేంత బోల్డుగా ఇండస్ట్రీ మారితే.. దాన్ని ఆదరించి ప్రేక్షకులు కూడా తమలో వచ్చిన మార్పును చాటుకున్నారు. అందుకేనేమో ‘నరుడా డోనరుడా’ దర్శకుడు మల్లిక్ రామ్ సెక్స్ ఎడుకేషన్ ఆఫీసర్ పాత్రను లీడ్ రోల్ లో పెట్టి ‘సూపర్ సుబ్బు’ అంటూ నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ తీశాడు. ఐతే సెక్స్ ఎడ్యుకేషన్ మీద సినిమా అంటే వల్గారిటీ ఉంటుందని.. సన్నివేశాలను హద్దులు దాటించేసి ఉంటారని.. మాటల్ని బూతులతో నింపేసి ఉంటారని భయపడాల్సిన పనేమీ లేదు. కుటుంబమంతా కలిసి చూసే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దింది మల్లిక్ రామ్ అండ్ టీమ్. కొంచెం ఓపెన్ మైండ్ తో చూస్తే అందరూ రిలేట్ చేసుకునే కాన్సెప్ట్.. దాని చుట్టూ ఆద్యంతం వినోదం పంచే సన్నివేశాలు.. ఫన్నీ డైలాగులతో ఆద్యంతం ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తూ సాగుతుంది ‘సూపర్ సుబ్బు’.
సొసైటీ ఎంత మారినా సరే.. సిటీల్లో కూడా ఇప్పటికీ ఎక్కువమంది ‘సెక్స్’ అనే మాటను పెద్ద బూతుగానే భావిస్తారందరూ. ఇక పల్లెటూళ్ల సంగతి అయితే చెప్పాల్సిన పని లేదు. మరి బాగా వెనుకబడ్డ పల్లెటూరిలో ‘సెక్స్ ఎడ్యుకేషన్’ పాఠాలు చెప్పడానికి వెళ్లిన ఒక కుర్ర టీచర్.. ఇవేవీ అర్థం కాని అక్కడి జనాల తీరుతో ఎలా తంటాలు పడ్డాడు అన్నదే ఈ కథ. హీరో ఎందుకు అక్కడికి వెళ్లాల్సి వచ్చింది.. దాని వెనుక స్టోరీ ఏంటి అన్న దాని మీద ఒకట్రెండు ఎపిసోడ్లను వినోదాత్మకంగా నడిపించారు. వయసుతో పాటు వచ్చే ఆకర్షణల వల్ల తండ్రి దగ్గర హీరో ఎలా ఇరుక్కున్నాడు.. తండ్రి మీదున్న భయంతో అతనెలా కుచించుకుపోయాడు.. అన్నది చూపిస్తూ హీరో క్యారెక్టర్ని మొదట్లో బాగా ఎస్టాబ్లిష్ చేశారు. స్కూల్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు భలే ఫన్నీగా అనిపిస్తాయి. హీరోను ఒక ట్రికీ సిచువేషన్లో పెట్టి అతణ్ని సెక్స్ ఎడుకేషన్ ఆఫీసర్ గా ఊరికి పంపించడంలో కాన్ఫ్లిక్ట్ బాగా పండింది.
ఇక హీరో ఊరిలో అడుగు పెట్టిన దగ్గర్నుంచి నాన్ స్టాప్ ఫన్ తో నడుస్తుంది ‘సూపర్ సుబ్బు’. అక్కడుండే ప్రతి పాత్రా వినోదాన్ని పంచుతుంది. ఊరి జనాల ప్రవర్తనతో హీరో పడే పాట్లు భలే ఫన్నీగా ఉంటాయి. ‘వకీల్ సాబ్’ సినిమాలో పాపులర్ అయిన ‘నో మీన్స్ నో’ డైలాగ్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు నవ్వులు పండిస్తాయి. ఎక్కువ హడావుడి లేకుండా చాలా వరకు సింపుల్ సీన్లతోనే కథనాన్ని నడిపించారు. సిచువేషనల్ కామెడీ పండించడానికే ప్రయత్నించారు. సర్పంచ్ పాత్ర చేసిన నటుడితో పాటు జీవన్.. గెటప్ శీనుతో పాటు హీరోయిన్ మిథిలా పార్కర్ క్యారెక్టర్లు ప్రేక్షకులను బాగా ఎంగేజ్ చేస్తాయి. ప్రతి పాత్రలోనూ కామెడీ కోణం కనిపిస్తుంది. ఐతే కేవలం కామెడీకి పరిమితం కాకుండా కొన్ని సీన్లలో బలమైన ఎమోషన్లనూ పండించారు. ఈ కథ ద్వారా ఇచ్చిన సందేశం ప్రశంసనీయం. జనాభా నియంత్రణ.. కండోమ్స్- శానిటరీ ప్యాడ్స్ వినియోగం.. లాంటి అంశాలను వినోదం మేళవించి జనాలకు మెసేజ్ ఇచ్చిన తీరు ఆకట్టుకుంటుంది. రిలేషన్షిప్స్ గురించి డీల్ చేసిన విధానం కూడా బాగుంది.
ఏడు ఎపిసోడ్ల పాటు సాగే ‘సూపర్ సుబ్బు’ చాలా వరకు ఎంగేజింగ్ గా సాగినా.. మధ్య మధ్యలో కొంచెం నెమ్మదిగా నడుస్తుంది. డీవియేట్ అవుతుంది. కొన్ని చోట్ల లాజిక్ మిస్ అయినట్లు కనిపిస్తుంది. హీరో ఏ లక్ష్యం కోసమైతే వచ్చాడో.. దాన్ని నెరవేర్చడానికి ఎంత వరకు సిన్సియర్ గా కష్టపడ్డాడు అన్నది ప్రశ్నార్థకమే. ఊరి జనాల్లో మార్పు తెచ్చేందుకు అతను గట్టి ప్రయత్నమేదీ చేసినట్లు కనిపించదు. హీరోను సన్మానించే రేంజిలో అతను పెద్దగా ఏమీ చేయడు. ఊరిలో మార్పు కూడా తీసుకురాడు. సిరీస్ సీరియస్ అయిపోతుందనో ఏమో.. ఎక్కువగా కామెడీ మీదే దృష్టిపెట్టడం వల్ల అసలు కథ కొంచెం పలుచబడ్డ ఫీలింగ్ కలుగుతుంది. అయినా సరే.. ఈ సిరీస్ ఎక్కడా బోర్ అయితే కొట్టించదు. రమేష్ ఎలిగేటి.. శివాని దోబల్ లతో కలిసి మల్లిక్ రామ్ రాసిన స్క్రిప్టే ఈ సిరీస్ కు ప్రధాన బలం. కాన్సెప్టుకు తోడు సింపుల్ సీన్లు.. ఫన్నీ డైలాగులతో టీం ఆద్యంతం ప్రేక్షకులను ఎంగేజ్ చేసింది. మల్లిక్ రామ్ టేకింగ్ కూడా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. ఆరోన్ ఛాయాగ్రహణం.. అనుదీప్ దేవ్ సంగీతం కూడా ఆకట్టుకుంటాయి. బిట్ సాంగ్స్ తో పాటు బీజీఎం విషయంలోనూ అనుదీప్ మంచి పనితనం చూపించాడు. ఐతే సీజన్-1 ముగింపు ఇంకొంచెం ఎఫెక్టివ్ గా ఉ:డాల్సింది. కథను ఒక చోట ఆపి.. సెకండ్ సీజన్ కు లీడ్ ఇచ్చారు. రెండో సీజన్ మరింత ఆసక్తికరంగా సాగుతుందనే అంచనాలు కలిగించారు. కాన్సెప్ట్ వినడానికి బోల్డ్ అనిపించినా.. దీన్ని డీల్ చేసిన విధానం అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరిస్తుంది.
చివరగా: సూపర్ సుబ్బు.. మంచి మెసేజ్ వినోదపు పూతతో
రేటింగ్-3/5