గుస‌గుస‌.. రామాయ‌ణం రెండో భాగం వాయిదా?

ఇదివరకు విడుదలైన సమాచారం ప్రకారం.. `రామాయణం: పార్ట్ 1` చిత్రాన్ని దీపావళి కానుకగా 2026 నవంబర్ 5-6 తేదీల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు.

Update: 2026-10-24 04:17 GMT

నితేష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రం `రామాయణం` గురించి సినిమా వర్గాల్లో ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ఈ పాన్-ఇండియా చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ భారీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మొదటి భాగం విడుదలకు సిద్ధమవుతుండగా.. తాజాగా రెండో భాగానికి సంబంధించిన విడుదల తేదీ వాయిదా పడుతుందనే వార్తలు సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

ఇదివరకు విడుదలైన సమాచారం ప్రకారం.. `రామాయణం: పార్ట్ 1` చిత్రాన్ని దీపావళి కానుకగా 2026 నవంబర్ 5-6 తేదీల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. అలాగే దీనికి కొనసాగింపుగా `రామాయణం: పార్ట్ 2` సినిమాను 2027 దీపావళికి విడుదల చేయాలని తొలుత మేకర్స్ ప్లాన్ చేశారు. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ -మాన్‌స్ట‌ర్ మైండ్ క్రియేషన్స్ పతాకంపై నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు.

అయితే తాజా స‌మాచారం మేర‌కు..`రామాయణం 2` విడుదల 2027 దీపావళి నుండి 2028 దీపావళికి వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ రెండో భాగానికి మరింత ఎక్కువ ప్రొడక్షన్ - వీఎఫ్ఎక్స్ సమయం అవసరమని భావించిన చిత్ర బృందం ఈ నిర్ణయం తీసుకున్నట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఈ వాయిదా వేసే ఆలోచన వెనుక ప్రధాన కారణం సినిమా క్వాలిటీలో ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశమేన‌ని తెలుస్తోంది. అత్యున్నత సాంకేతిక విలువలతో, విజువల్ ఎఫెక్ట్స్‌కి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఈ పౌరాణిక చిత్రాన్ని తెరకెక్కిస్తుండటంతో పోస్ట్-ప్రొడక్షన్ పనులకు ఊహించిన దానికంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. అందుకే మేకర్స్ అత్యుత్తమ అవుట్‌పుట్ కోసం రెండో భాగానికి అదనపు సమయం కేటాయించాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతానికి `రామాయణం 2` వాయిదా పడుతుందనే ప్రచారంపై సోషల్ మీడియాలో రకరకాల గాసిప్స్ వినిపిస్తున్నా.. చిత్ర యూనిట్ నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మొదటి భాగం 2026 దీపావళికి థియేటర్లలోకి రావడానికి సన్నాహాలు జరుగుతుండగా.. రెండో భాగానికి సంబంధించిన పూర్తి స్పష్టత త్వరలోనే అధికారికంగా వెలువడే అవకాశం ఉంది. అధికారిక ప్రకటన వచ్చే వరకు అభిమానులు ఈ రూమర్స్‌పై ఎలాంటి అంచనాలకు రాకపోవడమే మంచిది. ఈ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్, హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే నటిస్తున్నారు.

Tags:    

Similar News