ఎంత పని చేశావ్ విశ్వక్ సేన్.. మంచి దర్శకుడిని చెడగొట్టావ్!
నా సినిమాలో చేయమంటే ఇంట్రస్ట్ లేదని బిస్కట్‌లు వేసిన తరుణ్ ఇప్పుడు మరో సినిమాలో నటించేందుకు రెడీ కావడంతో కౌంటర్‌గా నేను బిస్కట్ చేతిలో పెట్టాను.
యంగ్ హీరో విశ్వక్‌సేన్ వచ్చేవారం దీపావళి సందర్భంగా 'కల్ట్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. తన గత చిత్రాలు లైలా, ఫంకీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో తానే స్వయంగా దర్శకత్వ బాధ్యతలు చేపట్టి ఈ సినిమాను తీశాడు. గతంలో ఈయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలకు మంచి స్పందన వచ్చింది. నటుడిగా, దర్శకుడిగా విశ్వక్‌సేన్ ఆ సినిమాలతో ప్రశంసలు దక్కించుకున్నాడు. అందుకే మరోసారి అదే ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో కల్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. త్రివిక్రమ్ మూవీ పోటీగా ఉన్నప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో కల్ట్ ను అక్టోబర్ 30న విడుదల చేయబోతున్నారు. ఇటీవల తన కల్ట్ సినిమా ప్రమోషన్‌లో భాగంగా విశ్వక్‌సేన్ మాట్లాడుతూ దర్శకుడు, నటుడు అయిన తరుణ్ భాస్కర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.
తరుణ్ భాస్కర్ నటుడిగా వరుస సినిమాలు...
దర్శకుడిగా పరిచయం అయ్యి, నటుడిగా వరుస సినిమాలు చేస్తూ, హీరోగానూ ఎంట్రీ ఇచ్చిన తరుణ్ భాస్కర్ ఫిల్మోగ్రఫీ చూస్తే మొదటగా మహానటి సినిమాలో సింగీతం శ్రీనివాస్ పాత్రలో కనిపించారు. ఆ సినిమాలో చాలా మంది దర్శకులు గెస్ట్ రోల్‌లో కనిపించారు. అందులో తరుణ్ భాస్కర్ ఒకడు. ఆ తర్వాత తరుణ్ భాస్కర్ సినిమాలు చేయాలని అనుకోలేదట. కానీ విశ్వక్‌సేన్ మూడు నెలలు వెంటపడి మరీ తన 'ఫలక్‌నామా దాస్' సినిమాలో నటింపజేశాడట. ఈ విషయాన్ని స్వయంగా విశ్వక్ సేన్ చేప్పుకొచ్చాడు. తాను దర్శకత్వం వహించిన ఫలక్‌నామా దాస్ సినిమాలో ఎస్‌ఐ క్యారెక్టర్‌ను తరుణ్ భాస్కర్‌తో చేయించేందుకు మూడు నెలలు ఆయన చుట్టూ తిరిగాను. కానీ నటన తనకు సెట్ కాదని తిరస్కరిస్తూ వచ్చాడు. ఒకరోజు అన్నపూర్ణ స్టూడియోలో ఒక సినిమా కోసం ఫోటో షూట్ లో తరుణ్ పాల్గొంటున్నాడని తెలిసి వెళ్లి బిస్కట్ ఇచ్చాను.
విశ్వక్ సేన్ మూవీ ఫలక్‌నుమా దాస్...
నా సినిమాలో చేయమంటే ఇంట్రస్ట్ లేదని బిస్కట్‌లు వేసిన తరుణ్ ఇప్పుడు మరో సినిమాలో నటించేందుకు రెడీ కావడంతో కౌంటర్‌గా నేను బిస్కట్ చేతిలో పెట్టాను. దాంతో తరుణ్‌కి అర్థం అయ్యి నా సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నాడని విశ్వక్‌సేన్ అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నాడు. ఇప్పుడు తీరికలేనంతగా వరుస సినిమాలు చేస్తున్నాడు. తరుణ్ కి మొహమాటం ఎక్కువ, అందుకే ఎవరు అడిగినా వారి సినిమాల్లో నటిస్తున్నాడని విశ్వక్ సేన్ అన్నాడు. ఇప్పుడు తరుణ్ వరుస సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోగా నటించడంకు ప్రధాన కారణం ఫలక్‌నామా దాస్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే కొందరు సోషల్ మీడియాలో విశ్వక్‌సేన్ ను ఉద్దేశించి ఫన్నీగా, మంచి దర్శకుడిని దూరం చేశావు, దర్శకుడిగా ఎన్నో సినిమాలు చేయాల్సిన తరుణ్ ను పూర్తిగా నటుడిగా మారేలా చేశావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
దర్శకుడిగా వరుస సినిమాలు...
దర్శకుడిగా తరుణ్ భాస్కర్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి దశాబ్ద కాలం అవుతున్నా ఇప్పటి వరకు ఆయన నుండి కేవలం మూడు సినిమాలు మాత్రమే వచ్చాయి. నటుడిగా వరుస సినిమాలు చేస్తున్న కారణంగానే దర్శకుడిగా సినిమాలు చేయడం లేదు. పెళ్లి చూపులు వంటి విభిన్నమైన సినిమాలను చేయగల సత్తా ఉన్న దర్శకుడు, మంచి కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు చేసే సత్తా ఉన్న దర్శకుడు తరుణ్ భాస్కర్, అలాంటి తరుణ్ భాస్కర్ నుంచి వచ్చే మంచి సినిమాలను ఆయన నటుడిగా మారడం వల్ల మిస్ అవుతున్నామని చాలా మంది భావిస్తున్నారు. నటన అనేది ఎవరైనా చేస్తారు, కానీ దర్శకత్వం అనేది ఆయనకు మాత్రమే సాధ్యం, పైగా ఆయన మార్క్ సినిమాలు ఆయన మాత్రమే చేయగలడు. ఇప్పుడు ఆయన మార్క్ సినిమాలన్నీ మిస్ అవుతున్నామని ఆయన్ను దర్శకుడిగా అభిమానించే వారు అంటున్నారు. ఇదంతా కూడా విశ్వక్ సేన్ వల్లే అని కొందరు ఫన్నీగా విశ్వక్‌సేన్ ను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. మరి దీనికి విశ్వక్ సేన్ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనేది చూడాలి.