అక్కడా సోనుసూద్ ఖాళీగానే!

బాలీవుడ్ విషయానికి వస్తే 2026లో సోనుసూద్ నుంచి ఒక్క చిత్రం కూడా విడుదల కాకపోవడం ఆయన కెరీర్‌లో గమనించదగ్గ పరిణామం.

Update: 2026-10-24 03:30 GMT

సినిమా రంగంలో విజయాలకు.. పరాజయాలకు మధ్య ఉండే రేఖ చాలా సన్నగా ఉంటుంది. ఒక్కోసారి ఎంతటి స్టార్‌డైన్ ఉన్నా? ప్రేక్షకులను మెప్పించే సరైన పాత్రలు పడకపోతే వెండితెరకు దూరం కావాల్సి వస్తుంది. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వెండితైరను ఏలిన నటుడు సోనుసూద్ విషయంలో సరిగ్గా అదే జరుగుతోందిప్పుడు. 2026 సంవత్సరం ముగింపునకు వస్తున్నా? ఈ ఏడాది ఆయన నుంచి ఒక్క హిందీ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. మరోవైపు టాలీవుడ్‌లో సోనుసూద్ కనిపించి దాదాపు ఐదేళ్లు కావస్తోంది. ఈ పరిణామాలు అభిమానులను విస్మయానికి గురిచేస్తున్నాయి.

కోవిడ్ సంక్షోభ సమయంలో సోనుసూద్ చేసిన సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఆయ‌న్ని రియల్ హీరోగా నిలబెట్టాయి. లక్షలాది మందికి ప్రాణదాతగా నిలిచి పేదలకు అండగా ఉంటూ పొందిన కీర్తి ప్రతిష్టలు అంతాఇంతా కాదు. అయితే ఈ సామాజిక సేవా హోదానే ఆయన సినిమా కెరీర్‌కు కొద్దిగా ఇబ్బందికరంగా మారిందనే వాదన ఇండస్ట్రీలో వినిపిస్తోంది. తెరపై క్రూరమైన విలన్‌గా .. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించాల్సిన ఆయన రియల్ లైఫ్‌లో దేవుడిగా ముద్రపడటంతో దర్శకులు ఆయ‌న్ని అలాంటి పాత్రల్లో చూపించడానికి వెనుకాడాల్సి వస్తోంది. ఇది సోనుసూద్ లభించే అవకాశాలను గణనీయంగా తగ్గించేసింది.

బాలీవుడ్ విషయానికి వస్తే 2026లో సోనుసూద్ నుంచి ఒక్క చిత్రం కూడా విడుదల కాకపోవడం ఆయన కెరీర్‌లో గమనించదగ్గ పరిణామం. గతంలో పెద్ద హీరోల సినిమాలలో పవర్‌ఫుల్ విలన్‌గా కనిపించిన సోనుసూద్ ఇప్పుడు సరైన స్క్రిప్ట్‌ల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. హిందీ చిత్ర పరిశ్రమలో మారుతున్న ట్రెండ్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులకు దక్కుతున్న పరిమిత ప్రాధాన్యత కూడా ప్రతికూలంగా మారాయి. పెద్ద బ్యానర్లు, క్రేజీ ప్రాజెక్టులలో సోనుసూద్ కు తగిన గుర్తింపునిచ్చే పాత్రలు పడకపోవడం బాలీవుడ్‌లో ఖాళీగా ఉండటానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

తెలుగులో పరిస్థితి మరింత ఆశ్చర్యకరంగా ఉంది. టాలీవుడ్ ప్రేక్షకులకు సోనుసూద్ సుపరిచితుడే. `అరుంధతి` చిత్రంలో పోషించిన పశుపతి పాత్ర తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఆ సినిమా తర్వాత వరుస అవకాశాలు అందుకున్న సోనుసూద్ చివరిగా టాలీవుడ్‌లో పూర్తిస్థాయిలో ఎప్పుడు కనిపించారనేది వెతకాల్సి వస్తోంది. తెలుగు తెరపై సోనుసూద్ కనిపించి ఏకంగా ఐదేళ్లు దాటిపోవడం గమనార్హం.

నటుడిగా సోనుసూద్ ట్యాలెంట్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. అత‌డి ఫిజిక్ మాత్రమే కాదు.. మంచి హావభావాలు పలికించగల నటుడిగా మంచి పేరుంది. విలనిజంతో పాటు సపోర్టింగ్ రోల్స్ చేయగల సత్తా ఉన్నా? ప్రస్తుత ఇండస్ట్రీ పరిస్థితులు పక్కన పెట్టేలా చేస్తున్నాయి. హీరోల డామినేషన్ ఎక్కువగా ఉన్న రోజుల్లో క్యారెక్టర్ ఆర్టిస్టులకు దక్కే ప్రాధాన్యత తగ్గిపోవడం కూడా ఓ కారణం. గెస్ట్ రోల్స్ .. చిన్నపాటి పాత్రలకే పరిమితం కాకుండా తనదైన ముద్ర వేయగల బలమైన పాత్రల కోసం సోనుసూద్ ఎదురు చూస్తున్న‌ట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News