మాస్ సినిమాల హడావుడిలోనూ కంటెంట్ దే గెలుపు!

పరిశ్రమలో భారీ బడ్జెట్ మాస్ మసాలా చిత్రాలు.. అట్టహాసంగా వచ్చే పాన్-ఇండియా యాక్షన్ డ్రామాలు బాక్సాఫీస్ వద్ద రాజ్యమేలుతున్నాయి.

Update: 2026-10-24 01:30 GMT

పరిశ్రమలో భారీ బడ్జెట్ మాస్ మసాలా చిత్రాలు.. అట్టహాసంగా వచ్చే పాన్-ఇండియా యాక్షన్ డ్రామాలు బాక్సాఫీస్ వద్ద రాజ్యమేలుతున్నాయి. మైండ్ లెస్ యాక్షన్, విపరీతమైన ఎలివేషన్లతో కూడిన సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్న వేళ కంటెంట్ ఉన్న చిత్రాలకు ఆదరణ తగ్గుతోందేమోననే ఆందోళన కొందరిలో వ్యక్తమవుతోంది. అయితే ఎంతటి మాస్ హడావుడి ఉన్నా? చివరికి కథ, కథనాల్లో దమ్మున్న `కంటెంట్` ఉన్న చిత్రాలనే ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకుంటారని నటి అంజలి పాటిల్ పునరుద్ఘాటించారు.

విభిన్నమైన పాత్రలతో సహజసిద్ధమైన నటనతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అంజలి పాటిల్ ఓ ఇంటర్వ్యూలో సినిమా ట్రెండ్స్‌పై స్పందించారు. ప్రేక్షకుల సినిమా అభిరుచిని తక్కువగా అంచనా వేయడం పరిశ్రమ చేసే పెద్ద పొరపాటు అని అభిప్రాయపడ్డారు. అరుపులు, విజువల్ ఎఫెక్ట్స్, భారీ యాక్షన్ సీక్వెన్సులతో మాత్రమే థియేటర్లకు జనాన్ని రప్పించవచ్చని భావించడం సరికాదని ఆడియెన్స్ ఎప్పుడూ ఒకే రకమైన సినిమాలను కోరుకోరని విశ్లేషించారు.

సినిమా పరిమాణం ఎంత పెద్దదైనా? దానికి ఉపయోగించిన బడ్జెట్ ఎంత భారీగా ఉన్నా.. ఆ సినిమా వెనుక బలమైన భావోద్వేగాలు, ఆకట్టుకునే కథ లేకపోతే ప్రేక్షకులు నిదాక్షణ్యంగా తిరస్కరిస్తారని అంజలి పేర్కొన్నారు. కథలో నిజాయితీ, పాత్రల్లో సహజత్వం ఉన్నప్పుడు చిన్న చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తాయని గుర్తు చేశారు. గతంలో వచ్చిన అనేక మైలురాయి లాంటి చిత్రాలే దీనికి ప్రత్యక్ష నిదర్శనమని.. ప్రేక్షకుడి మేధస్సును, అభిరుచిని గౌరవించే సినిమాలు ఎప్పుడూ విఫలం కావని విశ్వాసం వ్యక్తం చేశారు.

పరిశ్రమలో కంటెంట్ ఆధారిత సినిమాలకు ..వినోదాత్మక మాస్ చిత్రాలకు రెండింటికీ తగిన స్థానం ఉందని, అయితే కేవలం హడావుడి చేసి బాక్సాఫీస్ నంబర్లు సాధించవచ్చనే భ్రమల నుంచి మేకర్స్ బయటకు రావలసిన అవసరం ఉందన్నారు. మంచి కథలను, వైవిధ్యమైన ప్రయత్నాలను ప్రేక్షకులు ఎల్లప్పుడూ ఆదరిస్తూనే ఉంటారని.. వారి ఆదరణ పొందే అర్హత ఆ స్క్రిప్ట్‌కు ఉందా లేదా అనేది మాత్రమే అసలైన పరీక్ష అని తెలిపారు. గ్లామర్, మాస్ ఎలివేషన్ల కంటే కథలోని బలమే సినిమాకు శాశ్వతమైన గుర్తింపును తెచ్చిపెడుతుందన్నారు.

ఒక నటిగా తాను ఎప్పుడూ సమాజానికి .. ప్రేక్షకుడి మనసుకు హత్తుకునే కథలకే ప్రాధాన్యత ఇస్తానని అంజలి పాటిల్ స్పష్టం చేశారు. పాత్ర చిన్నదా పెద్దదా అనే దానికంటే ఆ పాత్ర కథను ముందుకు నడిపించడంలో ఎంత కీలకంగా ఉందనేది చూసుకుంటానన్నారు. కంటెంట్ ఆధారిత చిత్రాల్లో నటించడం నటులకు ఆత్మసంతృప్తిని ఇవ్వడమే కాకుండా వారిలోని అసలైన నటనను బయటకు తీస్తుందని ఈ సందర్భంగా వివరించారు.

మొత్తానికి బాక్సాఫీస్ వద్ద ఎన్ని మాస్ సినిమాలు దాడి చేస్తున్నా? కంటెంట్ ఉన్న చిత్రాలే పరిశ్రమకు నిజమైన జీవనాడి అని అంజలి పాటిల్ వ్యాఖ్యలు నిరూపిస్తున్నాయి. ప్రేక్షకులను తక్కువ అంచనా వేయకుండా, వైవిధ్యమైన ఆలోచనలతో.. బలమైన కథలతో ముందుకొచ్చే మేకర్స్‌ను ఆడియెన్స్ ఎప్పుడూ నిరాశపరచరనేది నిజం.

Tags:    

Similar News