బ‌న్ని వాసు కంటే ముందే ఆర్జీవీ-క‌మ‌ల్ హాస‌న్ హెచ్చ‌రించారు!

సినిమా కళాకారులు, టెక్నీషియన్ల భవిష్యత్తును ఈ టెక్నాలజీ ఎలా మార్చేయబోతోందో వారు చాలా ముందే అంచనా వేశారు.

Update: 2026-10-23 18:04 GMT

సినిమా రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సృష్టించబోయే ప్రకంపనల గురించి ఇటీవల నిర్మాత బన్నీ వాసు మాట్లాడిన మాటలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. మ‌రో ఐదేళ్లలో ఫిలిం మేకింగ్ పూర్తిగా మారిపోతుందని.. యువతరం సాంకేతిక‌త‌పై ఎప్పటికప్పుడు అప్‌డేట్ కాకపోతే వెనుకబడిపోతారని `ఇడుపు కాయితం` ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్లో స్పష్టం చేశారు. అయితే బన్నీ వాసు కంటే ముందే టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ), విశ్వనటుడు కమలహాసన్ సైతం ఏఐ ప్రభావం గురించి తీవ్రమైన హెచ్చరికలు, విశ్లేషణలు చేశారు. సినిమా కళాకారులు, టెక్నీషియన్ల భవిష్యత్తును ఈ టెక్నాలజీ ఎలా మార్చేయబోతోందో వారు చాలా ముందే అంచనా వేశారు.

ఆర్జీవీ అయితే ఏఐ రాకను ఒక `ఉల్కాపాతం`తో పోల్చడం విశేషం. భూమిపై నుంచి డైనోసార్లు ఎలా అంతరించిపోయాయో, అదేవిధంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న పాత పద్ధతులు, విపరీతమైన బడ్జెట్లు, స్టార్ హీరోల హవాను ఏఐ క్రూరంగా అంతం చేయబోతోందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఒక సినిమాను రూపొందించడానికి వందలాది మంది టెక్నీషియన్లు, భారీ క్రూ, నటీనటులు, లొకేషన్ల అవసరమే ఉండదని ఆర్జీవీ స్పష్టం చేశారు. కేవలం ఒకే ఒక్క వ్యక్తి ఉండి, సరైన `ప్రాంప్ట్` ఇస్తే చాలు పూర్తిస్థాయి సినిమా రెడీ అయిపోతుందని, దీనివల్ల నిర్మాతల పాట్లు పూర్తిగా తీరిపోతాయని ఆయన విశ్లేషించారు.

మరోవైపు విశ్వనటుడు కమలహాసన్ ఈ టెక్నాలజీని మరో కోణంలో అధ్యయనం చేశారు. ఏఐ టెక్నాలజీ సినిమాను ఏ విధంగా సమూలంగా మారుస్తుందో ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి ఆయన స్వయంగా అమెరికా వెళ్లి మరీ దీనిపై ప్రత్యేక అధ్యయనం చేయడం ఆయన దూరదృష్టికి నిదర్శనం. అయితే ఏఐ చూసి భయపడాల్సిన అవసరం లేదని, కంప్యూటర్ లేదా ఇంటర్నెట్ ఎలా మన జీవితంలో భాగమైపోయాయో ఏఐ కూడా అలాగే మారుతుందని కమల్ అభిప్రాయపడ్డారు. దీనిని కేవలం ఒక భయానక మార్పుగా కాకుండా.. సృజనాత్మకతను పెంపొందించుకోవడానికి ఒక శక్తివంతమైన సాధనంగా స్వాగతించాలని ఆయన సూచించారు.

మొత్తంగా చూస్తే.. ఆర్జీవీ దీనిని ఇండస్ట్రీని శాసించే ఒక పెను విధ్వంసకర మార్పుగా చూడగా... కమలహాసన్ మాత్రం దానిని పద్ధతిగా, సరైన అవగాహనతో వాడుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. బన్నీ వాసు ఇప్పుడు చెబుతున్న అప్రమత్తతను ఈ ఇద్దరు దిగ్గజాలు ఎప్పుడో పసిగట్టారు. టెక్నాలజీ ఎంత వేగంగా మారుతుందో.. దానికి తగినట్లుగా సినీ పరిశ్రమ తనను తాను మార్చుకోకపోతే మనుగడ సాగించడం ఎంత కష్టమో ఈ హెచ్చరికలు స్పష్టం చేస్తున్నాయి.

Tags:    

Similar News