ఎయిర్పోర్ట్ ఘటన.. అనుపమకి మానసిక గాయం
సెలబ్రిటీలు స్వేచ్చగా బయట తిరిగే పరిస్థితి లేదు. సోషల్ మీడియా ఇన్ఫ్యూలెన్సర్స్ను కూడా రోడ్డు మీద కనిపిస్తే సెల్ఫీ కావాలంటూ ఇబ్బంది పెడుతున్న వారు ఉన్నారు.
సెలబ్రిటీలు స్వేచ్చగా బయట తిరిగే పరిస్థితి లేదు. సోషల్ మీడియా ఇన్ఫ్యూలెన్సర్స్ను కూడా రోడ్డు మీద కనిపిస్తే సెల్ఫీ కావాలంటూ ఇబ్బంది పెడుతున్న వారు ఉన్నారు. ఇక హీరోలు, హీరోయిన్స్ రోడ్డు మీద లేదంటే బహిరంగ ప్రదేశాల్లో చూస్తే ఏమైనా ఉందా... వారిని అభిమానం పేరుతో ఇబ్బంది పెట్టడం, మాట్లాడే పేరుతో దగ్గరకు వచ్చి అసభ్యంగా ప్రవర్తించడం మనం చూస్తూ ఉంటాం. చాలా మంది హీరోయిన్స్ పబ్లిక్ ప్లేస్ల్లో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి మనం గతంలోనూ చాలా సార్లు మీడియాలో చూశాం. కొందరు అభిమానం పేరుతో హీరోయిన్స్‌ను అసభ్యకరంగా తాకడం, వారిని పట్టుకుని లాగడం, ఇంకా అల్లరి చేయడం వంటివి చేయడం మనం చూస్తూ ఉంటాం. అనుపమ పరమేశ్వరన్ సైతం ఒకానొక సమయంలో ఇలాంటి తీవ్రమైన ఒత్తిడికి గురైనట్లు చెప్పుకొచ్చింది. ఎయిర్‌పోర్ట్‌లో తనకు ఎదురైన చేదు అనుభవంను తాజా పాడ్‌కాస్ట్‌లో చెప్పుకొచ్చింది.
సోషల్ మీడియాలో అనుపమ పరమేశ్వరన్...
హీరోయిన్గా బిజీగా ఉన్న అనుపమ పరమేశ్వరన్ తాజాగా ఒక పాడ్‌కాస్ట్‌కి గెస్ట్‌గా హాజరు అయ్యి పలు విషయాలను షేర్ చేసుకుంది. ఆ సమయంలోనే సెలబ్రిటీలు పబ్లిక్ ప్లేస్ల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి మాట్లాడింది. ఎంతో మంది సెలబ్రిటీల మాదిరిగానే తాను కూడా ఆ ఇబ్బంది ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చింది. ఒకసారి ఎయిర్‌పోర్ట్‌లో లగేజ్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు నా వద్దకు వచ్చారు. మాట్లాడేందుకు ప్రయత్నించారు. వారు నా అనుమతి లేకుండానే ఫోటోలు తీయడం మొదలు పెట్టారు. ఒంటరిగా ఉన్న నేను వారిని వారించలేక పోయాను. వారు ఏకంగా నన్ను పట్టుకుని ఫోటోలు తీయడం స్టార్ట్ చేశారు. ఆ సమయంలో నా మానసిక పరిస్థితి గందరగోళంగా ఉంది. అలా ఒక్కసారిగా అంతమంది వచ్చి తాకుతూ ఫోటోలు తీసుకుంటూ ఉండటంతో మానసికంగా గాయం అయ్యిందని పేర్కొంది.
ఫ్యాన్స్ ఫోటోల కోసం...
ఆ సమయంలో నేను తీవ్రమైన అభద్రతాభావంకు గురి అయ్యాను. వారు ఏం చేస్తారు, ఆ సమయంలో నేను ఏం చేయాలి అనే ఆందోళన మొదలైందని అప్పటి పరిస్థితులను గుర్తు చేసుకుంది. సాధారణంగా అలాంటి సమయంలో కొందరు గట్టిగా అరిచి అక్కడ నుంచి వెళ్లి పోతారు. కానీ అనుపమ పరమేశ్వరన్ సున్నిత మనస్కురాలు కావడంతో అక్కడ నుంచి వెళ్లలేక పోయిందని అర్థం చేసుకోవచ్చు. ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్రిటీలు, హీరోయిన్స్ ఇలాగే ఉంటారు. ఫోటోలు తీసుకునేందుకు వచ్చిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తే, వారిని మాటలు అంటే ఆ వీడియోలు తీసి ఎక్కడ సోషల్ మీడియాలో పెడతారో అని భయపడి సైలెంట్‌గా ఉంటారు. అక్కడ అనుపమ సైతం అదే విధంగా సైలెంట్‌గా ఉండి ఉంటుంది. మీడియా వారు మీద పడి ఫోటోలు తీస్తున్న సమయంలోనూ సెలబ్రిటీలు వారికి భయపడి సైలెంట్‌గా ఉండటం జరుగుతుంది.
అనుపమ పరమేశ్వరన్‌కి చేదు అనుభవం...
అభిమానులతో ఫోటోలు దిగేందుకు సెలబ్రిటీలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఆ సమయంలో వారు ప్రవర్తించే తీరు కారణంగా అసౌకర్యానికి గురి అవుతూ ఉంటారు. ఇక్కడ అనుపమ పరమేశ్వరన్ సైతం అదే విషయం చెప్పింది. అభిమానులతో ఫోటోలు దిగేందుకు నాకు ఎప్పుడు ఇష్టమే, అయితే వారి ప్రవర్తన గురించే ఆందోళనగా ఉంటుంది. ఎవరు ఎలా ప్రవర్తిస్తారో, ఎక్కడ తాకుతారో అనే ఆందోళన ఉంటుందని ఆమె చెప్పుకొచ్చింది. ఇలాంటి చేదు అనుభవాలు ప్రతిరోజు కొందరు అమ్మాయిలు ఎదుర్కొంటూనే ఉంటారని, వారు మానసికంగా నిజంగా చాలా గొప్ప ధైర్యవంతులని కూడా అనుపమ పేర్కొంది. సెలబ్రిటీలు అయినప్పటికీ వారికి కొన్ని వ్యక్తిగత నిబంధనలు ఉంటాయి, వారు కొన్ని విషయాల పట్ల వ్యక్తిగత స్వేచ్చ కోరుకుంటారు అనే విషయం ఈ జనాలకు ఎప్పుడు అర్థం అవుతుందో అని అనుపమ తన ఆవేదన వెల్లడించింది.