'ఆద‌ర్శ కుటుంబం' ట్రైల‌ర్ లాంచ్: రొటీనిటీని బ్రేక్ చేసిన వెంకీ మామ‌!

ఈ సందర్భంగా కాలేజ్ జీవితం గురించి వెంకటేశ్ మాట్లాడుతూ.. మనిషి జీవితంలో అత్యంత మధురమైన జ్ఞాపకాలు ఎప్పుడూ కాలేజీలోనే మిగిలిపోతాయని చెప్పారు.

Update: 2026-10-23 15:48 GMT

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ తన తాజా సినిమా `ఆదర్శ కుటుంబం` ప్రచారంలో భాగంగా అనుసరించిన తీరు ట్రెండ్‌కు పూర్తిగా భిన్నంగా నిలిచింది. సాధారణంగా జరిగే సినిమా ఈవెంట్ల మాదిరిగా కాకుండా, ఒక కాలేజ్ వేదికను ఎంచుకుని విద్యార్థుల మధ్యలో ఉత్సాహంగా గడపడం అందరినీ ఆకట్టుకుంది. వేదికపై వెంకటేశ్ మునుపటి కంటే ఎంతో యాక్టివ్‌గా, ఉత్సాహభరితంగా కనిపిస్తూ అక్కడున్న యువతను మంత్రముగ్ధులను చేశారు. కేవలం సినిమా విశేషాలే కాకుండా, కాలేజ్ విద్యార్థులు తమ జీవితాన్ని ఎలా మలచుకోవాలో వివరిస్తూ అందరి హృదయాలను గెలుచుకున్నారు.

ఈ ప్రచార వేదికపై వెంకటేశ్ స్వయంగా తానే ఒక హోస్ట్ లాగా వ్యవహరించడం విశేషం. వేదికపై ఉన్న తన సినిమా టీమ్‌ను, దర్శకులను, తోటి నటీనటులను ఎంతో ఆప్యాయంగా ఒక్కొక్కరిగా పరిచయం చేస్తూ ముందుకు నడిపించారు. దగ్గుబాటి హీరో వెంకటేష్‌లోని విలక్షణత, సాదాసీదాగా ఉండే త‌త్వం ఈ ఈవెంట్లో హైలైట్ అయ్యాయి. అంత‌ పెద్ద హీరో ఇంత సింపుల్ గానా! అనిపించారు. వెంకీ మామ‌ ఎలాంటి అహంభావం లేకుండా, ఎంతో సరదాగా అందరితో కలిసిపోతూ సినిమాను ప్రమోట్ చేసిన విధానం టాలీవుడ్‌లో ప్రత్యేక చర్చకు దారితీసింది.

ఈ సందర్భంగా కాలేజ్ జీవితం గురించి వెంకటేశ్ మాట్లాడుతూ.. మనిషి జీవితంలో అత్యంత మధురమైన జ్ఞాపకాలు ఎప్పుడూ కాలేజీలోనే మిగిలిపోతాయని చెప్పారు. ఈ మూడు లేదా నాలుగు సంవత్సరాల కాలేజ్ జర్నీ ఎప్పటికీ తిరిగిరాదని, కాబట్టి విద్యార్థులు ఈ కాలాన్ని పూర్తిగా ఆస్వాధించాలని పిలుపునిచ్చారు. కేవలం చదువుకే పరిమితం కాకుండా అప్పుడప్పుడు క్లాసులు బంక్ చేయడం, కాఫీ షాప్‌లు, టీ స్టాల్స్, కార్ పార్కింగ్‌లు లేదా స్నేహితులతో కలిసి బయట తిరగడం ద్వారానే సరికొత్త ఆలోచనలు, జీవిత పాఠాలు నేర్చుకోవచ్చని ఆయన సరదాగా విశ్లేషించారు.

అబ్బాయిలు, అమ్మాయిలు స్నేహితులతో కలిసి ఉన్నప్పుడే జీవితంపై నిజమైన కలలు పుట్టుకొస్తాయ‌ని, ఆ కలల సాధన కోసం పరిగెత్తాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. కేవలం జాబ్ తెచ్చిపెట్టే డిగ్రీలు మాత్రమే కాకుండా.. ఈ నాలుగేళ్ల కాలేజ్ ప్రయాణంలో తమ సొంత క్యారెక్టర్ (వ్యక్తిత్వం)ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడం చాలా ముఖ్యమని వెంకటేశ్ స్పష్టం చేశారు. అదే అసలైన జీవితమని చెబుతూ.. విద్యార్థులందరూ మంచి మానవులుగా ఎదగాలని ఆకాంక్షించారు.

చివరగా ఈ వేదికపై నుంచి నేరుగా విద్యార్థుల దగ్గరికే నడుచుకుంటూ వెళ్లిన వెంకటేశ్, వారందరికీ అభివాదం చేస్తూ వారి కెమెరాలలో బందీ అయ్యారు. సినిమా ప్రమోషన్లను ఒక సరికొత్త హుందా అయిన పంథాలో నడిపిస్తూ, యువతను ఆలోచింపజేస్తూ `ఆదర్శ కుటుంబం` చిత్రాన్ని ఆయన ప్రమోట్ చేసిన తీరు టాలీవుడ్‌లో అరుదైన ఘట్టంగా నిలిచింది. అభిమానులతో మమేకవుతూ వెంకటేశ్ అందించిన ఈ అనుభూతి సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

`ఆదర్శ కుటుంబం` చిత్ర ప్రచార - ట్రైలర్ లాంచ్ వేదికపై విక్టరీ వెంకటేశ్, దర్శకుడు త్రివిక్రమ్, శ్రీనిధి శెట్టి, సంగీత దర్శకుడు ఎస్.ఎస్ తమన్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు ఈ వేడుక‌కు హాజరయ్యారు. కాలేజ్ విద్యార్థుల మధ్య జరిగిన ఈ వేడుకలో అక్టోబర్ 30న విడుదల కానున్న తమ సినిమా ట్రైలర్‌ను మ‌ల్లారెడ్డి కాలేజ్ విద్యార్థుల న‌డుమ‌ ఆవిష్కరించి, విద్యార్థులతో మమేకవుతూ చిత్ర బృందం ఈ వేదికను ఎంతో సందడిగా నిర్వహించింది.

Tags:    

Similar News