అలాంటి వింటేజ్ కాంబినేషన్ కోసం ఎదురు చూసాను: థ‌మ‌న్

ఇదే వేదికపై విక్టరీ వెంకటేశ్ క్లాసిక్ మూవీ `నువ్వు నాకు నచ్చావు` చిత్రంపై తనకున్న అభిమానాన్ని తమన్ బయటపెట్టారు.

Update: 2026-10-23 16:58 GMT

విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ `ఆదర్శ కుటుంబం` ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైద‌రాబాద్ లో ఎంతో సందడిగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ మాట్లాడిన సరదా వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తనదైన టైమింగ్, చమత్కారంతో వేదికపై నవ్వుల పువ్వులు పూయించిన తమన్, ఈవెంట్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఈవెంట్‌లో తనకు ముందు మాట్లాడిన నటుడు బాల‌న‌టుడు ప్రజ్వల్ ప్రసంగంపై తమన్ స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. కొందరు మాట్లాడితే వేదికపై ఫన్ వస్తుందని.. కానీ ప్రజ్వల్ మాట్లాడితే మాత్రం అందరికీ చెమటలు పడతాయని సరదాగా కామెంట్ చేశారు. అతని స్పీచ్ చూసి వేదికపై ఉన్నవారందరూ ఆశ్చర్యపోయారని చెబుతూ, తనదైన కామెడీ శైలిలో అందరినీ నవ్వించారు.

ఇదే వేదికపై విక్టరీ వెంకటేశ్ క్లాసిక్ మూవీ `నువ్వు నాకు నచ్చావు` చిత్రంపై తనకున్న అభిమానాన్ని తమన్ బయటపెట్టారు. తనకు ఎప్పుడు బోర్ కొట్టినా, భోజనం చేసేటప్పుడు లేదా కాస్త రిలాక్స్ అవ్వాలనిపించినప్పుడు యూట్యూబ్‌లో `నువ్వు నాకు నచ్చావు` సినిమానే చూస్తుంటానని వెల్లడించారు. అది తన ఆల్ టైమ్ ఫేవరెట్ చిత్రమని, అలాంటి వింటేజ్ వెంకీ-త్రివిక్రమ్ కాంబినేషన్ కోసం తాను కూడా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నానని తెలిపారు.

దర్శకుడు త్రివిక్రమ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ.. ఆయనకు ఒక అద్భుతమైన కాంప్లిమెంట్ ఇచ్చారు. `అరవింద సమేత` చిత్రం నుంచి త్రివిక్రమ్‌తో తన ప్రయాణం కొనసాగుతోందని, ఆయనొక `పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్` అని కొనియాడారు. కుటుంబాలకు ఎలాంటి కథలు కావాలో ఆయనకు బాగా తెలుసని, వెంకటేష్ గారి కోసం ఆయన ఎంతో అద్భుతమైన స్క్రిప్ట్ రాశారని ప్రశంసించారు. తాను ఇప్పటికే ఈ చిత్రానికి రీ-రికార్డింగ్ (బ్యాక్‌గ్రౌండ్ స్కోర్) పూర్తి చేశానని, అక్టోబర్ 30న విడుదలవుతున్న ఈ సినిమా పెద్ద బ్లాక్‌బస్టర్ కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

ఈ చిత్రంలో ఎంతో ఎనర్జిటిక్‌గా నటించిన హీరోయిన్ శ్రీనిధి శెట్టికి, అలాగే తనపై ఎంతో నమ్మకంతో నిరంతరం ప్రోత్సహిస్తున్న నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చిన్నబాబు) గారికి తమన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా ఈ సినిమాలో పాటలతో పాటు మరో 7 అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రాక్స్ ఉన్నాయని.. వాటిని త్వరలోనే అధికారికంగా విడుదల చేయబోతున్నామని చెబుతూ మ్యూజిక్ లవర్స్‌లో ఆసక్తిని పెంచారు.

Tags:    

Similar News