బాల న‌టిగా బ‌న్ని వాసు కుమార్తె ఆరంగేట్రం

ఈ వేడుకలో పాల్గొన్న ప్రముఖ నిర్మాత బన్నీ వాసు తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక అరుదైన అనుభవాన్ని షేర్ చేసారు.

Update: 2026-10-23 17:17 GMT

`బన్నీ వాసు వర్క్స్`, `సుకుమార్ రైటింగ్స్` బ్యానర్లపై ప్రియదర్శి హీరోగా బ‌న్ని వాసు- సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం `ఇడుపు కాయితం`. ఫోక్ సాంగ్స్ ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాగదుర్గ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుండగా, యువ దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఈ చిత్రానికి సంబంధించి తాజాగా హైదరాబాద్‌లో `గడప..` సాంగ్ లాంచ్ ఈవెంట్‌ను అత్యంత వైభవంగా నిర్వహించారు.

ఈ వేడుకలో పాల్గొన్న ప్రముఖ నిర్మాత బన్నీ వాసు తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక అరుదైన అనుభవాన్ని షేర్ చేసారు. ఈ సినిమా ద్వారా తన కుమార్తె బాల నటిగా తెరంగేట్రం చేసిందని ఆయన భావోద్వేగంగా వెల్లడించారు. చిత్రంలోని శ్రీలత పాటలో వచ్చే పిల్లల సన్నివేశంలో తన కూతురు ఒక చిన్న డాక్టర్ పాత్రలో నటించిందని తెలిపారు. అయితే చెన్నై నుంచి హడావుడిగా రావడం, క్షణం తీరిక లేని పని బిజీలో పడిపోవడం వల్ల ఆ పాట ప్రొజెక్షన్‌కి తన భార్యను, కూతురిని తీసుకురావడం మర్చిపోయానని ఆయన సరదాగా, కాస్త ఎమోషనల్‌గా చెప్పి నవ్వులు పూయించారు.

సినిమా కథాంశం- గ్రామీణ నేపథ్యం గురించి బన్నీ వాసు ఆసక్తికర విషయాలు షేర్ చేసారు. తాను పాలకొల్లు అనే చిన్న టౌన్, పల్లెటూరి వాతావరణంలో పెరగడం వల్ల... సినిమాలో చూపించిన ప్రతీ సన్నివేశం తన సొంత ఊరిలో చూసినట్లే ఎంతో సహజంగా అనిపించిందన్నారు. ఇంట్లో జరిగే చిన్న చిన్న గొడవలు, కుళాయిల దగ్గర జరిగే ముచ్చట్లు అన్నీ కళ్ళకు కట్టినట్లు చూపించారని, ఇటువంటి అద్భుతమైన కథను తనకిచ్చిన దర్శకుడికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సినిమాలోని కొన్ని సన్నివేశాలు తన నిజ జీవిత అనుభవాలను గుర్తు చేశాయని బన్నీ వాసు సరదాగా వివరించారు. సినిమాలో ఇద్దరు మహిళలు గిన్నెల వద్ద కొట్టుకుంటుంటే ఒక పాత్ర చెప్పే `వెళ్లకరా` అనే డైలాగ్ చాలా మంది భర్తలకు తక్షణమే కనెక్ట్ అవుతుందని అన్నారు. అలాగే కొత్తగా పెళ్లయిన అమ్మాయి అత్తారింటికి వెళ్లే సీన్ చూస్తున్నప్పుడు... తన నిజజీవితంలో తన భార్య తన చేతిని ఎంత గట్టిగా నొక్కి పట్టుకుందో ఆ నాటి జ్ఞాపకం తనకు మదిలో మెదిలిందని చమత్కరించారు.

ఈ సినిమా ఇంత వేగంగా, సజావుగా పూర్తి కావడానికి దర్శకుడు సుకుమార్ అందించిన సహకారమే ప్రధాన కారణమని బన్నీ వాసు స్పష్టం చేశారు. సుకుమార్ వెనుక నిలబడి అడుగులు వేయించడం వల్లే తన కెరీర్‌లోనే అత్యంత వేగంగా ఈ సినిమా షూటింగ్ పూర్తయిందన్నారు. ఇక చివరగా నవంబర్, డిసెంబర్ లేదా కార్తీక మాసంలో పెళ్లిపీటలెక్కిన కొత్త జంటలు, తమ అత్తమామలతో కలిసి ఈ సినిమాను చూడాలని ఆయన సూచించారు. వైవాహిక జీవితంలోని చిన్నచిన్న మనస్పర్థలను ఎలా సర్దుబాటు చేసుకోవాలో ఈ చిత్రం ద్వారా చక్కగా తెలుసుకోవచ్చని పేర్కొంటూ ఈవెంట్‌ను మరింత ఉత్సాహభరితం చేశారు.

Tags:    

Similar News