సుమంత్ ప్రభాస్ ‘రోమాంచకం’ ముచ్చట్లు.. ఏమన్నారంటే..
ఈ ప్రాజెక్ట్‌లోకి తాను రావడానికి సందీప్ రెడ్డి వంగానే కారణమని సుమంత్ చెప్పారు. ముందుగా కథ విన్న సందీప్, బాగా నచ్చడంతో సుమంత్‌ను పిలిపించి వినమన్నారట.
సుమంత్ ప్రభాస్ ‘రోమాంచకం’తో సెప్టెంబర్ 3న థియేటర్లలోకి రాబోతున్నారు. అనంతిక సనిల్ కుమార్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు వేణుగోపాల్ రెడ్డి దర్శకుడు. భద్రకాళీ పిక్చర్స్‌పై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తుండగా, సందీప్ రెడ్డి వంగా సమర్పిస్తున్నారు. రిలీజ్ దగ్గరపడుతుండటంతో టీమ్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది. ఈ క్రమంలో సుమంత్ ప్రభాస్ TUPAKI.COM కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలు పంచుకున్నారు.
ఈ ప్రాజెక్ట్‌లోకి తాను రావడానికి సందీప్ రెడ్డి వంగానే కారణమని సుమంత్ చెప్పారు. ముందుగా కథ విన్న సందీప్, బాగా నచ్చడంతో సుమంత్‌ను పిలిపించి వినమన్నారట. కథ విన్న వెంటనే తనకూ బాగా కనెక్ట్ అయిందని, ముఖ్యంగా సినిమా మొత్తం ఫన్ రైడ్‌లా నడుస్తుందని అనిపించిందని చెప్పారు. ‘రోమాంచకం’ను కేవలం యూత్ సినిమా అని కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కలిసి చూడగలిగేలా తీశామని సుమంత్ చెబుతున్నారు.
సినిమా చూసినంత సేపు ముఖం మీద నవ్వు ఉంటుందని, లవ్, సస్పెన్స్, కామెడీ అన్నీ కలిసే ఉంటాయని అన్నారు. తన పాత్ర మాత్రం పక్కింటి అబ్బాయి లాంటి అల్లరి కుర్రాడిదని చెప్పారు. ఈ పాత్రలో డైలాగ్ డెలివరీనే కాస్త కష్టంగా అనిపించిందట. కొన్ని డైలాగ్స్ చాలా స్పీడ్‌గా చెప్పాల్సి రావడంతో డబ్బింగ్ సమయంలో ఎక్కువ శ్రమ పెట్టాల్సి వచ్చిందని సుమంత్ గుర్తుచేసుకున్నారు. నటుడిగా మాత్రం ఈ సినిమా సెట్లో చాలా రిలాక్స్‌డ్‌గా పనిచేశానని చెప్పారు.
తన మొదటి సినిమాలో రచన, దర్శకత్వం, నటన అన్నీ తానే చూసుకోవడంతో చాలా ఒత్తిడి ఉండేదని సుమంత్ అన్నారు. ‘రోమాంచకం’లో మాత్రం తన పని యాక్టింగ్ వరకే ఉండటంతో సెట్‌లో ఎలాంటి టెన్షన్ లేకుండా పని చేశానని చెప్పారు. దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి సెట్‌లో ఎప్పుడూ నవ్వుతూ ఉండేవారని, అందుకే షూటింగ్ కూడా సరదాగా సాగిందని చెప్పారు.
ఇక ఇదే బ్యానర్‌లో ప్రభాస్ ‘స్పిరిట్’ కూడా ఉండటంతో ఆ సినిమా అప్డేట్ గురించి తాను నిర్మాత ప్రణయ్‌ను అడిగానని సుమంత్ సరదాగా చెప్పారు. అక్టోబర్ 23కు ఏమైనా ఉందా అని అడిగితే, ముందుగా ‘రోమాంచకం’ రిలీజ్ కానిద్దాం అని ప్రణయ్ నవ్వుతూ చెప్పారట. ఇక ఆగస్టు 25న ట్రైలర్ రానుండగా, సెప్టెంబర్ 3న సినిమా థియేటర్లలోకి వస్తోంది.