టాక్సిక్ సెన్సార్.. అసలు ట్విస్ట్ ఇదే..

‘టాక్సిక్’ గురించి ఇప్పటివరకు బోల్డ్ కంటెంట్, యష్ లుక్, గీతూ మోహన్‌దాస్ టేకింగ్ ఎక్కువగా మాట్లాడుకున్నారు.

Update: 2026-08-24 10:03 GMT

‘టాక్సిక్’ గురించి ఇప్పటివరకు బోల్డ్ కంటెంట్, యష్ లుక్, గీతూ మోహన్‌దాస్ టేకింగ్ ఎక్కువగా మాట్లాడుకున్నారు. ఇప్పుడు సెన్సార్ సర్టిఫికెట్ బయటకు రావడంతో సినిమా అసలు ఏ రేంజ్‌లో ఉండబోతోందో ఇంకాస్త క్లారిటీ వచ్చింది. మేకర్స్ మొదటి నుంచి చెప్పినట్లే ఇది ఫ్యామిలీ సినిమా కాదు. సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికెట్ ఇచ్చింది. కానీ ఇక్కడ ఎక్కువగా ట్విస్ట్ ఇస్తున్న పాయింట్ రన్‌టైమ్.




 


సెన్సార్ ప్రకారం రన్‌టైమ్ ఏకంగా 194 నిమిషాల 12 సెకన్లు. అంటే దాదాపు 3 గంటల 14 నిమిషాల సినిమా. ఇప్పటి కమర్షియల్ సినిమాలు సాధారణంగా రెండున్నర గంటల దగ్గర ముగుస్తున్న సమయంలో ‘టాక్సిక్’ ఇంత లాంగ్ రన్‌టైమ్‌తో రావడం చిన్న విషయం కాదు. గ్యాంగ్‌స్టర్ డ్రామా, చాలా పాత్రలు, పెద్ద కథ ఉండటం వల్లే మేకర్స్ ఇంత టైమ్ తీసుకున్నట్లు అనిపిస్తోంది.

‘A’ సర్టిఫికెట్ వల్ల పిల్లలకు థియేటర్ ఎంట్రీ ఉండదు. పైగా ఫ్యామిలీ ఆడియన్స్‌లో కూడా ఒక వర్గం సహజంగానే దూరంగా ఉంటుంది. మరోవైపు మూడు గంటలకు పైగా రన్‌టైమ్ ఉండటం వల్ల ఒక్కో థియేటర్‌లో రోజుకు వేసే షోల సంఖ్య కూడా కొంత తగ్గొచ్చు. అంటే మొదటి రోజు భారీ డిమాండ్ ఉన్నా ప్రతి స్క్రీన్ నుంచి వచ్చే షో కౌంట్ సాధారణ సినిమాల కంటే తక్కువగా ఉండే ఛాన్స్ ఉంది.

అయితే యష్ సినిమాకు ప్రస్తుతం ఉన్న బుకింగ్స్ చూస్తే ఈ రెండు విషయాలు పెద్ద అడ్డంకిగా మారలేదనే చెప్పాలి. ‘కేజీఎఫ్ 2’ తర్వాత నాలుగేళ్లకు యష్ సోలోగా వస్తుండటం, ట్రైలర్‌లో కనిపించిన రా టోన్ ఇప్పటికే యూత్‌ను బాగా లాగుతోంది. మేకర్స్ కూడా మొదటి నుంచి సినిమాను పిల్లలు, ఫ్యామిలీస్ కోసం తీసినట్టు ఎక్కడా ప్రాజెక్ట్ చేయలేదు. ‘ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ అనే లైన్‌తోనే సినిమా ఎవరిని టార్గెట్ చేస్తుందో చెప్పేశారు.

ఇప్పుడు అసలు పని మాత్రం ఎడిటింగ్ దగ్గరే ఉంటుంది. మూడు గంటల 14 నిమిషాలు ప్రేక్షకుడిని సీట్లో ఉంచాలంటే ప్రతి అరగంటకో పెద్ద సీన్ ఉంటే సరిపోదు. కథ వేగం తగ్గకుండా, పాత్రలు ఎక్కువైనా గందరగోళం రాకుండా నడవాలి. ‘కేజీఎఫ్ 2’ కూడా లాంగ్ సినిమా అయినా స్పీడ్ వల్ల రన్‌టైమ్ పెద్ద సమస్య కాలేదు. ‘టాక్సిక్’కు కూడా అదే అవసరం.

ఆగస్టు 26న సినిమా థియేటర్లలోకి వస్తోంది. ముందే ‘A’ సర్టిఫికెట్ అని తెలుసు. కానీ ఇప్పుడు రన్‌టైమ్ బయటకు రావడంతో యష్ సినిమా నిజంగా ఎంత పెద్ద కథ చెప్పబోతోందో కూడా అర్థమవుతోంది. ఓపెనింగ్ గురించి ఇప్పటికే పెద్ద లెక్కలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు థియేటర్‌లో ఆ మూడు గంటలకు పైగా టైమ్ ప్రేక్షకుడికి ఎలాంటి థ్రిల్ ఇస్తుందో చూడాలి. అయితే గతంలో యానిమల్ లాంటి సినిమాలకు రన్ టైమ్ ఇదే తరహాలో ఉన్నా కూడా ఆడియెన్స్ పట్టించుకోలేదు. కంటెంట్ అనేది చాలా ముఖ్యం. మరి ఆడియెన్స్ ఈసారి ఎలా రియాక్ట్ అవుతారో.

Tags:    

Similar News