వారణాసి కోసం ఏఐకి దూరంగా జక్కన్న!
టెక్నాలజీ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సినీ రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తోంది.
టెక్నాలజీ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సినీ రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్ మొదలుకొని వాయిస్ ఓవర్ల వరకు ప్రతీదానికీ ఏఐని వినియోగించడం నేడు ట్రెండ్‌గా మారింది. అయితే ట్రెండింగ్‌లో ఉన్న ఏఐ టెక్నాలజీకి దూరంగా ఉంటూ కేవలం రియల్ ఆర్టిస్టుల ప్రతిభకే ప్రాధాన్యత ఇవ్వాలని దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి నిర్ణయించుకోవడం విశేషం. సూపర్ స్టార్ మహేష్ హీరోగా తెరకెక్కుతోన్న `వారణాసి` చిత్రం కోసం జక్కన్న ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఏఐ వాయిస్‌లు లేదా కంప్యూటర్ జనరేటెడ్ హంగుల కంటే మనుషుల నుంచి వచ్చే ఒరిజినల్ ఎమోషన్స్ తెరపై ఎంతో సహజంగా పండుతాయని జక్కన్న నమ్ముతున్నారు. సినిమాలోని ప్రతి పాత్రకు, ప్రతి సన్నివేశానికి ప్రాణం పోసేందుకు ఆర్టిస్టుల నిజమైన అనుభవమే సరైనదని భావిస్తున్నారు. ఈ ఆలోచనలో భాగంగానే చిత్ర యూనిట్ ఏకంగా 1500 మంది వాయిస్ ఆర్టిస్టులకు భారీ స్థాయిలో ఆడిషన్స్ నిర్వహిస్తోంది. కొద్ది మంది ప్రముఖులకే పరిమితం కాకుండా విభిన్న గళాలు కలిగిన ప్రతిభావంతులను వెలికితీసేందుకు కసరత్తు చేస్తున్నారు.
పాత్రల స్వభావం కోసం అత్యంత కచ్చితమైన వాయిస్ టెక్చర్‌ను ఎంపిక చేయడమే సుదీర్ఘ ప్రక్రియ ముఖ్య ఉద్దేశం. రాజమౌళి తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం సినిమాపై అంచనాలను అంతకంతకు పెంచుతుంది. టెక్నాలజీ అందుబాటులో ఉన్నా? ఆర్టిస్టుల శ్రమను, వారి కళను నమ్ముకునే దర్శకుడి విధానాన్ని సినీ వర్గాలు ప్రశం సిస్తున్నాయి. ఈ నిర్ణయం వల్ల తెరపై కనిపించే దృశ్యాలకు, వినిపించే సంభాషణలకు ప్రత్యేకమైన జీవం వస్తుందనడంలో సందేహం లేదు.
ఏఐ రాకతో డబ్బింగ్.. వాయిస్ ఓవర్ రంగం ఉపాధి కోల్పోతున్నదనే ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో రాజమౌళి తీసుకున్న నిర్ణయం వందలాది మంది కళాకారులకు భరోసా ఇస్తోంది. సాంకేతికతను కేవలం సహాయకారిగా మాత్రమే వాడాలి తప్ప మనుషుల భావోద్వేగాలను అది ఎప్పటికీ భర్తీ చేయలేదనే సత్యాన్ని ఆయన మరోసారి నిరూపించారు. `వారణాసి` సినిమా కోసం జక్కన్న అనుసరిస్తున్న ఈ పద్ధతి రాజమౌళి అంకితభావానికి నిదర్శనం.
ఏఐకి బదులుగా మనుషుల భావోద్వేగాలకు పెద్దపీట వేయడం ద్వారా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్దే కాకుండా, ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోవడం ఖాయం. అయితే ఏఐ వినియోగంతో ఖర్చు తగ్గుతుంది. కానీ అదే పని మనిషి చేస్తే ఖర్చు నాలుగింతలవుతుంది. అయినా రాజమౌళి ఎక్కడా రాజీ పడటం లేదు. మిషిన్ కంటే మనిషి ద్వారానో అసలైన భావోద్వేగానికి అవకాశం ఉందని బలంగా నమ్మి ముందుకెళ్తున్నారు. ఈ కారణంగా ఎంతో మందికి ఉఫాది దొరుకుతుందన్నది అంతే వాస్తవం.