వ్యక్తిగత స్వేచ్ఛా? బ్రాండ్ బాధ్యతా?.. టార్గెట్ అవుతున్న హీరోయిన్లు
ఒక పండుగ ప్రకటన చుట్టూ వివాదం ముసురుకోవడం, అందులో నటించిన నటి తీవ్ర విమర్శల పాలవ్వడం మన దేశంలో కొత్తేమీ కాదు.
ఒక పండుగ ప్రకటన చుట్టూ వివాదం ముసురుకోవడం, అందులో నటించిన నటి తీవ్ర విమర్శల పాలవ్వడం మన దేశంలో కొత్తేమీ కాదు. తాగాజా కృతి సనన్ నటించిన రక్షాబంధన్ జువెలరీ యాడ్ విషయంలోనూ ఇదే జరిగింది. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది కేవలం ఒక దుస్తుల ఎంపిక గురించి మాత్రమే కాదు. ఒక సెలబ్రిటీకి ఉండే వ్యక్తిగత స్వేచ్ఛకు, బ్రాండ్ అంబాసిడర్‌గా సమాజం వారి నుంచి కోరుకునే సాంప్రదాయ బాధ్యతకు మధ్య నడిచే కత్తిమీద సాము లాంటి వివాదం ఇది.
తెరవెనుక నిర్ణయాలు.. తెరపై మాత్రమే విమర్శలు:
ఏదైనా ఒక ప్రకటన తెరపైకి వస్తోందంటే దాని వెనుక ఒక పెద్ద టీమ్ ఉంటుంది. బ్రాండ్ ఆలోచనలు, డైరెక్టర్ విజన్, కాస్ట్యూమ్ డిజైనర్ల నిర్ణయాలు ఇవన్నీ కలసి ఆ లుక్‌ని డిజైన్ చేస్తాయి. కానీ, ఆ యాడ్ బయటకు రాగానే వచ్చే విమర్శలు, ట్రోల్స్ మాత్రం కేవలం తెరపై కనిపించే నటిపైనే పడతాయి. వెనుక ఉండి నడిపించిన బ్రాండ్ లేదా క్రియేటివ్ టీమ్‌ను వదిలేసి, కేవలం హీరోయిన్‌నే టార్గెట్ చేయడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పరు.
వ్యక్తిగత స్వేచ్ఛకు, సాంప్రదాయానికి మధ్య నలిగే నటులు:
నటీనటులకు తమకు నచ్చిన దుస్తులు వేసుకునే స్వేచ్ఛ కచ్చితంగా ఉంటుంది. అయితే, రక్షాబంధన్ లాంటి కుటుంబ భావోద్వేగాలతో కూడిన పండుగల నేపధ్యంలో నటిస్తున్నప్పుడు, ప్రేక్షకుల భావాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందా అనే చర్చ కూడా నడుస్తోంది. ఇక ఒక రకంగా చూస్తే ఇది నటుల వ్యక్తిగత అభిరుచికి, సమాజం వారి నుంచి ఆశించే సాంప్రదాయ పాత్రకు మధ్య జరుగుతున్న నిరంతర ఘర్షణ.
బ్రాండ్ అంబాసిడర్ బాధ్యత ఎంతవరకు?:
సెలబ్రిటీలు ఒక బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నప్పుడు, ఆ ప్రకటన సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో గమనించాల్సిన బాధ్యత వారిపై కూడా కొంతవరకు ఉంటుంది. డబ్బులు తీసుకుని నటించాం కదా అని వదిలేయకుండా, తమ ఇమేజ్‌కు మరియు సంస్కృతికి తగినట్లుగా కాన్సెప్ట్ ఉందో లేదో సరిచూసుకోవడం నేటి డిజిటల్ కాలంలో చాలా అవసరం అంటున్నారు నిపుణులు. ఎందుకంటే, చిన్న పొరపాటు జరిగినా మొదట దెబ్బతినేది వారి బ్రాండ్ ఇమేజే.
ఇక సెలబ్రిటీల ప్రొఫెషనల్ లైఫ్‌ను, పర్సనల్ చాయిస్‌లను వేర్వేరుగా చూడటం నేర్చుకోనంత వరకు ఇలాంటి వివాదాలు ముగిసిపోవు. బ్రాండ్లు తమ క్రియేటివిటీ పేరుతో సాంప్రదాయాలను దెబ్బతీయకుండా చూసుకోవాలి, అదే సమయంలో నెటిజన్లు కూడా ప్రకటన వెనుక ఉన్న అసలు కారణాలను అర్థం చేసుకోకుండా కేవలం ఒక నటినే విమర్స చేసే ధోరణిని మార్చుకోవాల్సి ఉంది.