NBK 111 : చిరు, బన్నీ తరహాలోనే పవర్‌ ఫుల్‌ టైటిల్‌..!

చిత్ర యూనిట్‌ సభ్యుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం దాదా లేదా గాడ్‌ అనే టైటిల్స్‌ను పరిశీలిస్తున్నారు.

Update: 2026-08-24 08:30 GMT

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో భారీ యాక్షన్‌ మూవీని చేస్తున్న విషయం తెల్సిందే. సినిమా ఇప్పటికే షూటింగ్‌ పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ బాలకృష్ణకు ప్రమాదం జరగడంతో ఆలస్యం అయింది. గత కొన్ని రోజులుగా పూర్తి విశ్రాంతిలో ఉన్న బాలకృష్ణ తిరిగి షూటింగ్‌కు హాజరు అయ్యేందుకు రెడీ అవుతున్నారని సమాచారం అందుతోంది. బాలయ్య కోలుకున్న వెంటనే గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న NBK 111 సినిమా షూటింగ్‌లో పాల్గొంటారని నందమూరి కుటుంబ సన్నిహితులు చెబుతున్నారు. షూటింగ్ గ్యాప్‌ రావడంతో దర్శకుడు గోపీచంద్‌ మలినేని సినిమాకు సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ విషయమై ఆసక్తికర చర్చ జరుగుతోంది. దర్శకుడు రెండు పవర్‌ ఫుల్‌ టైటిల్స్‌ను పరిశీలిస్తున్నాడని సమాచారం అందుతోంది.

అల్లు అర్జున్‌, చిరంజీవి మూవీస్ తరహాలోనే...

చిత్ర యూనిట్‌ సభ్యుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం దాదా లేదా గాడ్‌ అనే టైటిల్స్‌ను పరిశీలిస్తున్నారు. ఈ మధ్య కాలంలో రెండు అక్షరాల టైటిల్స్‌ సెంటిమెంట్‌గా వస్తున్నాయి. పుష్ప సూపర్‌ హిట్‌ కావడంతో అల్లు అర్జున్‌ తన తాజా చిత్రానికి 'రాకా' అనే రెండు అక్షరాల పవర్‌ ఫుల్‌ టైటిల్‌ను ఖరారు చేసిన విషయం తెల్సిందే. మరో వైపు మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు 'కాకా' అనే టైటిల్‌ను కన్ఫర్మ్‌ చేస్తూ ఇటీవలే అధికారిక ప్రకటన వచ్చింది. ఇంకా పలువురు స్టార్‌ హీరోలు సైతం రెండు అక్షరాల పవర్‌ ఫుల్‌ టైటిల్స్‌ను పట్టుకునే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ, గోపీచంద్‌ మలినేని మూవీకి రెండు అక్షరాలతో గాడ్‌ లేదా దాదా అనే టైటిల్స్‌ను పరిశీలిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు దర్శకుడు గోపీచంద్‌ అండ్‌ టీం నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు.

బాలకృష్ణ, గోపీచంద్‌ మలినేని మూవీలో...

బాలకృష్ణ, గోపీచంద్‌ మలినేని కాంబోలో ఇప్పటికే ఒక సినిమా వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. అందుకే ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మద్య కాలంలో బాలయ్య సినిమాలన్నీ మినిమం గ్యారెంటీ అన్నట్లుగా హిట్‌ అవుతూ వస్తున్నాయి. అందుకే ఈ సినిమా సైతం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అనే నమ్మకం ఫ్యాన్స్‌లో కనిపిస్తుంది. సినిమా మరీ ఆలస్యం చేయకుండా డిసెంబర్‌లోనే విడుదల చేసే విధంగా దర్శకుడు గోపీచంద్‌ ప్లాన్‌ చేస్తున్నాడట. డిసెంబర్‌ 24న సినిమాను విడుదల చేయాలి అంటే వచ్చే నెల వరకు షూటింగ్‌ పూర్తి చేయాల్సి ఉంది. బాలకృష్ణ సర్జరీ నుంచి పూర్తిగా కోలుకోవడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. సెట్స్‌ లోకి బాలయ్య అడుగు పెడితే షూటింగ్‌ పూర్తి అయ్యే వరకు డేట్లు ఇచ్చే అవకాశం ఉంది.

కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా...

గోపీచంద్‌ మలినేని 'వీర సింహారెడ్డి' తర్వాత బాలీవుడ్‌లో జాట్‌ సినిమాను తీసి హిట్‌ కొట్టాడు. అందుకే హిందీలోనూ NBK 111 సినిమాపై అంచనాలు ఉన్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ బాలయ్య NBK 111 సినిమాను డబ్‌ చేసి పెద్ద ఎత్తున థియేట్రికల్‌ రిలీజ్‌ చేసేందుకు ఆసక్తిగా ఉందనే వార్తలు వస్తున్నాయి. అఖండ తో హిందీలో తనకంటూ మార్కెట్‌ను క్రియేట్‌ చేసుకున్న బాలకృష్ణ ఇప్పుడు NBK 111 సినిమాతో మరోసారి సత్తా చాటుతాడా అనేది చూడాలి. బాలకృష్ణకు జోడీగా ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ నటిస్తోంది. ఇంకా బాలీవుడ్‌ స్టార్‌ నటుడు బాబీ డియోల్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మంచు మనోజ్‌ సైతం కనిపించబోతున్నాడట. అయితే ఇప్పటి వరకు దర్శకుడు, చిత్ర యూనిట్‌ సభ్యులు ఈ విషయమై క్లారిటీ ఇవ్వలేదు. షూటింగ్‌ పునః ప్రారంభం అయిన వెంటనే విడుదల తేదీపై ప్రకటన చేయడంతో పాటు, మరిన్ని విషయాలను వెళ్లడించే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News