రాజ‌మౌళి 'అన‌కొండ‌' తెర‌కెక్కిస్తే?

దర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ల‌ను తెర‌కెక్కించ‌డంలో నిష్ణాతుడిగా పేరు తెచ్చుకున్నారు.;

Update: 2025-12-27 12:30 GMT

దర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ల‌ను తెర‌కెక్కించ‌డంలో నిష్ణాతుడిగా పేరు తెచ్చుకున్నారు. బాహుబ‌లి, బాహుబ‌లి 2, ఆర్ఆర్ఆర్ చిత్రాల‌తో 1000 కోట్ల క్ల‌బ్ ద‌ర్శ‌కుడిగా నిరూపించాడు. ఇప్పుడు ఏకంగా 1000కోట్ల బ‌డ్జెట్ తో మ‌హేష్ హీరోగా `వార‌ణాసి` సినిమాని తెర‌కెక్కిస్తున్నాడు. ఫారెస్ట్ అడ్వెంచ‌ర్ క‌థాంశంతో ఇండియానా జోన్స్ స్థాయిలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. అవ‌తార్ ఫేం, లెజెండ‌రీ ద‌ర్శ‌కుడు జేమ్స్ కామెరూన్ అంత‌టివాడే రాజ‌మౌళితో క‌లిసి ప‌ని చేయాల‌నుంద‌ని అన్నారు.

అయితే రాజ‌మౌళి ఇప్ప‌టివ‌ర‌కూ భార‌త‌దేశం, ప్ర‌పంచ‌వ్యాప్తంగా భార‌తీయులు నివ‌శించే ఇండియ‌న్ డ‌యాస్పోరా ప్ర‌జ‌ల కోసం సినిమా క‌థ‌ల్ని ఎంచుకున్నారు. కానీ ఇప్పుడు మ‌హేష్ `వార‌ణాసి`తో దీనిని బ్రేక్ చేస్తూ, గ్లోబ‌ల్ ఆడియెన్స్ కోసం అవెంజ‌ర్స్ రేంజులో ఒక సినిమాని మార్కెట్ చేయాల‌నే త‌ప‌న‌తో రాజ‌మౌళి ప‌ని చేస్తున్నారు. భాష‌, సంస్కృతి, ప్రాంతంతో సంబంధం లేకుండా `వార‌ణాసి` ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆడియెన్ ని మెప్పించ‌గ‌ల‌ద‌ని రాజ‌మౌళి న‌మ్మ‌కంతో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

అయితే ఎస్.ఎస్.రాజ‌మౌళి లాంటి ద‌ర్శ‌కుడు `అన‌కొండ` లాంటి థ్రిల్ల‌ర్ సినిమాని తెర‌కెక్కిస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచ‌న అభిమానుల్లో ఉత్సాహం పెంచుతోంది. దీనికి కార‌ణం ఇటీవ‌ల హాలీవుడ్ నుంచి వ‌చ్చిన అన‌కొండ సీక్వెల్. పేల‌వ‌మైన స్క్రీన్ ప్లే, చెత్త కామెడీతో ఈ సినిమా తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది. 1997 క్లాసిక్ `అన‌కొండ‌` భార‌త‌దేశంలోను ఎంతటి సంచ‌ల‌న విజ‌యం సాధించిందో తెలిసిందే. భాష‌తో సంబంధం లేకుండా ప్ర‌పంచ దేశాల‌లో ఎక్క‌డైనా `అన‌కొండ‌` అర్థ‌వంత‌మైన వినోద‌భ‌రిత‌మైన సినిమా. కానీ దానికి సీక్వెల్ తెర‌కెక్కించి వెర్రి కామెడీలు చేయిస్తే ఎలాంటి చెత్త రిజ‌ల్ట్ వ‌స్తుందో ఇప్పుడు 2025 అన‌కొండ నిరూపించింద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. అవ‌తార్ - ఫైర్ అండ్ యాష్ త‌ర్వాత మ‌రో డిజాస్ట‌ర్ సినిమా లోడింగ్! అంటూ కామెంట్ చేస్తున్నారు.

అస‌లు థ్రిల్స్ అన్న‌వే లేకుండా, అంత‌గా ఆక‌ట్టుకోని విజువ‌ల్ గ్రాఫిక్స్ తో ఒక చెత్త సినిమాని `అన‌కొండ‌` బ్రాండ్ తో రిలీజ్ చేయ‌డం అన్యాయం అని కొంద‌రు వ్యాఖ్యానిస్తే, ఇలాంటి సినిమాని రాజ‌మౌళి లాంటి దర్శ‌కుడు తెర‌కెక్కిస్తే, ఇంత‌కుమించి గ్రిప్పింగ్ గా ప్ర‌పంచ స్థాయిలో ట్రీటివ్వ‌గ‌ల‌ద‌ని కూడా కొంద‌రు విశ్లేషిస్తున్నారు. నిజానికి రాజ‌మౌళి వెర్స‌టైల్ స్క్రిప్టుల‌తో సినిమాలు తీయాల‌ని కూడా అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

2025- అన‌కొండ చిత్రానికి టామ్ గోర్మికన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అత‌డు హర్రర్, సస్పెన్స్‌పై దృష్టి పెట్టకుండా కామెడీ కోసం సినిమాని తెర‌కెక్కించ‌డంతో అది పూర్తిగా మిస్ ఫైర్ అయింది. అనకొండ (2025) ఒక సీరియస్ సర్వైవల్ థ్రిల్లర్ లాగా కాకుండా ఒక స్పూఫ్ లాగా అనిపిస్తుంది. చాలామంది ప్రేక్షకులు, విమర్శకులు హాస్యం బలవంతంగా రుద్దిన‌ట్టు ఉంద‌ని కూడా విమ‌ర్శించారు. అస‌లు స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ ల‌క్ష‌ణం లేక‌పోవ‌డ‌మే ఈ ఫెయిల్యూర్ కి కార‌ణ‌మ‌ని విశ్లేషించారు. కేవ‌లం 90 ని.ల నిడివితో ఉన్న ఈ సినిమాతో మెప్పించ‌లేపోయిన ద‌ర్శ‌కుడిని తీవ్రంగా విమ‌ర్శిస్తున్నారు.

Tags:    

Similar News