పవర్‌ స్టార్‌ పేరు పెట్టుకుని ఇవేం పాడు పనులు..?

పవన్‌ స్టార్‌ అనగానే తెలుగు ప్రేక్షకుల్లో చిన్న వారి నుంచి ముసలి వారి వరకు పవన్‌ కళ్యాణ్‌ గుర్తుకు వస్తాడు.;

Update: 2025-07-31 21:30 GMT

పవన్‌ స్టార్‌ అనగానే తెలుగు ప్రేక్షకుల్లో చిన్న వారి నుంచి ముసలి వారి వరకు పవన్‌ కళ్యాణ్‌ గుర్తుకు వస్తాడు. ఆ మధ్య సాయి పల్లవిని లేడీ పవర్‌ స్టార్‌ అంటూ అభిమానులు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేశారు. కన్నడ స్టార్‌ పునీత్‌ రాజ్‌ కుమార్‌ను సైతం అభిమానులు పవర్‌ స్టార్‌ అని పిలుచుకుంటూ ఉంటారు. అయితే హీరోలకు, హీరోయిన్స్‌కి అభిమానులు పవర్‌ స్టార్‌ అని పేరు పెడితే తమిళ నటుడు ఎస్ శ్రీనివాసన్‌ ఆ మధ్య తనకు తాను పవర్‌ స్టార్‌ శ్రీనివాసన్ అని పేరు పెట్టుకున్నారు. ఆ సమయంలోనే సోషల్‌ మీడియాలో చాలా మంది ఈయన్ను విమర్శించారు. నీ అవతారంకు పవర్‌ స్టార్‌ ఏంట్రా సామి అంటూ విమర్శలు చేయడంతో పాటు, కొందరు మీమ్స్ మెటీరియల్‌ అంటూ కామెంట్స్ చేశారు. కొందరు యాంటి పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ అతడిని వాడుకున్నారు.

రూ.1000 కోట్ల రుణం ఇప్పిస్తానని మోసం

చాలా సంవత్సరాల తర్వాత ఎస్‌ శ్రీనివాసన్ వార్తల్లో నిలిచాడు. అతడు అడపా దడపా సినిమాల్లో నటిస్తున్నప్పటికీ పెద్దగా గుర్తింపు దక్కించుకోలేక పోయాడు. ఇండస్ట్రీలో అతడి పోరాటం కొనసాగుతూనే ఉంది. ఇటీవల ఆయనను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఢిల్లీ పోలీసులు శ్రీనివాసన్‌ను అరెస్ట్‌ చేయడంతో కోలీవుడ్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీకి చెందిన ఒక సంస్థకు రూ.1000 కోట్ల రుణం ఇప్పిస్తాను అని మోసగించాడు. అందుకు గాను రూ.5 కోట్లను వసూళ్లు చేశాడు. వెయ్యి కోట్ల రుణం ఇప్పించలేకుంటే రూ.5 కోట్లను నెల రోజుల్లో తిరిగి ఇస్తానంటూ అతడు సదరు సంస్థకు హామీ ఇచ్చాడు. ఇది జరిగి ఆరు ఏడు సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు ఆ సంస్థకు శ్రీనివాసన్ డబ్బు తిరిగి ఇవ్వలేదు.

ఢిల్లీ పోలీసుల అదుపులో పవర్‌ స్టార్‌ శ్రీనివాసన్‌

గత కొన్నాళ్లుగా ఈ విషయమై సదరు సంస్థకు శ్రీనివాసన్‌కు మద్య వాగ్వాదాలు నడుస్తున్నాయట. డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో సంస్థ ప్రతినిధులు ఢిల్లీ పోలీస్‌ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం, కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్‌ చేయడం జరిగిందట. చెన్నైలో శ్రీనివాసన్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు తమతో పాటు ఢిల్లీకి తీసుకు వెళ్లారు. ఇప్పటి వరకు అతడి నుంచి ఈ విషయమై ఎలాంటి వివరణ రాలేదు. ఆయన సన్నిహితులు, ఇండస్ట్రీలో ఆయనకు సన్నిహితంగా ఉండే వారు కూడా ఇప్పటి వరకు ఆ విషయమై స్పందించలేదు. తమిళ మీడియాలో ఈ విషయం గురించి పుంకాను పుంకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. శ్రీనివాసన్‌ విషయం గురించి కోలీవుడ్‌లో ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్స్ చేస్తున్నారు.

60 సినిమాల్లో నటించిన శ్రీనివాసన్‌

లథిక అనే సినిమాలో హీరోగా నటించిన ఈయన ఇప్పటి వరకు దాదాపుగా 60 సినిమాలు చేయడం జరిగింది. హీరోగా ఇప్పటి వరకు ఈయన నటించిన సినిమాలు పెద్దగా ఆడలేదు. కానీ ఈయన హీరోగా వచ్చిన ప్రతిసారి సోషల్‌ మీడియాలో హడావిడి ఉండేది. ఇతడు హీరో ఏంటి అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉండేవారు. పవర్‌ స్టార్‌ అంటూ తనకు తాను పెట్టుకున్న సమయంలో కూడా చాలా మంది చాలా రకాలుగా విమర్శలు చేశారు. ఇప్పుడు మరోసారి గౌరవ ప్రధమైన పవర్‌ స్టార్‌ పేరును పెట్టుకుని ఇలా చీటింగ్‌కు పాల్పడటం, అరెస్ట్‌ కావడం ఎంత వరకు కరెక్ట్‌ అంటూ సోషల్‌ మీడియాలో ఇతడిని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసు నుంచి బయట పడి తిరిగి సినిమాల్లో ఈయన నటిస్తాడా అనేది చూడాలి.

Tags:    

Similar News