శ్రీదేవి నిర్మాతగా.....మెగాస్టార్ హీరోగా
అతి లోక సుందరిగా శ్రీదేవి పేరు గడించింది. చిన్ననాటి నుంచే నటనను ప్రాణంగా భావించి వెండి తెర మీద రాణించింది శ్రీదేవి.;
అతి లోక సుందరిగా శ్రీదేవి పేరు గడించింది. చిన్ననాటి నుంచే నటనను ప్రాణంగా భావించి వెండి తెర మీద రాణించింది శ్రీదేవి. ఎవరి పక్కన అయితే మనవరాలిగా కూతురుగా నటించిందో ఆ ఆగ్ర నటులతోనే తరువాత కలాంలో హీరోయిన్ గా నటించి సూపర్ హిట్లు కొట్టింది. వారికి సరైన జోడి అన్న పేరు తెచ్చుకుంది. శ్రీదేవి తెలుగు తెరకు ఎప్పటికీ ఎవర్ గ్రీన్ హీరోయిన్ గానే ఉండిపోయారు అని చెప్పాలి.
బాలీ వుడ్ లో టాప్ :
బాలీవుడ్ లో సౌత్ నుంచి వెళ్ళి అత్యధిక కాలం నంబర్ వన్ హీరోయిన్ గా రాణించడం అంటే మాటలు కాదు. అది శ్రీదేవి మాత్రమే సాధించారు. అలా వన్ అండ్ ఓన్లీగా ఆమె రికార్డు క్రియేట్ చేశారు. శ్రీదేవి కెరీర్ లో ఎన్నో అధ్బుతమైన చిత్రాలు ఉన్నాయి. నటనకు ప్రదానమైన చిత్రాలలో వసంత కోకిల చాలు ఆమె ప్రతిభ ఏమిటో చెప్పడానికి గ్లామర్ తో పాటు నటన కూడా కలిగి ఉన్న అరుదైన హీరోయిన్ గా శ్రీదేవిని అంతా చెబుతారు.
ఎన్టీఆర్ నుంచి :
ఇదిలా ఉంటే ఎన్టీఆర్ నుంచి మొదలెడితే అక్కినేని, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు ఇలా అలనాటి టాప్ ఫైవ్ తో శ్రీదేవి నటించి సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. ఆ తరువాత వరసలో మెగాస్టార్ చిరంజీవితో ఆమె నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి బ్లాక్ బస్టర్ మూవీ. ఈ రోజుకీ అది వెండి తెర కావ్యంగా ఉంటుంది అంటే అతిశయోక్తి కాదు, చిరంజీవి శ్రీదేవి మొదటిసారి నటించింది మోసగాడు మూవీలో. ఇందులో శోభన్ బాబు హీరోగా నటిస్తే చిరంజీవి విలన్ గా కనిపిస్తారు. శ్రీదేవి ద్విపాత్రాభినయం చేస్తుంది. శ్రీదేవికి చిరంజీవికి ఈ సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది. కె రాఘవేంద్రరావు డైరెక్టర్. ఆ తరువాత రాణికాసుల రంగమ్మలో కూడా చిరంజీవి శ్రీదేవి జంటగా నటించారు.
శ్రీదేవి స్వీయ నిర్మాణంలో :
ఇదిలా ఉంటే శ్రీదేవి తాను నిర్మాతగా హీరోయిన్ గా మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఒక సినిమాను రూపొందించాలనుకున్నారు. ఇక ఈ సినిమా కూడా 1990 దశకంలో జగదేకవీరుడు అతిలోకసుందరి కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ వస్తున్నది కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాకు వజ్రాల దొంగ అని పేరు పెట్టారు. దర్శకుడు ఏ కోదండరామిరెడ్డి. పూజా కార్యక్రమాలు జరిగాయి. షూటింగ్ దశలోనే ఈ మూవీ ఆగిపోవడం అప్పట్లో సంచలనం సృష్టించింది.
మరో బ్లాక్ బస్టర్ గా :
ఈ మూవీ ఏ కారణాల వల్ల ఆగిపోయిందో ఇదమిద్దంగా వివరాలు అయితే ఎవరికీ తెలియదు కానీ శ్రీదేవి నిర్మాతగా హీరోయిన్ గా చిరంజీవి హీరోగా ప్లాన్ చేసిన భారీ చిత్రం వజ్రాల దొంగ రిలీజ్ అయి ఉంటే ఎన్నో రికార్డులు క్రియేట్ చేసి ఉండేది అని అంతా అంటారు. అలా శ్రీదేవి తెలుగులో ఒక భారీ చిత్రం తీయాలను తాను నిర్మాతగా కూడా సూపర్ సక్సెస్ కావాలని అనుకున్నా అది నెరవేరలేదు.
బ్రహ్మర్షి విశ్వామిత్రలో :
ఇక ఎన్టీఆర్ సీఎం గా ఉమ్మడి ఏపీలో ఉంటూ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన బ్రహ్మర్షి విశ్వామిత్ర నిర్మాణం తలపెట్టారు. ఆ రోజులలో అది పాన్ ఇండియా లెవెల్ మూవీ. అంతా ఉత్తరాది దక్షిణాది తారలను టెక్నీషియన్స్ ని తీసుకున్నారు. ఈ మూవీలో మేనక పాత్ర కోసం తొలుత అనుకున్నది శ్రీదేవినే. ఆమె అప్పటికి బాలీవుడ్ లో నంబర్ వన్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. పైగా శ్రీదేవి ఎన్టీఆర్ కాంబినేషన్ సూపర్ హిట్ అన్నది కూడా ఉంది. అయితే ఎందుకో ఈ కాంబో సెట్ కాలేదు, దాంతో శ్రీదేవి ప్లేస్ లోకి మీనాక్షీ శేషాద్రిని తీసుకున్నారు. అలా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్ళాక శ్రీదేవితో ఆయన నటించే ఒక కాంబో మిస్ అయింది అని ప్రచారంలో ఉంది.
బాలయ్య శ్రీదేవి మూవీ మిస్ :
ఇక నందమూరి బాలకృష్ణ ఒక్కరు తప్ప మిగిలిన టాప్ త్రీ అంతా శ్రీదేవితో కలసి నటించారు. చిరంజీవి నాగార్జున వెంకటేష్ శ్రీదేవితో కలసి నటించి సూపర్ హిట్స్ కొట్టారు. దాంతో బాలయ్య శ్రీదేవి కాంబోని సెట్ చేయాలని అప్పట్లో కొందరు నిర్మాతలు దర్శకులు ప్లాన్ చేశారు కానీ కాల్షీట్ల ప్రాబ్లం వల్ల కుదరలేదు అని అంటారు. ఏది ఏమైనా వెండి తెర అతిలోక సుందరి ఒక చరిత్ర. ఆమె 2018 ఫిబ్రవరి 24న ఈ లోకాన్ని వీడిపోయారు. ఆమె వర్ధంతి వేళ అభిమానులు అంతా తలచుకుంటున్నారు.