శ్రీదేవి ఫ్యాన్స్‌కు శుభవార్త.. బయోపిక్ కాదు బయోగ్రఫీ సిద్ధం!
ఇటీవల శ్రీదేవి జయంతి సందర్భంగా నటి ప్రియాంక చోప్రా అధికారిక జీవిత చరిత్ర (బయోగ్రఫీ) పుస్తకం కవర్ పేజీని సోషల్ మీడియాలో షేర్ చేసారు.
భారతీయ చిత్ర పరిశ్రమలో అతిలోక సుందరిగా.. మొదటి మహిళా సూపర్ స్టార్‌గా చెరగని ముద్ర వేసిన నటి శ్రీదేవి. తనదైన అద్భుత నటన, అందం, అభినయంతో తరాలుగా లక్షలాది మంది అభిమానుల హృదయాలను కొల్లగొట్టారు. బాలనటిగా ప్రస్థానం ప్రారంభించి తమిళ, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అగ్ర కథానాయకిగా వెలిగిన శ్రీదేవి భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ప్రతిభావంతమైన నటీమణులలో ఒకరిగా నిలిచిపోయారు.
ఇటీవల శ్రీదేవి జయంతి సందర్భంగా నటి ప్రియాంక చోప్రా అధికారిక జీవిత చరిత్ర (బయోగ్రఫీ) పుస్తకం కవర్ పేజీని సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఎంప్రెసే - ది డెఫినిటివ్ బయోగ్రఫీ ఆఫ్ శ్రీదేవి` పేరుతో వస్తున్న ఈ పుస్తకాన్ని ధీరజ్ యు. కుమార్ రచించారు. వెస్ట్‌లాండ్ బుక్స్ ప్రచురిస్తున్న ఈ పుస్తకానికి శ్రీదేవి భర్త, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ పూర్తి మద్దతు తెలిపారు. ఈ కవర్ పేజీపై అమితాబ్ బచ్చన్ ఇచ్చిన ది ఎపిటోమ్ ఆఫ్ అన్‌మిటిగేటెడ్ టాలెంట్ అనే వ్యాఖ్య శ్రీదేవి నట వైదుష్యానికి నిదర్శనంగా నిలుస్తుంది.
ఈ వార్తతో శ్రీదేవి జీవితంపై సినిమా రాబోతోందనే ప్రచారం మళ్లీ మొదలైనా.. అది కేవలం పుస్తకం మాత్రమేనని స్పష్టమవుతోంది. శ్రీదేవి జీవితంపై ఎటువంటి బయోపిక్ సినిమా తీయడానికి బోనీ కపూర్ అంగీకరించడం లేదు. వెటరన్ నటి వ్యక్తిగత జీవితం చాలా పవిత్రమైనదని... దానిని వెండితెరపై చూపించడానికి తాను అంగీకరించనని ఆయన గతంలోనే స్పష్టం చేశారు. అందువల్ల ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలు లేదా ట్రైలర్లు కేవలం అభిమానులు తయారుచేసిన ట్రిబ్యూట్స్ మాత్రమే.
శ్రీదేవి సినీ ప్రయాణంలో జగదేకవీరుడు అతిలోకసుందరి, క్షణ క్షణం, మిస్టర్ ఇండియా, చాందిని, సద్మా వంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలు ఉన్నాయి. వివాహం తర్వాత నటనకు కొంతకాలం విరామం ఇచ్చినా ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంతో అద్భుతమైన రీ-ఎంట్రీ ఇచ్చి తన నటనలోని పదును తగ్గలేదని నిరూపించారు. ఆమె చివరి చిత్రంగా వచ్చిన మామ్ (2017) సినిమాలోని నటనకుగాను మరణానంతరం `ఉత్తమ నటి`గా జాతీయ చలనచిత్ర పురస్కారం లభించింది.
24 ఫిబ్రవరి 2018న దుబాయ్‌లో శ్రీదేవి అకస్మాత్తుగా తుదిశ్వాస విడవడం సినీ ప్రపంచాన్ని కోట్లాది మంది అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మేటి నటి మన మధ్య లేకపోయినా తను నటించిన పాత్రలు, జ్ఞాపకాలు ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. విడుదలకు సిద్ధమైన జీవిత చరిత్ర పుస్తకం ద్వారా శ్రీదేవి సినీ వ్యక్తిగత జీవితంలోని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు అభిమానులకు తెలిసే అవకాశం ఉంది.