అరుంధతి రీమేక్.. ఎలా చూసినా డేంజరే!
టాలీవుడ్ సినీ హిస్టరీలో సూపర్ నేచురల్ థ్రిల్లర్ లకు కొత్త దారి చూపించిన సినిమా అరుంధతి.;
టాలీవుడ్ సినీ హిస్టరీలో సూపర్ నేచురల్ థ్రిల్లర్ లకు కొత్త దారి చూపించిన సినిమా అరుంధతి. పునర్జన్మ కథగా తెరకెక్కిన ఈ సినిమా మాయ, మంత్రం, సెంటిమెంట్, థ్రిల్ అన్నింటినీ కలగలిపి ఆడియన్స్ ను ఆకట్టుకుంది. హార్రర్, థ్రిల్లర్, ఎమోషన్స్ అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ వచ్చిన ఈ సినిమాకు ఇప్పటికీ ఆడియన్స్ గుండెల్లో ప్రత్యేక స్థానముంటుంది. అప్పటివరకు హీరోల సరసన రొమాంటిక్ సినిమాలు చేస్తూ వచ్చిన అనుష్కను స్టార్ హీరోయిన్ గా మార్చింది ఆ సినిమానే.
అరుంధతి సినిమా అనుష్కకు ఉత్తమ నటిగా నంది అవార్డు, ఫిల్మ్ ఫేర్ అవార్డులను కూడా తెచ్చిపెట్టింది. అప్పట్లోనే అరుంధతిలో వచ్చిన వీఎఫ్ఎక్స్ ఎంతో హాట్ టాపిక్ గా మారడంతో పాటూ ఈ మూవీ సాధారణ ఆడియన్స్ నుంచే కాకుండా విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. అలాంటి మైథలాజికల్ థ్రిల్లర్ ను ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు.
ప్రస్తుతం హార్రర్ సినిమాలకు మంచి ఆదరణ ఉండటంతో ఈ సినిమాను రీమేక్ చేయాలని భావించి దాన్ని పట్టాలెక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే అరుంధతి లాంటి మాస్టర్ పీస్ సినిమాలను రీమేక్ చేయడానికి ఎన్నో గట్స్ కావాలి. అందులోనూ ఓ భాషలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాను రీమేక్ చేస్తే దానికి పోలికలు పెట్టే ప్రమాదం కూడా ఉంటుంది.
విమర్శల పాలైన అరుంధతి బెంగాలీ రీమేక్
యధాతథంగా రీమేక్ చేస్తే సీన్ టూ సీన్ దించేశారంటారు. పోనీ కొన్ని మార్పులు చేద్దామా అంటే కథను మార్చి పాడుచేశారని అంటారు. అందుకే రీమేక్స్ ఎప్పుడైనా డేంజరే. ఆల్రెడీ ఈ మాస్టర్‌పీస్ ను బెంగాలీలో రీమేక్ చేశారు. అయితే ఆ రీమేక్ చూసి నార్త్ ఆడియన్సే బెంగాలీ వెర్షన్ ను ఒరిజినల్ మూవీతో కంపేర్ చేస్తూ పలు వీడియోలతో ట్రోల్ చేశారు.
అలాంటి సినిమాను ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేయడం, అందులోనూ అనుష్క నటించిన పాత్రను శ్రీలీలతో చేయించడమంటే ఇది చాలా పెద్ద సవాలనే చెప్పాలి. టాలీవుడ్ లో వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న శ్రీలీలకు అరుంధతి రీమేక్ ఛాన్స్ సువర్ణావకాశమైనప్పటికీ ఆమె అనుష్క స్టాండర్డ్స్ ను ఏ మేరకు మ్యాచ్ చేస్తుందనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. పైగా ఈ సినిమాకు ప్రస్తుతం పెద్దగా ఫామ్ లో లేని మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారంటున్నారు. అన్నీ బావుండి సినిమా వర్కవుట్ అయితే బానే ఉంటుంది కానీ ఒకవేళ ఏమైనా తేడా కొట్టి రిజల్ట్ కాస్త అటూ ఇటూ అయితే అటు శ్రీలీల, ఇటు మోహన్ రాజా ఎన్నో విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎలా చూసుకున్నా శ్రీలీలకు అరుంధతి రీమేక్ డేంజరే.