అప్పుడు నాని.. ఇప్పుడు శ్రీవిష్ణు.. రిజల్ట్ సంగతేంటి?

టాలీవుడ్‌ హీరోలు ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడం సహజమే;

Update: 2026-02-11 09:22 GMT

టాలీవుడ్‌ హీరోలు ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడం సహజమే. కానీ ఒకే హీరో నటించిన రెండు చిత్రాలు ఒకే రోజు థియేటర్లలోకి రావడం మాత్రం చాలా అరుదు. ఇప్పుడు యంగ్ హీరో శ్రీవిష్ణు కెరీర్ లో అదే జరుగనుంది. ఈసారి తనకు తానే ఆయన పోటీగా దిగడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌ గా మారింది.

శ్రీ విష్ణు లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న మృత్యుంజయ్, విష్ణు విన్యాసం చిత్రాలు ఫిబ్రవరి 27న ఒకే రోజు విడుదలకు సిద్ధమయ్యాయి. దీంతో ఇప్పుడు ఆ విషయంపై జోరుగా చర్చ జరుగుతోంది. ఒకే హీరో నుంచి ఒకే రోజు రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానుండడంతో ఏ చిత్రం ఎలాంటి రిజల్ట్ సాధిస్తుందో అన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది. అయితే శ్రీ విష్ణు కథల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ తనకంటూ ప్రత్యేక మార్క్ సెట్ చేసుకున్నారు.

కంటెంట్ బేస్డ్ మూవీలు, కామెడీ ఎంటర్టైనర్లు, యాక్షన్ డ్రామాలు ఇలా అన్ని జానర్లలో తన యాక్టింగ్ తో ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు మృత్యుంజయ్ మూవీ యాక్షన్, ఎమోషన్స్ తో సీరియస్ టోన్‌ లో ఉండనుండగా, విష్ణు విన్యాసం మాత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ గా ఫన్ తోపాటు మెసేజ్ ఇచ్చే కథగా రూపొందిందని సమాచారం. రెండు సినిమాలు భిన్న జానర్లలో ఉండటంతో వేర్వేరు ఆడియన్స్‌ ను టార్గెట్ చేస్తున్నాయి. అందుకే కలెక్షన్లపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

కానీ థియేటర్ల పంపిణీ, షోల కేటాయింపుల విషయంలో మాత్రం సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే శ్రీవిష్ణు లాగే గతంలో నేచురల్ స్టార్ నాని కూడా ఒకే రోజు రెండు సినిమాలతో వచ్చారు. 2015 మార్చి 21న ఆయన నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం, జెండా పై కపిరాజు చిత్రాలు విడుదలయ్యాయి. అందులో ఎవడే సుబ్రహ్మణ్యం విమర్శకుల ప్రశంసలు అందుకుని మంచి విజయం సాధించగా, జెండా పై కపిరాజు మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు.

అయినప్పటికీ నానికి ఆ సినిమా కెరీర్‌ లో మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. ఇప్పుడు అదే తరహాలో శ్రీ విష్ణు కూడా రిస్క్ తీసుకుంటూ డబుల్ రిలీజ్‌ కు రెడీ అవుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఇప్పటికే శ్రీ విష్ణు vs శ్రీ విష్ణు అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. అయితే కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటే రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించే అవకాశం ఉందని పలువురు సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు.

మొత్తానికి ఫిబ్రవరి 27వ తేదీన థియేటర్లలో శ్రీ విష్ణు డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నారని చెప్పాలి. మరి ఈ పోటీలో ఒక్క సినిమానే విజయం అందుకుంటుందో? లేక రెండూ హిట్ అవుతాయా? అన్నది తెలియాలంటే మరికొన్ని రోజుల వరకు వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News