నాలుగు గోడల మధ్య సినిమాలు చూసి కథలు రాసేవాళ్ల పని ఖాళీ
ఒక సినిమా చూసి దాన్ని అనుకరించి కథలు రాయడానికి.. వంద శాతం శ్రమతో, పరిశోధనతో కథకు జీవం పోయడానికి నక్కకీ నాకలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది.
కొన్ని డీవీడీలు వీసీడీలలో హాలీవుడ్ సినిమాలు చూసి వాటి రిఫరెన్స్ ఆధారంగా కథలు రాసే కాలం చెల్లిపోయిందా? అంటే అవుననే తాజా పరిణామం చెబుతోంది.....పూర్తి విశ్లేషణలోకి వెళితే...
ఒకప్పుడు సినిమా కథ రాయడం అంటే ఏ సీడీనో, డీవీడీనో ప్లే చేసి.. నాలుగు గోడల మధ్య కూర్చుని హాలీవుడ్ చిత్రాల నుంచి సీన్లు మక్కీకి మక్కీ కాపీ కొట్టడం లేదా వాటి రిఫరెన్స్‌తో ఒక ఫార్ములా కథను వండేయడమే. పాతతరం రచయితల్లో చాలామంది విదేశీ చిత్రాలు చూసి...మన నేటివిటీకి తగ్గట్లు కాస్త అటూఇటూ మార్చి స్క్రిప్టులు సిద్ధం చేసేవారు. అప్పట్లో ఇంటర్నెట్ గానీ... డిజిటల్ విప్లవాలు గానీ లేనే లేవ్.. దీంతో ప్రేక్షకులు కూడా ఆ కాపీ సినిమాలను చూసి తరిచేసేవారు. కానీ ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో ``పులిహోర కలపడం.. కాపీ కొట్టడం`` అనే విద్యకి కాలం చెల్లిపోయింది. నాలుగు గోడల మధ్య కుర్చీలేసుకుని రాసే రచయితల పనైపోయింది.
ఒక సినిమా చూసి దాన్ని అనుకరించి కథలు రాయడానికి.. వంద శాతం శ్రమతో, పరిశోధనతో కథకు జీవం పోయడానికి నక్కకీ నాకలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. నిజ జీవిత సంఘటనలు, చారిత్రక అంశాలు, జానపద కథలు, యోధుల సాహసాలు లేదా సైనికుల త్యాగాలను తెరపైకి తేవాలంటే కేవలం ఊహాశక్తి మాత్రమే సరిపోదు. చరిత్ర నుంచి ఆధారాలు సంగ్రహించడం వేరు, దానికి ప్రత్యక్ష సాక్ష్యాలను జోడించడం వేరు. నేటితరం కథా రచయితలు లొకేషన్లకు వెళ్లి.. అక్కడ ఉంటూ... స్థానిక పరిస్థితులను, సంస్కృతిని లోతుగా అధ్యయనం చేసి స్క్రిప్టులు తయారు చేస్తున్నారు. ఈ ప్రాసెస్ ఎంత శ్రమతో, ఆర్థిక భారంతో, రిస్కుతో కూడుకున్నదైనా.. కథలో నేటివిటీ, జీవం ప్రతిఫలించాలంటే ఈ తరహా రీసెర్చ్ అత్యంత అవసరం.
టాలీవుడ్‌ను పరిశీలిస్తే... నేటికీ పాత అలవాటు ప్రకారం ఇంట్లో లేదా ఏ హోటల్ రూమ్‌లోనో కూర్చుని నాలుగు హాలీవుడ్ కథలను మిక్స్ చేసి కథలు వండే రచయితలు లేకపోలేదు. అయితే నేటి ఓటీటీ, గ్లోబల్ సినిమా యుగంలో ప్రేక్షకుడు ఏ విషయాన్నైనా క్షణాల్లో పసిగట్టేస్తున్నాడు. అందుకే కథలో నిజాయితీ లేకపోతే బాక్సాఫీస్ వద్ద తీవ్ర పరాభవం ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రపంచ స్థాయి కథలు పుట్టుకురావాలంటే రచయితలు గదుల నుంచి బయటకు రావాల్సిందే. క్షేత్రస్థాయికి వెళ్లి సమాజాన్ని.. మనుషులను... వారి భావోద్వేగాలను ప్రత్యక్షంగా పరిశీలించినప్పుడే అసలైన, వినూత్నమైన కథలు స్క్రిప్టుగా రూపాంతరం చెందుతాయి.
అయితే ఒక రచయిత కేవలం ఆలోచించడమే కాకుండా... నెలల తరబడి రీసెర్చ్ చేయడానికి ముందుకు వెళ్లాలంటే ఆయన వెనుక ఒక బలమైన నిర్మాత నిలబడాలి. రచయితల పోషణ, వారి రీసెర్చ్ కోసం నిర్మాత చేసే పెట్టుబడే చివరికి ఆ సినిమా క్వాలిటీ కంటెంట్‌ను నిర్ణయిస్తుంది. మన టాలీవుడ్‌లో రచయితలపై అలాంటి గొప్ప నమ్మకంతో.. పెద్ద మనసుతో పెట్టుబడి పెట్టే నిర్మాతలు ఎంతమంది ఉన్నారు? అన్నదే ఇప్పుడు పరిశ్రమ ముందున్న ప్రధాన ప్రశ్న. రచయితలకు తగిన సమయం.. ఆర్ధిక ప్రోత్సాహం అందిస్తేనే వారు తమ సృజనాత్మకతను పూర్తిస్థాయిలో బయటకు తీయగలుగుతారు.
భారతీయ సినిమాను... ముఖ్యంగా తెలుగు సినిమాను ప్రపంచ వేదికపై నిలబెట్టాలంటే మనకు క్రిస్టోఫర్ నోలన్ వంటి దర్శకరచయితలు కావాలి. నోలన్ క్రియేటివిటీ వెనుక వందల గంటల వైజ్ఞానిక... చారిత్రక పరిశోధన ఉంటుంది. అలాంటి నోలన్లు మన దేశం నుండి కూడా పుట్టుకురావాలంటే.. దానికి నిర్మాతలు తగిన పునాది వేయాల్సి ఉంది. రీసెర్చ్ ఆధారిత కథలను ప్రోత్సహిస్తూ... రచయితలను ఆర్థికంగా బలపరిస్తేనే మన ఇండస్ట్రీ నుండి గ్లోబల్ స్థాయిలో రికార్డులు క్రియేట్ చేసే సంచలనాత్మక చిత్రాలు రూపుదిద్దుకుంటాయి.