సౌత్‌లో స్టార్ హీరో సూర్య - నార్త్‌లో ర‌ణ్‌వీర్ సింగ్.. బాలిక‌ల విద్య కోసం!

`సేవ సంకల్ప్ అభియాన్`లో భాగం కావాలని నిర్ణయించుకున్న రణ్‌వీర్ సింగ్ ఏకంగా 1000 మంది బాలికల (కూతుళ్ల) విద్యకు అవసరమైన ఆర్థిక సహాయం అందిస్తానని ప్రతిజ్ఞ చేశారు.

Update: 2026-09-18 18:30 GMT

బాలీవుడ్ ప్రముఖ నటుడు రణ్‌వీర్ సింగ్ గణేష్ చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకుని ఒక గొప్ప సామాజిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముంబైలోని ప్రసిద్ధ లాల్‌బాగ్‌చా రాజా పండల్‌ను సందర్శించి వినాయకుడిని దర్శించుకున్న ఆయన దేశ ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భాన్ని కూడా పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. `సేవ సంకల్ప్ అభియాన్`లో భాగం కావాలని నిర్ణయించుకున్న రణ్‌వీర్ సింగ్ ఏకంగా 1000 మంది బాలికల (కూతుళ్ల) విద్యకు అవసరమైన ఆర్థిక సహాయం అందిస్తానని ప్రతిజ్ఞ చేశారు.

ఈ సందర్భంగా రణ్‌వీర్ సింగ్ మాట్లాడుతూ.. గత సంవత్సరం బాప్పా దయవల్ల తన కుటుంబానికి.. తనకు ఎంతో ఆనందంగా గడిచిందని.. అందుకే ఆయనకు కృతజ్ఞతలు చెప్పడానికి..భవిష్యత్తు ప్రయాణానికి ఆశీస్సులు కోరడానికి వచ్చామని తెలిపారు. ఈ పవిత్రమైన రోజున 1000 మంది బాలికల చదువుకు మద్దతు ఇస్తున్నానని.. ఈ సేవా కార్యక్రమంతో బాప్పా సంతోషిస్తారని.. ఆయన ఆశీస్సులు ఎప్పుడూ తమపై ఉంటాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈయన తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ ప్రశంసల జల్లు కురిపించారు.

సూర్య‌, మ‌హేష్ లాంటి స్టార్ల ధాతృత్వం:

ఇలాంటి సత్కార్యాలలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య.. ఆయన సతీమణి జ్యోతిక ఎప్పుడూ ముందుంటారు. వారు తమ `అగరం ఫౌండేషన్` ద్వారా గత కొన్నేళ్లుగా ఎంతోమంది నిరుపేద విద్యార్థులకు... ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన బాలికల చదువుకు అండగా నిలుస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు మధ్యలో ఆపేస్తున్న ఎంతోమంది అమ్మాయిల ఉన్నత చదువులకు ఈ ఫౌండేషన్ భరోసా కల్పిస్తూ వస్తోంది.

సూర్య - జ్యోతిక దంపతులు కేవలం ఆర్థిక సహాయం అందించడమే కాకుండా.. విద్యార్థుల కెరీర్ మార్గదర్శకత్వంలోనూ వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎందరో అమ్మాయిలను ప్రయోజకులను చేస్తూ సమాజంలో మహిళా సాధికారతకు ఈ జంట ఒక ఆదర్శవంతమైన మార్గాన్ని ఏర్పరచింది. వారి నిస్వార్థ సేవలు సినీ పరిశ్రమలోనే కాక దేశవ్యాప్తంగా ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి.

ఇదే కోవలో టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు కూడా బాలికల విద్య- సంక్షేమం కోసం తనవంతు సహకారం అందిస్తున్నారు. పలు గ్రామాలను దత్తత తీసుకోవడంతో పాటు.. నిరుపేద పిల్లల గుండె ఆపరేషన్లతో పాటు విద్యాలయాల అభివృద్ధికి, ముఖ్యంగా ఆడపిల్లల చదువులకు ఆయన పెద్దఎత్తున ఆర్థిక సాయం చేస్తూ వస్తున్నారు. మన దేశీయ చలనచిత్ర పరిశ్రమలో ఇలాంటి స్టార్ హీరోలు తమ సంపాదనలో కొంత భాగం సమాజ సేవా కార్యక్రమాలకు... ప్రత్యేకించి బాలికల విద్య కోసం వెచ్చించడం ద్వారా తమ సామాజిక బాధ్యతను చాటుకుంటూ నిజమైన హీరోలుగా నిలుస్తున్నారు.

Tags:    

Similar News