దిశ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు.. యువ హీరో ఆవేద‌న‌!

బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన దివంగత సెలబ్రిటీ మేనేజర్ దిశ సాలియన్ మృతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది.

Update: 2026-09-15 10:45 GMT

బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన దివంగత సెలబ్రిటీ మేనేజర్ దిశ సాలియన్ మృతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ (CBI) తాజాగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం.. అందులో పలువురితో పాటు తన పేరు కూడా ప్రస్తావనకు రావడంపై యువ నటుడు సూరజ్ పంచోలి తీవ్రంగా స్పందించారు. ఈ వివాదంతో తనకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ అత‌డు సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తన పేరును పదే పదే ఈ వివాదంలో లాగడం వల్ల తాను తీవ్రమైన మానసిక వేదనను ఎదుర్కొంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కేసుకు సంబంధించి తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ సూరజ్ పంచోలి కొన్ని స్పష్టమైన నిజాలను ప్రజల ముందుంచారు. తన జీవితంలో దిశ సాలియన్‌ను ప్రత్యక్షంగా గానీ.. పరోక్షంగా గానీ తాను ఎప్పుడూ కలవలేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఈ ఎఫ్‌ఐఆర్‌లో పేరున్న శివసేన (యూబీటీ) నేత ఆదిత్య థాక్రేను కూడా తాను తన జీవితంలో ఎన్నడూ కలవలేదని తేల్చిచెప్పారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేక‌పోయినా తన పేరును ఈ కేసులో ప్రచారం చేయడం అత్యంత అన్యాయమని ఆవేదన చెందారు.

కొన్ని సంవత్సరాల క్రితమే ఈ కేసుకు సంబంధించి సీబీఐ - పోలీసు అధికారులు తనను విచారించారని.. అప్పట్లోనే తన వాంగ్మూలాన్ని (స్టేట్‌మెంట్) కూడా రికార్డ్ చేశారని సూరజ్ గుర్తు చేశారు. అప్పట్లో దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరించానని.. భవిష్యత్తులో కూడా దర్యాప్తు సంస్థలు ఎప్పుడు పిలిచినా విచారణకు అందుబాటులో ఉంటానని ఆయన స్పష్టం చేశారు. తనకు చట్టంపైనా దర్యాప్తు సంస్థలపైనా పూర్తి నమ్మకం ఉందని.. త్వరలోనే నిజానిజాలు అన్నీ వెలుగులోకి వస్తాయనే ధీమాను వ్యక్తం చేశారు.

సోషల్ మీడియాలో వచ్చే హెడ్‌లైన్స్ లేదా టెలివిజన్ డిబేట్లను చూసి ఎవరి వ్యక్తిత్వాన్ని కూడా గుడ్డిగా తప్పుగా అంచనా వేయవద్దని యువ‌న‌టుడు పాంచోళి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిర్ధారణ కాని వదంతులను నమ్మవద్దని కోరుతూ.. ఎవరి మరణాన్నీ కూడా ఆధారాలు లేకుండా మరొకరి పరువు ప్రతిష్టలను దెబ్బతీయడానికి ఆయుధంగా మలచకూడదని సూరజ్ అభిప్రాయపడ్డారు. కేవలం సంచలనం కోసం జరిగే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కోరారు.

బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసుకు సంబంధించి దర్యాప్తును వేగవంతం చేసిన నేపథ్యంలో సూరజ్ పంచోలి చేసిన ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఏది ఏమైనా ఎలాంటి ప్రమేయం లేని విషయంలో తన పేరును ఇరికించడం ద్వారా తన పరువుకు భంగం కలిగిస్తున్నారని.. ఈ దుష్ప్రచారానికి తెరపడాలని ఆయన బలంగా కోరుకుంటున్నారు.

దివంగ‌త న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మ‌ర‌ణానికి ముందు అత‌డి మేనేజ‌ర్ దిశా సాలియ‌న్ అనుమానాస్ప‌దంగా మ‌ర‌ణించ‌గా, అది ఆత్మ‌హ‌త్య అని ద‌ర్యాప్తు సంస్థ‌లు ధృవీక‌రించాయి.. కానీ దిశా సాలియ‌న్ తండ్రి ఫిర్యాదును స్వీక‌రించిన కోర్టు ఈ కేసును సీబీఐకి అప్ప‌గించింది. ఆ త‌ర్వాత మీడియా హెడ్ లైన్స్ లో రాజ‌కీయ నాయ‌కుడు, ఎమ్మెల్యే ఆదిత్యా థాక్రే పేరుతో పాటు యువ‌హీరో సూర‌జ్ పాంచోళి పేరును మీడియాలు హైలైట్ చేసాయి. ఈ నేప‌థ్యంలోనే అత‌డు ఇలా స్పందిస్తూ ఆవేద‌న వ్య‌క్తం చేసారు.

Tags:    

Similar News