సౌత్ పై శోభిత ఫోకస్.. టార్గెట్ ను అందుకుంటుందా?
మరికొద్ది రోజుల్లో తెలుగులో చీకట్లో అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవ్వనున్న ఆ సినిమా థ్రిల్లర్ జోనర్ లో రూపొందుతోంది.;
నటి శోభితా ధూళిపాళ్ల గురించి అందరికీ తెలిసిందే. తెలుగమ్మాయే అయినా నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న అమ్మడు.. హిందీ సినిమాలు, వెబ్ సిరీసుల్లో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇటీవల అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్యను వివాహం చేసుకున్న తర్వాత కొద్ది కాలం గ్యాప్ తీసుకున్న ఆమె, ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అవుతున్నారు. ఇప్పుడు తన కెరీర్ ను తెలుగు, తమిళ సినిమాల వైపు మళ్లిస్తున్నట్టు తెలుస్తోంది.
మోడలింగ్ తో కెరీర్ మొదలుపెట్టిన శోభిత, ఆ తర్వాత హిందీ సినిమాలు, వెబ్ సిరీసులల్లో అవకాశాలు అందుకున్నారు. ముఖ్యంగా మేడ్ ఇన్ హెవెన్ సిరీస్ ఆమె కెరీర్ కు మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ సిరీస్ లో చేసిన పాత్రతో యూత్ లో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. తర్వాత ది నైట్ మేనేజర్ లో నటించి మరోసారి మెప్పించారు. ఇప్పటివరకు ఎక్కువగా హిందీ ఇండస్టీకి పరిమితమైన శోభిత, ఇప్పుడు దక్షిణాది సినిమాలపై దృష్టి పెట్టడం విశేషం.
మరికొద్ది రోజుల్లో తెలుగులో చీకట్లో అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవ్వనున్న ఆ సినిమా థ్రిల్లర్ జోనర్ లో రూపొందుతోంది. అందులో శోభిత ఓ విభిన్నమైన పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ అందుకుంది. ఆ సినిమాతో తెలుగులో మంచి ఫేమ్ రావాలని ఆమె ఆశిస్తున్నట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి.
అదే సమయంలో తమిళంలో కూడా ఆమెకు మంచి అవకాశం దక్కింది. ప్రముఖ దర్శకుడు పా రంజిత్ తెరకెక్కిస్తున్న ఓ కొత్త సినిమాలో శోభిత నటిస్తున్నట్టు సమాచారం. ఆ సినిమా కాస్త రఫ్ అండ్ రియలిస్టిక్ స్టైల్ లో తెరకెక్కుతుందట. పా రంజిత్ సినిమాలు సాధారణంగా బలమైన కథలు, సహజమైన పాత్రలతో ఉంటాయి. అలాంటి దర్శకుడి సినిమాలో అవకాశం రావడం శోభిత కెరీర్ కు మంచి టర్నింగ్ పాయింట్!
హిందీలో మంచి పేరు తెచ్చుకున్న తర్వాత, ఇప్పుడు తెలుగు, తమిళ మార్కెట్ లో కూడా తన స్థానం ఏర్పరచుకోవాలన్నది శోభిత టార్గెట్ గా కనిపిస్తోంది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, కథకు ప్రాధాన్యం ఉన్న పాత్రలనే ఆమె ఎంపిక చేసుకుంటున్నారని సమాచారం. ఓటీటీతో పాటు థియేటర్ సినిమాలను కూడా చేస్తూ ముందుకు సాగాలని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం దక్షిణాది సినిమాల్లో కంటెంట్ కు వాల్యూ పెరిగింది. కొత్త కథలు, విభిన్న పాత్రలకు మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో ఇప్పుడు తన కెరీర్ ను స్ట్రాంగ్ గా మార్చుకోవాలని శోభిత ట్రై చేస్తున్నట్లు సమాచారం. తెలుగు, తమిళంలో మంచి గుర్తింపు వస్తే.. ఆమెకు పాన్ ఇండియా స్థాయిలో మరిన్ని అవకాశాలు రావచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో శోభితా ధూళిపాళ్ల సౌత్ ప్రాజెక్టులతో ఎంత వరకు మెప్పిస్తారో వేచి చూడాలి.