రాజీ ప‌డి సినిమాల్లో కి న‌టి ఇష్టంతోకాదు!

Sneha Ullal Reveals Emotional Reason Behind Entering Films at 16

Update: 2026-05-23 10:30 GMT

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరసన `లక్కీ: నో టైమ్ ఫర్ లవ్` చిత్రంతో రాత్రికి రాత్రే దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న నటి స్నేహా ఉల్లాల్. అప్పట్లో ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్ బచ్చన్‌ను పోలి ఉండే ఆమె రూపం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే అంతటి భారీ గ్లామర్ ప్రపంచంలోకి ఆమె అడుగుపెట్టడం వెనుక ఉన్న కఠినమైన నిజాలను, భావోద్వేగపూరిత ప్రయాణాన్ని స్నేహ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. వెండితెరపై కనిపించినంత సులభంగా తన నిజజీవితం సాగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

పదో తరగతి పూర్తి చేసి కాలేజీలో అడుగుపెట్టిన 16 ఏళ్ల వయసులోనే స్నేహా ఉల్లాల్‌కు సల్మాన్ ఖాన్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. కానీ ఆ సమయంలో ఆమె నటనపై ఉన్న ఆసక్తితోనో లేదా గ్లామర్ ప్రపంచంపై ఉన్న మోజుతోనో చిత్ర పరిశ్రమలోకి రాలేదన్నారు. అప్పట్లో ఆమె తల్లి భయంకరమైన క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతోందని కుటుంబ ఆర్థిక, మానసిక పరిస్థితుల దృష్ట్యా తాను ఆ సినిమాను రాజీగా అంగీకరించాల్సి వచ్చిందని వెల్లడించారు. ఆ రోజుల్లో తమ ఇంట్లో ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులను స్నేహ గుర్తుచేసుకున్నారు.

తల్లి క్యాన్సర్ చికిత్స పొందుతున్నప్పుడు ఇంట్లోని వాతావరణం చాలా బాధాకరంగా నిరాశతో కూడుకుని ఉండేదని చెప్పారు. తన తల్లికి ప్రయాణాలు చేయడం అంటే ఎంతో ఇష్టమని ఈ సినిమా ఆఫర్ ఒప్పుకుంటే కుటుంబ సభ్యులందరి మనసులు ఆ బాధ నుండి మళ్లుతాయని అలాగే తల్లిని సంతోషంగా తిప్పొచ్చు అనే ఉద్దేశంతోనే తాను ఆ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. చిత్ర పరిశ్రమలో లభించిన స్టార్‌డమ్ తన జీవితంలో ఎన్నో త్యాగాలను డిమాండ్ చేసిందని స్నేహ పేర్కొన్నారు. ఆ సినిమా తనకు ఎంతో గుర్తింపును ఇచ్చినా? అదే సమయంలో తన వ్యక్తిగత స్వేచ్ఛను, కాలేజీ జీవితాన్ని లాగే సుకుందని ఆవేదన చెందారు.

కేవలం 16 ఏళ్ల వయసులోనే బాధ్యతగల పెద్ద మనిషిగా మారిపోవాల్సి వచ్చిందని తన టీనేజ్ రోజులను ఇరవైలలో ఉండే అమాయకమైన ఆనందాలను త్యాగం చేయాల్సి రావడం ఒక రకమైన రాజీ అని ఇప్పుడు గ్రహించా నన్నారు. అలాగే ఐశ్వర్యా రాయ్‌తో తనను పోల్చడంపై స్పందించారు. ఐశ్వర్య మిస్ వరల్డ్ అయినప్పటి నుంచే చుట్టుపక్కల వారు తాను ఆమెలా ఉంటానని అనేవారని స్నేహ గుర్తు చేసుకున్నారు. అయితే సినిమాలో అడుగుపెట్టినప్పుడు అదొక పీఆర్ స్ట్రాటజీగా మారిందని సల్మాన్ ఖాన్ సరసన నటించడం వల్ల అందరూ ఆ కోణంలోనే ఆలోచించడం మొదలుపెట్టారన్నారు.

అయినా ఆ సమయంలో వివాదాలు , పోలికలు తనను వ్యక్తిగతంగా ఏమాత్రం ఇబ్బంది పెట్ట‌లేద‌న్నారు. తానెప్పుడు గ్లామర్ వైపు ఆకర్షితురాలిని కాలేదని స్వభావరీత్యా చాలా సింపుల్‌గా ఉండే వ్యక్తినని తెలిపారు. చలనచిత్ర పరిశ్రమ చాలా భయానకమైనదని తన కుటుంబ సభ్యులు భావించడం వల్లే తాము మొదటి నుండి సినీ రంగానికి దూరంగా ఉండాలని అనుకున్నట్లు చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News