రెండు కోట్ల హీరో..నేడు వందల కోట్లకు!
| 2002లో ‘ఈశ్వర్’ సినిమాతో హీరోగా పరిచయమైన ప్రభాస్ తొలి చిత్ర బడ్జెట్ రూ.2 కోట్లు. అక్కడి నుంచి ‘బాహుబలి’తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ఆయన సినిమాల బడ్జెట్లు భారీగా పెరిగాయి. ప్రస్తుతం ‘స్పిరిట్’ రూ.300 కోట్లకు పైగా, ‘ఫౌజీ’ రూ.600 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కుతున్నట్లు సమాచారం.
పాన్ ఇండియా స్థాయిలో వందల కోట్ల బడ్జెట్ సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ప్రభాస్ ప్రస్థానం చూస్తే ఆరంభంలో ఆయన చేసిన సినిమా బడ్జెట్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యం పోవాల్సిందే. నేడు 270 కోట్లకు పైగా బడ్జెట్ ఉన్న భారీ చిత్రాలతో దూసుకుపోతున్న రెబల్ స్టార్ కెరీర్ తొలినాళ్లలో 2 కోట్ల బడ్జెట్ సినిమాలో నటించారు. ఆ చిన్న అడుగుతో మొదలైన ప్రయాణం నేడు దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమ లెక్కలనే మార్చే స్థాయికి చేరుకుంది.
2002లో రిలీజ్ అయిన `ఈశ్వర్` చిత్రంతో ప్రభాస్ హీరోగా పరిచయమయ్యారు. జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ డ్రామాను రెండు కోట్ల బడ్జెట్‌తో నిర్మించినట్లు సమాచారం. ఇందులో ప్రభాస్ సరసన శ్రీదేవి విజయకుమార్ నటించారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపకపోయినా? ప్రభాస్‌కు మాత్రం టాలీవుడ్‌లో తొలి అడుగు వేసే అవకాశాన్ని ఇచ్చింది.
ఆ తర్వాత కాలక్రమంలో ప్రభాస్ సినిమాల బడ్జెట్లు కూడా క్రమంగా పెరుగుతూ వచ్చాయి. రెండో సినిమా `రాఘవేంద్ర` 4 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కగా.. 2006లో ప్రభుదేవా దర్శకత్వంలో రిలీజ్ అయిన `పౌర్ణమి`తో ఆయన కెరీర్ మరో మలుపు తిరిగింది. 2010లో వచ్చిన `డార్లింగ్` చిత్రాన్ని 15 కోట్ల బడ్జెట్‌తో నిర్మించగా ఆ సినిమాతో ప్రభాస్‌కు సినిమా టైటిలే ముద్దుపేరుగా మారిపోయింది. ఇక 2012లో రిలీజ్ అయిన `రెబల్` సినిమా 40 కోట్ల బడ్జెట్‌తో రూపొందగా ఆ చిత్రం ప్రభాస్ మాస్ ఇమేజ్‌కు మరింత బలాన్ని చేకూర్చింది.
ప్రభాస్ కెరీర్‌నే సమూలంగా మార్చేసిన ప్రాజెక్ట్ మాత్రం రాజమౌళి తెరకెక్కించిన `బాహుబలి` సిరీస్. మొదటి భాగం సుమారు 180 కోట్లతో.. రెండో భాగం 250 కోట్ల బడ్జెట్‌తో రూపొందాయి. ప్రపంచవ్యాప్తంగా మొదటి భాగం 650 కోట్లకు పైగా ..`బాహుబలి 2`1788 కోట్ల వసూళ్లు సాధించి రికార్డులు తిరగరాశాయి. దీంతో ప్రభాస్ తెలుగు హీరోగానే కాకుండా పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగి ప్రాజెక్టుల స్థాయిని కొత్త పుంతలు తొక్కించారు.
`బాహుబలి` తర్వాత ప్రభాస్ చేసిన సినిమాల బడ్జెట్లు ఊహకందని స్థాయికి చేరాయి. `సాహో` 350 కోట్లకు పైగా, `రాధే శ్యామ్` 300 కోట్లు, `ఆదిపురుష్` 500 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కాయి. వీటితో పాటు `సలార్: పార్ట్ 1` 270 కోట్లతో, `కల్కి 2898 ఏడీ` 600 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమయ్యాయి. `ది రాజా సాబ్` చిత్రానికి భారీగానే బడ్జెట్‌తో ఖర్చు చేసారు.
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న ప్రాజెక్టుల బడ్జెట్లు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `స్పిరిట్` 300 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కుతుండగా పీరియడ్ యాక్షన్ డ్రామా `ఫౌజీ` 600 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతోంది. రెండు కోట్ల నుంచి మొదలైన ప్రయాణం నేడు భారతీయ సినిమాలో అత్యధిక బడ్జెట్ ప్రాజెక్టులకు కేరాఫ్ అడ్రస్‌గా డార్లింగ్ నిలవడం విశేషం.