నెట్‌ఫ్లిక్స్‌లో మెగాస్టార్ కొత్త అడ్డా.. 'మెగావర్స్' ప్రోమోతో అసలు విషయం చెప్పేసిన చిరంజీవి!
| చిరంజీవి హోస్ట్‌గా రాబోతున్న నెట్‌ఫ్లిక్స్ టాక్ షో ‘మెగావర్స్’ ప్రోమో వైరల్ అవుతోంది. హైదరాబాద్ హోర్డింగ్స్‌లో ఆయన పేరులో మిస్సైన ‘N’ అంటే నెట్‌ఫ్లిక్స్ అని ప్రోమోలో వెల్లడించారు. చివర్లో మెగాస్టార్ చెప్పిన ‘ఇది నా అడ్డా’ డైలాగ్ ఆకట్టుకుంటోంది. షో విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు.
మెగాస్టార్ చిరంజీవి తొలిసారి ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెడుతుండటంతో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఆయన హోస్ట్‌గా వ్యవహరించనున్న టాక్ షో మెగావర్స్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ షోను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభమైంది. కొన్ని ఎపిసోడ్ల చిత్రీకరణ కూడా పూర్తయింది. తాజాగా ఈరోజు నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసిన కొత్త ప్రోమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చిరంజీవి సినిమాల్లోనే కాకుండా బుల్లితెరపై కూడా తనదైన ముద్ర వేయగలరని అభిమానులు భావిస్తున్నారు. అందుకే మెగావర్స్ ప్రకటన వచ్చినప్పటి నుంచి ఈ షోపై తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనాలు. అయితే ఈ కార్యక్రమం గురించి ఆసక్తిని మరింత పెంచేలా నెట్‌ఫ్లిక్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రచార హోర్డింగ్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి.
ఆ హోర్డింగ్స్‌లో చిరంజీవి పేరులో ఒక అక్షరం కనిపించకుండా ఉండటం..ఆయన పేరులోని 'N' అక్షరం మిస్ కావడంతో అసలు దాని వెనుక కారణం ఏమిటని అభిమానులు ఆలోచించారు. సోషల్ మీడియాలో కూడా దీనిపై అనేక పోస్టులు కనిపించాయి.
తాజాగా విడుదల చేసిన ప్రోమోతో ఈ సస్పెన్స్‌కు తెరపడింది. చిరంజీవి స్వయంగా కనిపిస్తూ మిస్ అయిన 'N' అక్షరం వెనుక ఉన్న అసలు విషయాన్ని వెల్లడించారు. ఆ 'N' అంటే నెట్‌ఫ్లిక్స్ అని ప్రోమో ద్వారా స్పష్టం చేశారు. ఇక చివర్లో చిరంజీవి చెప్పిన "ఇది నా అడ్డా" అనే డైలాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మెగాస్టార్ నెట్‌ఫ్లిక్స్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్న విషయాన్ని సరదాగా, ఆసక్తికరంగా చూపించారు.
ఈ ప్రోమోతో మెగావర్స్పై అంచనాలు మరింత పెరిగాయి. నెట్‌ఫ్లిక్స్ తన సోషల్ మీడియా పోస్టులో 'మెగా నోస్టాల్జియా, మెగా నవ్వులు, మెగా ముచ్చట్లు' అంటూ ఈ షోపై మరింత ఆసక్తిని పెంచింది. అయితే ఇంత హడావుడి చేస్తున్న నెట్‌ఫ్లిక్స్ ఇప్పటివరకు మెగావర్స్ విడుదల తేదీని మాత్రం ప్రకటించలేదు. త్వరలోనే స్ట్రీమింగ్ డేట్ వెల్లడించే అవకాశం ఉందని అభిమానులు ఎదురుచూస్తున్నారు.