అందం పుట్టుకతో వచ్చేదా? తయారు చేసుకునేదా?
| తన అందం గురించి తరచూ ప్రశంసలు అందుకునే తమన్నా, తాజాగా సద్గురు జగ్గీ వాసుదేవ్‌ను ఆసక్తికర ప్రశ్న అడిగారు. జీవిత చరమాంకంలో మన రూపం ఎలా ఉంటుందనేది జన్యుపరంగా వస్తుందా? మనమే సృష్టించుకుంటామా? అని ప్రశ్నించారు. ఆనందంతో వెలిగిపోయే ముఖమే అసలైన అందమని సద్గురు సమాధానమిచ్చారు. ఆయన చమత్కారానికి తమన్నా ఇచ్చిన స్పందనతో అక్కడ నవ్వులు విరిశాయి.
మిల్కీబ్యూటీ తమన్నా అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమన్నా బ్యటీకి ఫిదా కానిదెవరు? వయసు జస్ట్ నెంబర్ మాత్రమే అంటూ ఇప్పటికీ అదే బ్యూటీతో చక్రం తిప్పుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా అందానికి అసలైన అర్థం ఏంటనే సందేహం కలిగిందేమో! ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్‌తో జరిగిన ప్రత్యేక సంభాషణలో తమన్నా మనసులోని సందేహాన్ని వ్యక్తం చేశారు. బయట తనను కలిసిన వాళ్లంతా మీరు చాలా అందంగా ఉన్నారని చెబుతుంటారని.. అసలు జీవిత చరమాంకానికి చేరుకునే సమయానికి మన రూపం ఎలా ఉంటుందనేది పుట్టుకతో వచ్చేదా లేక మనం సృష్టించుకునేదా? అని అడిగారు.
తమన్నా ప్రశ్నకు సద్గురు ఆలోచింపజేసే సమాధానం ఇచ్చారు. ముక్కు.. గడ్డం వంటి శారీరక ఆకృతులకు సంబంధించిన జన్యుపరమైన అంశాలు కొంతవరకు మాత్రమే ప్రభావం చూపుతాయని మిగిలినదంతా ఒక వ్యక్తి తనను తాను ఎలా మలుచుకుంటాడనే దానిపైనే ఆధారపడి ఉంటుందని వివరించారు. ముఖ కవళికలు ఎలా ఉన్నా? ఆనందంతో వెలిగిపోయే ముఖం ఎప్పుడూ అందంగానే కనిపిస్తుందన్నారు. తన పొడవాటి గడ్డాన్ని చూపిస్తూ `నేను కూడా వీటన్నింటితోనే మేనేజ్ చేస్తున్నాను కదా` అని చమత్కరించగా తమన్నా మాత్రం మీరు కూడా చాలా అందంగా ఉంటారనడంతో అంతా ఒక్కసారిగా నవ్వేసారు.
నిజానికి అందం..రంగు విషయంలో తమన్నాకు ప్రశంసలతో పాటు కొన్నిసార్లు అసభ్యకరమైన వ్యాఖ్యలు కూడా ఎదురయ్యాయి. గత ఏడాది `ఓదెల 2` ప్రమోషన్ల సమయంలో మిల్కీ బ్యూటీ అనే ట్యాగ్ గురించి ఓ విలేకరి అడిగినప్పుడు ధీటుగా స్పందించారు. మిల్కీ బ్యూటీ అంటే శివశక్తి పాత్ర చేయలేదా అని ఎదురుప్రశ్నిస్తూ స్త్రీల గ్లామర్‌ను గౌరవించాలని..మనం మనల్ని తక్కువ చేసుకుంటే ఎవరూ గౌరవించరని కౌంటర్ ఇచ్చారు.
అలాగే అందంగా ఉండటం వల్ల నటిగా అవకాశాలు తగ్గాయా? అన్న ప్రశ్నపైనా తమన్నా గతంలో స్పందించారు. అందంగా ఉన్నాను కాబట్టే అవకాశాలు రావడం లేదని బాధితురాలిలా చెప్పుకోవడం తనకు అస్సలు ఇష్టం ఉండదని వినడానికి కూడా వింతగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇక సినిమాల విషయానికొస్తే ఇటీవల `ది వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్` చిత్రంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బ్యూటీ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులున్నాయి. `రాగిణి 3`, `రేంజర్స్`, `పురుషన్`, `ఐపీఎస్ మరియా` చిత్రాలతో పాటు `వి. శాంతారామ్ ప్రాజెక్ట్‌లతోనూ బిజీగా ఉన్నారు.