'ఆపరేషన్ సింధూర్' సమయంలో భారతదేశానికి తెలియని భయంకర నిజం!
| ఆపరేషన్ సింధూర్ సమయంలో చైనాకు చెందిన నింగ్‌జియా-14, గావోఫెన్-11, యావోగాన్-30 ఉపగ్రహాలు గుజరాత్‌లోని భుజ్, నలియా, జామ్‌నగర్ ప్రాంతాలపై నిఘా ఉంచినట్లు దిగంతర సంస్థ విశ్లేషణ వెల్లడించింది. ఎయిర్‌బేస్‌లు, నౌకాదళ స్థావరాలు, జామ్‌నగర్ రిఫైనరీ కార్యకలాపాలను కూడా గమనించినట్లు కథనాలు పేర్కొంటున్నాయి. ఈ సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేసే అవకాశం ఉందన్న రక్షణ రంగ నిపుణుల ఆందోళనతో చైనా అంతరిక్ష నిఘా సామర్థ్యాలపై చర్చ మొదలైంది.
ముష్కర తీవ్రవాదుల ఏరివేతలో భాగంగా గత ఏడాది భారత్ చేపట్టిన `ఆపరేషన్ సింధూర్` పాకిస్తాన్ గుండెల్లో ఎలాంటి గుబులు పుట్టించిందో తెలిసిందే. ముఖ్యంగా తీవ్రవాదుల ఆయువుపట్టుపై కొట్టిన దెబ్బకు పోయినవాళ్లు పోగా, మిగిలిపోయిన వారంతా భారత ఆర్మీపై రగులిపోతున్నారు. అదంతా అటుంచితే ఆపరేషన్ సింధూర్ లో ఇప్పుడు మరో కొత్త కోణం బయటపడింది. ఇది నిజంగా షాకింగ్ ట్రూత్. భారతదేశంలో ఉన్న ఆర్మీ - నేవీ-ఎయిర్ ఫోర్స్ కి చెందిన యాక్టివిటీస్ ని శత్రుదేశం చైనాకు చెందిన ఉపగ్రహాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయనేది బాంబ్ లా విస్పోటనం చెందే వార్త. మన యుద్ధ విమానాలు.. రన్ వేపై ఉన్న నౌకల సైజును కూడా ఇవి కనిపెట్టేస్తాయి.
ఆపరేషన్ సంధూర్ సమయంలో చైనాకు చెందిన నిఘా ఉపగ్రహాలు గుజరాత్ తీర ప్రాంతంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు జాతీయ మీడియాలో తాజాగా సంచలన కథనం వెలుగులోకి వచ్చింది. బెంగళూరుకు చెందిన అంతరిక్ష నిఘా సంస్థ `దిగంతర` విశ్లేషణ ఆధారంగా ఈ నిజం బయటకు తెలిసింది. నాలుగు రోజుల పాటు సాగిన ఈ ఆపరేషన్ సమయంలో ముఖ్యంగా 2025 మే 10 , 11 తేదీలలో చైనాకు చెందిన నింగ్‌జియా-14, గావోఫెన్-11, యావోగాన్-30 అనే మూడు ఉపగ్రహాలు గుజరాత్‌లోని భుజ్, నలియా, జామ్‌నగర్ ప్రాంతాలపై నిరంతరం నిఘా ఉంచాయి. అంతకుముందు ఏప్రిల్ 22న పహల్గామ్‌లో 26 మంది పౌరులను బలిగొన్న ఉగ్రదాడికి ఆరు రోజుల ముందు కూడా ఒక చైనా ఉపగ్రహం ఆ ప్రాంతంపై తన సంచారాన్ని రెట్టింపు చేసినట్టు `దిగంతర` నిఘా సంస్థ విశ్లేషణ వెల్లడిస్తోంది.
ఆపరేషన్ సింధూర్ సమయంలో ప్రధానంగా జమ్మూ కాశ్మీర్, పంజాబ్ సరిహద్దుల్లోనే భూతల పోరాటం జరిగినా.. అరేబియా సముద్రానికి ఆనుకుని పాకిస్థాన్‌కు అత్యంత సమీపంలో ఉన్న గుజరాత్ తీరం వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైనది. మే 7 నుంచి 10 మధ్య గుజరాత్‌లోనూ డ్రోన్ల కదలికలు- బ్లాక్అవుట్‌లు- ఎయిర్ రైడ్ అలర్ట్‌లు నమోదయ్యాయి. పాకిస్థాన్ డ్రోన్లు- క్షిపణులతో సిద్ధంగా ఉండగా.. వాటి టార్గెట్ అయిన భుజ్ ఎయిర్‌ఫోర్స్ బేస్... కచ్‌లోని నలియా ఫార్వర్డ్ ఎయిర్‌బేస్... నౌకాదళ స్థావరాలైన ఐఎన్ఎస్ సర్దార్ పటేల్, ఐఎన్ఎస్ ద్వారకలతో పాటు దేశంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారమైన రిలయన్స్ జామ్‌నగర్ రిఫైనరీ, పోర్టు కార్యకలాపాలను ఈ చైనా ఉపగ్రహాలు నిశితంగా గమనించాయి.
అంతరిక్షం నుంచి శత్రు దేశాలు సాగిస్తున్న ఈ నిఘా కార్యకలాపాలు ఎంత పక్కాగా జరిగాయో `దిగంతర` నివేదిక స్పష్టం చేసింది. ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైన మే 7వ తేదీనే `యావోగాన్-43 01G` అనే మరో చైనా ఉపగ్రహం తన కక్ష్యను మార్చుకుని భారత సైనిక స్థావరాలపై ఎక్కువ సమయం సంచరించేలా సర్దుబాటు చేసుకుంది. యుద్ధ సమయాల్లో ఉపగ్రహాల కక్ష్యలను మార్చుకుంటూ.. కీలక ప్రాంతాలపై ఎలక్ట్రానిక్ నిఘాను (ఐ.ఎస్.ఆర్) కేంద్రీకరించే సామర్థ్యం చైనాకు ఉండటం భారత రక్షణ వ్యవస్థకు ఒక పెద్ద సవాలుగా పరిణమించిందని ఈ రిపోర్ట్ పేర్కొంది.
ఈ మూడు చైనా ఉపగ్రహాలు అత్యంత అధునాతన సాంకేతికతతో కూడినవి కావడం గమనార్హం. నింగ్‌జియా-14 ఉపగ్రహం యుద్ధనౌకలు.. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు.. సైనిక కమ్యూనికేషన్ల నుంచి వెలువడే రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్‌ను పసిగట్టి.. సైనిక కదలికలను గుర్తించగలదు. ఇక గావోఫెన్-11 ఉపగ్రహం 0.8 మీటర్ల హై-రిజల్యూషన్ కెమెరాలతో విమానాశ్రయాల్లో నిలిపి ఉంచిన యుద్ధ విమానాలు.. పోర్టులలో ఉన్న నౌకల పరిమాణం .. రన్‌వే మార్పులను అత్యంత స్పష్టంగా ఫోటోలు తీయగలదు. అలాగే భూమికి 600 కిలోమీటర్ల ఎత్తులో ఉండే యావోగాన్-30 శ్రేణి ఉపగ్రహాలు నిరంతరం రాడార్ సిగ్నల్స్‌ను అడ్డుకుని సమాచారాన్ని సేకరిస్తాయి.
యుద్ధం ఒక ప్రాంతంలో జరుగుతున్నా.. ఇతర వ్యూహాత్మక ప్రాంతాల్లోని నౌకాదళ, వైమానిక కదలికల సమాచారాన్ని చైనా ఈ ఉపగ్రహాల ద్వారా సేకరించి పాకిస్థాన్‌కు చేరవేసే ప్రమాదం ఉందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఒక్క స్పష్టమైన ఉపగ్రహ చిత్రం ద్వారా సముద్రంలో యుద్ధనౌకల కదలికలను సులభంగా అంచనా వేయవచ్చని రిటైర్డ్ గ్రూప్ కెప్టెన్ అజయ్ లేలే అభిప్రాయపడ్డారు. ఇటీవల అమెరికా ఆర్థిక, భద్రతా సమీక్షా కమిషన్ కూడా ఈ గావోఫెన్, యావోగాన్ ఉపగ్రహాల నిఘా సామర్థ్యాలు తమకు కూడా ముప్పుగా మారాయని ఆందోళన వ్యక్తం చేయడం ఈ అంశం తీవ్రతకు అద్దం పడుతోంది.