విజయ్‌కి శ్రుతి హాసన్ పంచ్?

ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ‘తమిళ వెట్రి కళగం’ అనే కొత్త పార్టీ పెట్టి రాజకీయాల్లోకి అరంగేట్రం చేశాడు తమిళ టాప్ స్టార్ విజయ్.;

Update: 2025-10-08 14:59 GMT

ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ‘తమిళ వెట్రి కళగం’ అనే కొత్త పార్టీ పెట్టి రాజకీయాల్లోకి అరంగేట్రం చేశాడు తమిళ టాప్ స్టార్ విజయ్. కానీ ఆయనకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఉత్సాహంగా రాజకీయ సభలు, ర్యాలీలు నిర్వహిస్తున్న వేళ.. కరూర్ అనే ప్రాంతంలో ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుని నలభై మంది దాకా ప్రాణాలు కోల్పోవడంతో విజయ్ తీవ్ర ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నాడు. ఈ విషయంలో విజయ్‌నే కొంతమంది తప్పుబడుతుండగా.. ఇందులో ప్రభుత్వ వైఫల్యం, కుట్ర కోణం గురించి కూడా రకరకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీ జనాల్లో అయితే ఎక్కువమంది విజయ్‌కి అనుకూలంగానే ఉన్నారు. ఇలాంటి టైంలో లోకనాయకుడు కమల్ హాసన్ తనయురాలు, హీరోయిన్ శ్రుతి హాసన్.. పెట్టిన ఇన్‌స్టా పోస్టు చర్చనీయాంశంగా మారింది.

రక్తం పులుముకుని ఉన్న తెర మీద ‘‘ఒక జోకర్‌ జోకర్ లాగే ప్రవర్తించినపుడు అతణ్ని నిందించకండి. సర్కస్‌కు వెళ్లినందుకు మిమ్మల్ని మీరు నిందించుకోండి’’ అని రాసి ఉన్న కొటేషన్‌ను శ్రుతి తాజాగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్టు చేసింది. అంతే కాక ‘‘నిజమైన పదాలు ఎప్పుడూ బయటికి మాట్లాడం’ అనే కామెంట్‌ను కూడా అందులో జోడించింది. శ్రుతి ఏ ఉద్దేశంతో ఈ పోస్టు పెట్టిందో కానీ.. దీన్ని విజయ్‌కి రిలేట్ చేసి కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. విజయ్‌ని జోకర్ అని శ్రుతి అభివర్ణించిందని.. అతడి సభను సర్కస్‌గా పేర్కొందని.. ఆ సభకు వెళ్లడమే జనం తప్పు అన్నది ఆమె ఉద్దేశమని నెటిజన్లు సూత్రీకరిస్తున్నారు. ఐతే శ్రుతి మామూలుగా అంత హార్ష్ కామెంట్స్ చేసే రకం కాదు. వివాదాల జోలికి వెళ్లదు. తన తండ్రి కమల్ హాసన్ రాజకీయాల్లో ఉన్నా లేనట్లు ఉన్నారు. ఐతే ఆయన ప్రస్తుతం అధికారంలోకి ఉన్న డీఎంకేకు మద్దతుగా నిలుస్తుండడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న విజయ్‌కి శ్రుతి కౌంటర్ ఇచ్చిందేమో అనే జనాలు అర్థం చేసుకుంటున్నారు. కానీ ఇందులో ఎంత వరకు నిజం ఉందో శ్రుతికే తెలియాలి. ఈ పోస్టు వివాదాస్పదం అయిన నేపథ్యంలో ఆమె వివరణ ఇస్తుందేమో చూడాలి.

Tags:    

Similar News