వారియర్ గా మారిన శ్రియా రెడ్డి.. 'మహాకాళి' గెటప్ వెనుక ఇంత కష్టమా?
విలక్షణమైన నటిగా చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది శ్రియా రెడ్డి.
విలక్షణమైన నటిగా చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది శ్రియా రెడ్డి. భారత మాజీ టెస్ట్ క్రికెటర్ భరత్ రెడ్డి కుమార్తె అయిన ఈమె తెలుగు, తమిళ్, మలయాళం చిత్రాలలో నటిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. విభిన్నమైన పాత్రలు, ప్రతినాయిక పాత్రలతో అందరి దృష్టిని ఆకట్టుకుంటూ హీరోలను మించి నటిస్తూ ఊహించని పాపులారిటీ అందుకున్న ఈమె.. ప్రత్యేకించి కొన్ని పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది.
ప్రస్తుతం ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా మహాకాళి సినిమాలో అమ్మవారి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల చేసిన ప్రచార చిత్రాలు, గ్లింప్స్ లో ఈమె ఉగ్రరూపం చూసి ఆడియన్స్ సైతం భయపడిపోయారు. అంతలా తన రౌద్రంతో అందరి దృష్టిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తన పాత్ర కోసం ఆమె సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకున్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. మహాకాళి పాత్ర వెనుక ఆమె పడుతున్న కష్టం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
తాజాగా కత్తి సాము నేర్చుకుంటున్న కొన్ని ఫోటోలను షేర్ చేసింది శ్రియా రెడ్డి. ఈ ఫోటోలకు క్యాప్షన్ గా.. కాళీ యొక్క ప్రచండమైన అదుపు లేని శక్తిని ఆవాహన చేసుకోవడం, ఆమె శక్తిని ఎరిగి, ఆమె బలాన్ని సొంతం చేసుకున్నప్పటికీ.. దేనికి భయపడని గుణం నాలో ఒక భాగం అయిపోయింది. కోపానికి కాదు.. దురాక్రమానికి కాదు.. కేవలం పరివర్తనకు మాత్రమే.. అంతరంగంలో మేల్కొన్న యోధురాలు.. అంతరంగంలో విముక్తి పొందిన ఒక స్త్రీ .. అంతరంగంలోని కాళీమాతను ఇప్పుడు తెరపై చూడబోతున్నారు అంటూ క్యాప్షన్ జోడించింది. మొత్తానికి అయితే కత్తి సాము కోసం ఆమె పడుతున్న కష్టం, బల్లలు , ఈటెలు చేతపట్టి ఆమె ఇస్తున్న ప్రదర్శన సినిమాపై మరింత అంచనాలను పెంచేస్తోంది.
శ్రియా రెడ్డి కెరియర్ విషయానికొస్తే.. 2002లో తమిళం చిత్రమైన సమురాయ్ అనే చిత్రం ద్వారా నిషా పాత్రతో ఆడియన్స్ ఆకట్టుకున్న శ్రియా రెడ్డి.. 2003లో అప్పుడప్పుడు అనే చిత్రంలో రాధిక పాత్రతో అలరించింది. తెలుగు, తమిళ్, మలయాళం అంటూ సౌత్ ఇండియా భాషలకే పరిమితం కాకుండా ఇంగ్లీష్ చిత్రాలలో కూడా నటిస్తూ మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. తెలుగులో సలార్ పార్ట్ వన్ , ఓజీ వంటి చిత్రాలతో ఆకట్టుకున్న శ్రియా రెడ్డి ప్రస్తుతం మహాకాళి సినిమాలో అమ్మవారు కాళీ పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా ఈమెకు మరింత విజయాన్ని అందించే అవకాశం ఉందని చెప్పవచ్చు.