దాసరి.. RGV.. పూరి.. వంగా..

నిజానికి దర్శకుడికి ఇలా అభిమాన వర్గం ఉండటం తెలుగు సినిమాకు కొత్త కాదు. దాసరి నారాయణరావు కాలంలోనే దర్శకుడి పేరుతో అభిమాన సంఘాలు ఉండేవి.

Update: 2026-09-05 03:53 GMT

సినిమాలో హీరో క్యారెక్టర్ ఎంత గట్టిగా ఉంటుందో, బయట సందీప్ రెడ్డి వంగా కూడా దాదాపు అదే టోన్‌లో కనిపిస్తాడు. ఇంటర్వ్యూలో అయినా, విమర్శలకు సమాధానం చెప్పేటప్పుడు అయినా మాట వెనక్కి తీసుకునే రకం కాదు. అర్జున్ రెడ్డి, యానిమల్ తరువాత అతని సినిమాలకే కాదు, వంగా ఏం మాట్లాడతాడన్నదాని కోసం కూడా ఎదురుచూసే క్రేజ్ వచ్చింది. ఇప్పుడు ప్రభాస్ ‘స్పిరిట్’ చేస్తున్న టైమ్‌లో ఆ మాస్ ఆరా ఇంకాస్త ఎక్కువగా కనిపిస్తోంది.

నిజానికి దర్శకుడికి ఇలా అభిమాన వర్గం ఉండటం తెలుగు సినిమాకు కొత్త కాదు. దాసరి నారాయణరావు కాలంలోనే దర్శకుడి పేరుతో అభిమాన సంఘాలు ఉండేవి. హీరో పేరు కాకుండా దర్శకుడి పేరు కూడా పోస్టర్‌పై బలంగా పనిచేసిన రోజులు అవి. దాసరి సినిమాల్లో సామాజిక అంశాలు ఒక వైపు ఉంటే, బయట ఆయన మాట్లాడే తీరు మరో వైపు ఉండేది. దర్శకుడు కూడా జనాల్లో స్టార్ ఇమేజ్ తెచ్చుకోవచ్చని అప్పుడే కనిపించింది.

ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ దగ్గర అది మరో రకంగా మారింది. ‘శివ’ తర్వాత వర్మ సినిమా అంటేనే కొత్తదనం కోసం చూసే వర్గం తయారైంది. కానీ ఆయన క్రేజ్ సినిమాలతో మాత్రమే ఆగలేదు. ఇంటర్వ్యూల్లో చెప్పే మాటలు, ఎవరి గురించి అయినా డైరెక్ట్ గా స్పందించే తీరు వర్మకు బయట కూడా వేరే క్యారెక్టర్ ఇచ్చాయి. ఒక దశలో సినిమా లేకపోయినా ఆర్జీవీ ఇంటర్వ్యూ వస్తే చాలు చూసే బ్యాచ్ ఉండేది.

పూరి జగన్నాథ్ దగ్గర కూడా ఇదే మాస్ కనెక్షన్ కనిపించింది. పోకిరి, బిజినెస్‌మ్యాన్ లాంటి సినిమాల్లో హీరోలకు ఇచ్చిన యాటిట్యూడ్ పూరి రైటింగ్‌కు గుర్తింపైంది. బయట పూరి మాట్లాడే విధానం కూడా సింపుల్‌గా, డైరెక్ట్ ఎటాక్ లా ఉంటుంది. తర్వాత ‘పూరి మ్యూజింగ్స్’తో సినిమాలకు సంబంధం లేని విషయాలు చెప్పినా వినే వర్గం ఏర్పడింది. ఇప్పటికీ ఆ మ్యూజింగ్స్‌కు ఫాలోయింగ్ ఉంది.

రాజమౌళి, సుకుమార్ లాంటి దర్శకులకు కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వాళ్ల పేరు ఉంటే సినిమాపై అంచనాలు వేరుగా ఉంటాయి. కానీ బయట వాళ్లు ఎక్కువగా సౌమ్యంగానే కనిపిస్తారు. ఆర్జీవీ, పూరి, వంగా దగ్గర మాత్రం వాళ్ల వ్యక్తిత్వమే ఫాలోయింగ్‌లో భాగమైంది. సినిమా ఎలా తీస్తారన్నదే కాదు, వాళ్లు ఎలా మాట్లాడతారు, ఎలా స్పందిస్తారు అన్నది కూడా అభిమానులకు కనెక్ట్ అయ్యింది.

ఇప్పుడు ఆ లైన్‌లో వంగా లేటెస్ట్ పేరు. ‘యానిమల్’ తర్వాత హిందీలోనూ ఆయన పేరు బాగా వైరల్ అయ్యింది . పైగా తన సినిమాపై విమర్శ వచ్చినా ఓపెన్‌గా సమాధానం చెప్పడం అతని ఇమేజ్‌లో భాగమైపోయింది. ఇప్పుడు ‘స్పిరిట్’లో ప్రభాస్‌ను వంగా ఎలా చూపిస్తాడన్న క్యూరియాసిటీ గట్టిగానే ఉంది. అలాగే సినిమా గురించి వంగా ఎప్పుడు ఏం మాట్లాడతాడన్న దాని కోసం కూడా వంగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News