బేబీ నీడలో పడకుండా తప్పించుకున్న తెలివైన డెబ్యూటెంట్!
అయితే ఆదిత్యకు ఇక్కడ ‘90స్ ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’ రూపంలో ముందే ఒక దారి ఉంది. ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్’ పూర్తిగా కొత్త కథ కాదు.
‘బేబీ’తో వంద కోట్ల సినిమా ఇచ్చిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మళ్లీ కలిసి వస్తున్నారంటే పోలికలు అక్కడి నుంచే మొదలవుతాయి. ఆ సినిమాలో ఇద్దరి క్యారెక్టర్లు, ప్రేమ, గొడవలు, చివర్లో వచ్చే పెయిన్ ప్రేక్షకుల్లో అంతగా గుర్తుండిపోయాయి. అలాంటి జోడీని తన తొలి సినిమాలో తీసుకున్న ఆదిత్య హాసన్‌కు మొదటి నుంచి ఒక చిన్న సమస్య ఉంది. మళ్లీ అదే ఫీల్ ఇస్తే ‘బేబీ’తో పోలిక తప్పదు. మరీ దూరంగా వెళితే ఈ పెయిర్ వల్ల వచ్చిన ప్లస్ పూర్తిగా వాడుకున్నట్టు ఉండదు.
అయితే ఆదిత్యకు ఇక్కడ ‘90స్ ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’ రూపంలో ముందే ఒక దారి ఉంది. ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్’ పూర్తిగా కొత్త కథ కాదు. ‘90స్’లో చిన్న పిల్లాడిగా కనిపించిన ఆదిత్య పెద్దవాడైన తర్వాత జరిగే కథ. ఆ క్యారెక్టర్‌ను ఆనంద్ దేవరకొండ చేస్తున్నాడు. శివాజీ, వాసుకి కూడా తల్లిదండ్రులుగా కొనసాగుతున్నారు. అంటే ‘బేబీ’ జోడీని తీసుకున్నా, ఆదిత్య కథ మాత్రం తన సొంత ప్రపంచం నుంచే మొదలైంది.
ఆనంద్ క్యారెక్టర్ విషయంలో కూడా ఇదే తేడా కనిపిస్తోంది. ‘బేబీ’లో ప్రేమలో పూర్తిగా చిక్కుకుపోయిన యువకుడిగా కనిపించాడు. ఇక్కడ మధ్యతరగతి కుటుంబం నుంచి లండన్ వెళ్లిన స్టూడెంట్. కొత్త దేశం, కాలేజ్, ప్రేమ చుట్టూ కథ నడుస్తోంది. ట్రైలర్‌లో కూడా హెవీ డ్రామా కంటే కామెడీ, రొమాన్స్‌కు ఎక్కువ స్పేస్ కనిపించింది.
వైష్ణవి చైతన్యకు కూడా ‘బేబీ’ తర్వాత ఇదే మొదటి పెద్ద మార్పు. అక్కడ ఆమె క్యారెక్టర్ చుట్టూనే కథలో ఎక్కువ సంఘర్షణ నడిచింది. ‘ఎపిక్’లో మాత్రం పూర్తిగా మరో టోన్‌లో కనిపిస్తోంది. ఇద్దరూ మళ్లీ జంటగా ఉన్నా, వాళ్ల మధ్య కెమిస్ట్రీని అదే సినిమాకు కొనసాగింపులా చూపించకుండా ఆదిత్య ముందే జాగ్రత్తపడ్డట్టు ప్రమోషనల్ కంటెంట్‌లో తెలుస్తోంది.
పైగా ఆదిత్యకు ఇది దర్శకుడిగా తొలి ఫీచర్ ఫిల్మ్. ‘90స్’తో వెబ్ సిరీస్‌లో పేరు తెచ్చుకున్నాడు. మధ్యలో సాయి మార్తాండ్ తెరకెక్కించిన ‘లిటిల్ హార్ట్స్’కు నిర్మాతగా ఉండి థియేటర్ రిజల్ట్ కూడా చూశాడు. ఇప్పుడు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో తన కథను పెద్ద తెరకు తీసుకొస్తున్నాడు. మొదటి సినిమాకే వంద కోట్ల జోడీ దొరకడం ప్లస్ అయినా, అదే జోడీ గత సినిమా నీడ కూడా వెంట వస్తుంది. అందుకే ‘ఎపిక్’ దగ్గర ఆదిత్య చేసిన మంచి పని ఒకటుంది. ఆనంద్, వైష్ణవిని తీసుకుని మరో ‘బేబీ’ చేయడానికి ట్రై చేయలేదు. ఇప్పుడు సెప్టెంబర్ 11న సినిమా చూసిన ప్రేక్షకుడికి ఆనంద్, వైష్ణవి కనిపించినా ‘బేబీ’ కంటే ‘ఎపిక్’ క్యారెక్టర్లే గుర్తుండిపోతే, ఆదిత్య మొదటి పెద్ద పని అక్కడే పూర్తయినట్టే.