ప్రతి నిర్మాతకూ హిట్టు పడాలంటే.. మైత్రీ నిర్మాత ఇంప్రెస్సివ్ ఐడియా
అయితే.. కేవలం సినిమా విడుదల చేయడమే కాకుండా అది థియేటర్లలో ఆడి విజయం సాధించాలనేది అసలైన లక్ష్యమని ఆయన విశ్లేషించారు.
తెలుగు చిత్రపరిశ్రమలో వారానికి మూడు నాలుగు సినిమాలు విడుదల కావడం చాలా సాధారణంగా మారింది. అయితే అందులో బాక్సాఫీస్ వద్ద విజయం సాధించే చిత్రాల శాతం పది నుంచి ఇరవై శాతానికే పరిమితమవుతోంది. ఇటువంటి సవాలుతో కూడిన పరిస్థితుల్లో.. పరిశ్రమలోని చిన్న నిర్మాతలు నిలదొక్కుకోవడానికి.. ప్రతీ చిత్రం విజయవంతం కావడానికి మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నవీన్ ఎర్నేని.. యలమంచిలి రవిశంకర్ శ్రేయోభిలాషులై ముందుకు రావడం విశేషం. ఇండస్ట్రీ శ్రేయస్సే ధ్యేయంగా రవిశంకర్ చేసిన విశ్లేషణాత్మక సూచనలు టాలీవుడ్‌లో కొత్త ఆశలను చిగురింపజేస్తున్నాయి.
సినిమా నిర్మాణం ఎంతో మంది ఆశలు- పెట్టుబడులతో కూడుకున్న వ్యవహారం. గత కొన్ని నెలలుగా వరుస విజయాలు వస్తుండటంతో కొత్త నిర్మాతలు ధైర్యంగా అడుగులు వేస్తున్నారని రవిశంకర్ గుర్తుచేశారు. కేవలం సినిమాలు నిర్మించడమే కాకుండా.. వాటిని సరైన రీతిలో ప్రేక్షకులకు చేరవేయడం, రిలీజ్ ప్రక్రియ అనేది అత్యంత కీలకమైన అంశం. నైజాం పరిధిలో ఇప్పటివరకు తాము పంపిణీ చేసిన 180 సినిమాల్లో 150కి పైగా చిన్న సినిమాలే ఉన్నాయని...అలాంటి వారికి తమ బ్యానర్ ఎల్లప్పుడూ వెన్నుదన్నుగా నిలుస్తుందని భరోసానిచ్చారు.
అయితే.. కేవలం సినిమా విడుదల చేయడమే కాకుండా అది థియేటర్లలో ఆడి విజయం సాధించాలనేది అసలైన లక్ష్యమని ఆయన విశ్లేషించారు. ``సినిమా పూర్తి చేసి రిలీజ్ చేశాం.. హమ్మయ్య పని అయిపోయింది`` అనుకుంటే సరిపోదని.. కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండటం ముఖ్యమని స్పష్టం చేశారు. కథా చర్చల స్థాయిలోనే స్క్రిప్ట్ లోపాలను గుర్తించడం.. టెక్నికల్‌గా మరింత మెరుగ్గా తీర్చిదిద్దడం ద్వారా మాత్రమే విజయావకాశాలను పెంచవచ్చని వ్యాఖ్యానించారు.
ఈ క్రమంలో పరిశ్రమలోని సీనియర్ ప్రొడ్యూసర్లు, ప్రముఖ నిర్మాతలు కలిసి ఒక కమిటీ లేదా ప్యానెల్‌గా ఏర్పడాలనే ప్రపోజల్‌ను ఆయన తెరపైకి తెచ్చారు. ఎలాంటి పోటీతత్వం లేని సితార వంశీ, యూవీ వంశీ, బాపి, రాజీవ్ రెడ్డి, స్వప్న, సుప్రియ వంటి తోటి అగ్ర నిర్మాతలతో చర్చించి ఈ సపోర్ట్ సిస్టమ్‌ను రూపొందిస్తామన్నారు. కథ స్థాయిలోనే ఒకసారి స్క్రిప్టు విన్న తర్వాత సరైన సూచనలు ఇస్తే చిన్న నిర్మాతలు కూడా క్వాలిటీ కంటెంట్‌తో విజయాలు సాధించగలరని విశ్లేషించారు.
సినిమా పరిశ్రమలో అంతర్గత పోటీలు, రాజకీయాలు ఉన్నా.. చిన్న నిర్మాతల సంక్షేమం కోసం అగ్ర నిర్మాతలు ఇలా సహకారాన్ని అందించాలనుకోవడం శుభపరిణామం. ప్రతీ చిన్న సినిమా విజయం సాధించినప్పుడే పరిశ్రమ కళకళలాడుతుందని రవిశంకర్ ఆకాంక్షించారు. కంటెంట్ ఆధారిత సినిమాలకు మార్గదర్శకత్వం వహించే ఈ `రివర్స్ ప్రాసెస్` ఆలోచన అమల్లోకి వస్తే.. భవిష్యత్‌లో టాలీవుడ్ సక్సెస్ రేటు మరింత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. నిర్మాతల మండలి ఎన్నికల వేళ `గిల్డ్-ప్రొగ్రెస్సివ్ ప్యానెల్` తరపున మ్యానిఫెస్టోలో మైత్రి నిర్మాత సూచన ఆకర్షణీయంగా మారడంపై చర్చ సాగుతోంది.