శ్ర‌ద్ధాక‌పూర్ జీవితంలో అత్యంత సాహ‌సోపేత‌మైన పాత్ర‌!

ఇప్పుడు ఆమె బయోపిక్ లో బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్ర పోషిస్తుండటం విశేషం.;

Update: 2026-03-20 18:30 GMT

కళ కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టిన మహోన్నత జానపద కళాకారిణి విఠాబాయి భౌ మాంగ్ నారాయణగాంకర్ జీవిత కథ ఇప్పుడు `విఠా` పేరుతో వెండితెరపై ఆవిష్కృతం కాబోతోంది. మహారాష్ట్రకు చెందిన ఈ లెజెండరీ తమాషా (జానపద నృత్యం) కళాకారిణి జీవితం సామాన్యులకు సైతం స్ఫూర్తినిస్తుంది. సురభి నాటక కళాకారుల అంకితభావానికి ఏమాత్రం తీసిపోని విధంగా.. ఈ క‌ళాకారిణి తన జీవితాంతం కళకే అంకితమయ్యారు. ఇప్పుడు ఆమె బయోపిక్ లో బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్ర పోషిస్తుండటం విశేషం.

విఠాబాయి జీవితంలో జరిగిన ఒక సంఘటన వింటే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఒకసారి ఆమె స్టేజీపై ప్రదర్శన ఇస్తుండగా ప్రసవ వేదన మొదలైంది. ఏమాత్రం వెనకడుగు వేయకుండా.. వేదిక వెనుకకు వెళ్లి బిడ్డకు జన్మనిచ్చారు. అక్కడ సర్జికల్ పరికరాలు లేకపోవడంతో అందుబాటులో ఉన్న ఒక రాతితో బొడ్డు పేగును కోసి, బిడ్డను పక్కన పడుకోబెట్టారు. ఆ వెంటనే ఏమీ జరగనట్లుగా తిరిగి వేదికపైకి వచ్చి తన పెండింగ్ ప్రదర్శనను పూర్తి చేసి అందరినీ విస్మయానికి గురిచేశారు.

విఠాభాయి జీవితంలో ఇంకా ఎన్నో సాహ‌స‌ఘ‌ట్టాలు ఉన్నాయి. భారత్‌- చైనా యుద్ధం జరుగుతున్న క్లిష్ట సమయంలో విఠాబాయి ప్రదర్శనలు దేశభక్తిని చాటాయి. యుద్ధ భూమిలో అలసిపోయిన భారత సైనికులకు తన జానపద ప్రదర్శనల ద్వారా వినోదాన్ని, మానసిక ఉల్లాసాన్ని పంచిన గొప్ప దేశభక్తురాలు ఆమె. సరిహద్దుల్లో సైనికుల నడుమ ఆమె చేసిన నృత్యాలు ఆనాటి కాలంలో ఎంతో ప్రాచుర్యం పొందాయి. కేవలం వినోదం కోసమే కాకుండా..సామాజిక చైతన్యం కోసం విఠాభాయి తన కళను ఆయుధంగా మలుచుకున్నారు.

మహారాష్ట్రలో తమాషా కళకు విఠాబాయి ఒక బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచారు. తన విలక్షణమైన శైలితో.. అద్భుతమైన అభినయంతో దశాబ్దాల పాటు ప్రజలను అలరించారు. విఠా భాయి ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం అనేక పురస్కారాలతో గౌరవించింది. జానపద కళను బతికించడం కోసం ఆమె పడ్డ తపన, ఎదుర్కొన్న పేదరికం, సామాజిక వివక్షను నేటి బయోపిక్‌లో కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నారు.

ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ తన కెరీర్‌లోనే అత్యంత సవాలుతో కూడుకున్న పాత్రను పోషిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా మరాఠీ యాసతో పాటు సంప్రదాయ `లావణి` నృత్య రీతుల్లో శిక్షణ పొందుతోంది. ఇంతటి సాహసోపేతమైన మహిళా కళాకారిణి కథను నేటి తరానికి పరిచయం చేయడం ఎంతో అవసరమని చిత్ర బృందం భావిస్తోంది. విఠాబాయి జీవితం కళాకారుల పై సమాజానికి ఉన్న దృక్పథాన్ని మారుస్తుందని.. ముఖ్యంగా ప్రసవ సమయంలో ఆమె చూపిన ధైర్యం మాతృత్వానికి, వృత్తిలో అంకితభావానికి నిదర్శనంగా నిలుస్తుంది.

`విఠా` చిత్రానికి ప్రముఖ మరాఠీ దర్శకుడు సంజయ్ జాదవ్ దర్శకత్వం వహిస్తున్నారు. లోక్ మన్యం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మరాఠీ- హిందీ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నారు.

Tags:    

Similar News