జననాయగన్ నిర్మాతకి తమిళనాడు సీఎం కీలక పదవి!

ఇక ఇప్పుడు ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో మరొకవైపు ఈ చిత్ర నిర్మాత కేవీఎన్ వెంకట్ నారాయణ పేరు రాజకీయ, సినీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది.

Update: 2026-06-27 07:23 GMT

ప్రస్తుతం ఎక్కడ చూసినా సినీ నటుడు , తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉండడం గమనార్హం. పార్టీ పెట్టిన తొలి ప్రయత్నం లోనే ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేయడం, అధికారంలోకి వచ్చిన వెంటనే పలు విభాగాలలో తగిన నిర్ణయాలు తీసుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. సామాన్యులకు అండగా నిలుస్తూ అన్ని రంగాలలో అభివృద్ధిని కనబరిచే దిశగా అడుగులు వేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా సీఎం విజయ్ పేరు ప్రథమంగా వినిపిస్తూ ఉండడం గమనార్హం.

ఇదిలా ఉండగా మరొకవైపు విజయ్ రాజకీయ ఎంట్రీ ఇచ్చి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత పలువురు సినీ తారలు రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్న విషయం తెలిసిందే. ఇక అందులో భాగంగానే తాజాగా జననాయగన్ నిర్మాతకి విజయ్ అధికారాన్ని కట్టబెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విజయ్ దళపతి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఆయన నటించిన చివరి చిత్రం జన నాయగన్. ఈ సినిమా ప్రస్తుతం భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. సెన్సార్ సమస్యల వల్ల విడుదల ఆగిపోయింది.

ఇక ఇప్పుడు ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో మరొకవైపు ఈ చిత్ర నిర్మాత కేవీఎన్ వెంకట్ నారాయణ పేరు రాజకీయ, సినీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. తమిళనాడు ప్రభుత్వం కేవీన్ వెంకట్ నారాయణ న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేసే తమిళనాడు ప్రత్యేక ప్రతినిధిగా నియమించినట్లు ఒక వార్త వెలుగులోకి రావడంతో అటు దక్షిణాది రాజకీయ, సినీ వర్గాలలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఈ నియమానికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. కేవీఎన్ వెంకటనారాయణ ఒక సంవత్సరం పాటు ఈ పదవిలో కొనసాగబోతున్నారట. ముఖ్యంగా ఆయన బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి ఈ నియామకం అమల్లో ఉంటుందని తెలుస్తోంది. అంతేకాదు ప్రభుత్వం అవసరాన్ని బట్టి పదవీ కాలానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. విధి విధానాలు, వేతనం ,ఇతర వివరాలను ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రకటించనున్నట్లు సమాచారం. ఏది ఏమైనా జననాయగన్ వంటి భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్మాతకి ఇలాంటి కీలక బాధ్యతలు అప్పగించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి విజయ్ ఈ నియామకం వెనుక ఎలాంటి ఆలోచనలు చేశారో తెలియాల్సి ఉంది.

ఇకపోతే కేవీఎన్ వెంకట నారాయణ విషయానికొస్తే.. ఈయన బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కన్నడ , తెలుగు ,తమిళ్ భాషల్లో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తూ దక్షిణాది సినీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా పేరు దక్కించుకున్నారు. ముఖ్యంగా సినీ ప్రముఖులతో ఆయనకున్న అనుబంధం, వ్యాపార రంగంలో ఉన్న అనుభవం కారణంగా ఈ పదవి ఇచ్చి ఉండొచ్చు అనే కోణంలో కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు వెంకట్ నారాయణ కారణంగా జననాయగన్ సినిమా మరోసారి వార్తల్లో నిలిచిందని చెప్పవచ్చు.

Tags:    

Similar News