సూపర్ స్టార్ బయోపిక్ తో తనయ పెద్ద సాహసమే!
రజనీకాంత్ లాంటి మాగ్నటిక్ పర్సనాలిటీ ఉన్న వ్యక్తి తెరపై జీవించడం ఏ నటుడికైనా సవాలే. ఈ నేపథ్యంలో తండ్రి బయోపిక్‌ను స్క్రీన్ పైకి తీసుకురావడంపై సౌందర్య స్పష్టమైన ప్రణాళికతో ఉన్నారు.
భారతీయ సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ అనే పదానికి కేరాఫ్ అడ్రస్ రజనీకాంత్. సాధారణ బస్సు కండక్టర్‌గా జీవితాన్ని ప్రారంభించి అసాధారణ నటనతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకుని గ్లోబల్ ఐకాన్‌గా ఎదిగిన రజనీ ప్రయాణం ఎప్పటికీ అద్భుతమే. ఇప్పుడు తలైవర్ జీవిత విశేషాలను స్వయంగా ఆత్మకథ రూపంలో పొందు పరుస్తున్నారు. ఈ పుస్తకం మార్కెట్లోకి వచ్చిన తర్వాత దీని ఆధారంగా తండ్రి జీవితాన్ని ఒక సినిమాగా లేదా వెబ్ సిరీస్‌గా తెరకెక్కించేందుకు ఆయన కుమార్తె, దర్శకురాలు, నిర్మాత సౌందర్య రజనీకాంత్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
రజనీకాంత్ స్వీయ చరిత్రకు సంబంధించి సౌందర్య ఇటీవల పంచుకున్న కొన్ని విషయాలు సినీ వర్గాల్లో చర్చనీ యాంశంగా మారాయి. తండ్రి ఆత్మకథ కేవలం ఒక సాధారణ పుస్తకంలా కాకుండా తరతరాలకు స్పూర్తినిచ్చే ఒక గొప్ప గ్రంథంలా ఉంటుందని అభివర్ణించారు. రామాయణ, మహాభారతాల మాదిరిగానే ఈ పుస్తకంలో ఎన్నో జీవిత సత్యాలు, ఆసక్తికరమైన మలుపులు ఉన్నాయని, త్వరలోనే ఇది ప్రపంచవ్యాప్తంగా పుస్తక రూపంలో పాఠకుల ముందుకు రానుందని వెల్లడించారు. అయితే ఒక లెజెండరీ నటుడి బయోపిక్‌ను తెరకెక్కించడం అనేది కత్తి మీద సాము లాంటిదనే చెప్పాలి.
రజనీకాంత్ లాంటి మాగ్నటిక్ పర్సనాలిటీ ఉన్న వ్యక్తి తెరపై జీవించడం ఏ నటుడికైనా సవాలే. ఈ నేపథ్యంలో తండ్రి బయోపిక్‌ను స్క్రీన్ పైకి తీసుకురావడంపై సౌందర్య స్పష్టమైన ప్రణాళికతో ఉన్నారు. ముందుగా పుస్తకం విడుదలైన తర్వాతే సినిమా లేదా వెబ్ సిరీస్ ఏది సరైనదో నిర్ణయిస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే రజనీకాంత్ బయోపిక్‌లో ఆయన పాత్రలో ఎవరు? నటిస్తారనే దానిపై ఇప్పటికే సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రిషికాంత్ వంటి నటులైతే ఈ పాత్రకు సరిగ్గా సరిపోతారనే చర్చ కూడా అభిమానుల మధ్య జరుగుతోంది.
తెరవెనుక రజనీ పడిన కష్టాలు, ఎదుర్కొన్న సవాళ్లు, సినీ ప్రయాణంలో చూసిన పొరటాలు వంటివి బయోపిక్‌లో హైలైట్ అయ్యే అవకాశం ఉంది. ఒక సూపర్‌స్టార్ జీవితాన్ని వెండితెరపై లేదా డిజిటల్ వేదికపై ఆవిష్కరించడం అంటే అంచనాలను అందుకోవడం పెద్ద సాహసమే అవుతుంది. స్వయంగా రజనీ కుటుంబ సభ్యురాలే ఈ బాధ్యతను భుజాన వేసుకుంటుండటంతో ప్రాజెక్ట్ పై అంచనాలు తారా స్థాయికి చేరుతున్నాయి. తండ్రి ఇమేజ్‌కు ఏమాత్రం తగ్గకుండా ఆయనలోని అసలుసిసలు మనిషిని పరిచయం చేసే భారీ సాహసానికి సౌందర్య ఎలాంటి రూపమిస్తారనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.