సింగీతం ...స్వర్ణ యుగం నుంచి సాంకేతిక యుగం దాకా !

సింగీతానికి ఏమి తెలుసు అన్నది కాదు ఏమి తెలియదు అని ప్రశ్న వేసుకోవాలి. కెమెరా కన్నుతో చూస్తూ వెండితెరను పండించిన గొప్ప కళా స్రష్ట అని చెప్పాలి.

Update: 2026-10-04 04:03 GMT

సింగీతం శ్రీనివాసరావు ఇక లేరు అంటే సినీ అభిమానులకు మనసు బాధగా మూలుగుతుంది. ఎందుకంటే ఆయన వయసుని జయించిన నవ యువకుడు. కాలాన్ని అధిగమించిన దార్శనీకుడు. మరో వేయేళ్ళలో ఏమి జరుగుతుందో భవిష్యత్తుని ఊహించి మరీ సెల్యూలాయిడ్ మీద అందంగా చెక్కిన అద్భుత శిల్పి. దర్శకుడు అంటే కేవలం కట్ టేక్ అన్నది మాత్రమే కాదని ఆచరణాత్మకంగా నిరూపించిన ప్రతిభాశాలి. సింగీతానికి ఏమి తెలుసు అన్నది కాదు ఏమి తెలియదు అని ప్రశ్న వేసుకోవాలి. కెమెరా కన్నుతో చూస్తూ వెండితెరను పండించిన గొప్ప కళా స్రష్ట అని చెప్పాలి.

మాయాబజార్ నుంచి :

సింగీతం శ్రీనివాసరావు ఎవరి శిష్యుడు అన్నది కదా చర్చించాల్సిన అంశం. దర్శకత్వానికే ఎనలేని ఖ్యాతిని తెచ్చిన కేవీ రెడ్డి వద్ద అసిస్టెంట్ గా తన కెరీర్ ని ప్రారంభించిన సింగీతం మాయా బజార్ కి ఆయన వద్ద పనిచేశారు. అది లగాయితూ అనేక సినిమాలకు ఆయన సహాయ దర్శకుడిగా అలాగే తెర వెనక సాంకేతిక నిపుణుడిగా ఎంతగానో పనితనం చూపించారు. ఆయన దర్శకుడిగా చాలా ఆలస్యంగా అయ్యారనే చెప్పాలి. 1970 దశకంలో ఆయన మెగా ఫోన్ పట్టారు. తొలి సినిమా నీతి నిజాయితీ. మొదటి సినిమా సరిగ్గా ఆడలేదు, రెండో చాన్స్ రావడానికి టైం పట్టింది. అయితే 1975లో వచ్చిన జమిందార్ గారి అమ్మాయి సినిమా హిట్ అయి ఆయనకు దర్శకుడిగా ఒక ముద్రను వేసింది.

ప్రయోగాలకే పేరు :

సింగీతం ఎపుడూ కాలం కంటే ముందే ఆలోచించే వారు. అమెరికా అమ్మాయి వంటి సినిమాలను తీసిన ఆయన కమల్ హాసన్ తో సొమ్మొకడిది సోకొకడిది చిత్రానికి తొలిసారి పనిచేశారు. అది సూపర్ హిట్ అయింది. ఇక ఆ తరువాత ఈ ఇద్దరి కాంబోలో అనేక హిట్ మూవీస్ వచ్చాయి. అందులో మైఖెల్ మదన కామరాజు విచిత్ర సోదరులు వంటివి ఒక ఎత్తు అయితే టాకీ యుగంలో మూకీ సినిమాగా పుష్పక విమానం క్లాసికల్ హిట్ గా నిలిచింది. ఇక బాలక్రిష్ణతో ఆదిత్య 369 టైం మిషన్ సబ్జెక్ట్ తో తీసి చేసిన ప్రయోగం గ్రాండ్ సక్సెస్ అయింది. సైన్స్ ఫిక్షన్ గా ఆ రోజుల్లో వెండి తెరకు పరిచయం చేసిన ఘనత సింగీతానిదే అని చెప్పాలి. అదే వరసలో బాలయ్యతో జానపద చిత్రం భైరవ ద్వీపం తీసి మరో హిట్ కొట్టారు. ఇక శ్రీకృష్ణార్జున యుద్ధం అనే పౌరాణిక చిత్రం కూడా బాలయ్యతో సింగీతం తీశారు. విజయా సంస్థలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన సింగీతం అదే విజయా వారి తరువాత తరం తో దర్శకుడిగా పనిచేసి విజయాలను అందించారు.

ఆయన ఖాతాలోనే :

ఇక మయూరి వంటి మూవీని సింగీతం తెరకెక్కించిన తీరు ఆయనలో మరో కోణాన్ని ఆవిష్కరిస్తుంది. ఒక డ్యాన్సర్ జీవిత కధను డాక్యుమెంటరీగా చెప్పకుండా హృద్యమైన కధగా సెల్యూలాయిడ్ మీద పండించిన తీరుతో ఈ రోజుకీ అది ఎవర్ గ్రీన్ గా నిలిచింది. తరం మారింది అంటూ ఈ మధ్యలోనే సందేశాత్మక చిత్రాలని తీసిన సింగీతం అమావాస్య చంద్రుడు మూవీలో కమల్ హాసన్ ని పూర్తిగా అంధుడిగా చూపించి చీకటిలో వెలుగు జిలుగులు ఏంటో చూపించారు. అలాగే అక్కినేని నాగార్జునతో ఆకాశ వీధిలో మూవీని తీశారు 2013లో వెల్ కమ్ ఒబామా తీసిన ఆయన్ 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత 2026లో సింగ్ గీతం అని తన 61వ చిత్రాన్ని తీసి తాజాగా ప్రేక్షకులను పలకరించారు.

చిరంజీవితో :

ఇక చిరంజీవితో సింగీతం కాంబోలో భూలోక వీరుడు మూవీ రావాల్సి ఉంది. ఒక విధంగా ఇది సింగీతం డ్రీమ్ ప్రాజెక్ట్ గా చెబుతారు. సోషియో ఫాంటసీ మూవీగా సింగీతం శ్రీనివాసరావు డిజైన్ చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా ఘనంగా ప్రారంభమై పూజా కార్యక్రమాలు కూడా జరుపుకుంది. కొన్ని రోజుల షూటింగ్ కూడా జరిగింది అయితే ఈ సినిమా మధ్యలోనే ఆగిపోవడం మాత్రం సినీ అభిమానులకు లోటుగానే చెప్పాలి.

అవార్డులేవీ :

స్వర్ణ యుగం నుంచి సాంకేతిక యుగం దాకా తన సత్తా చాటుకుని తానే నడిచే సినీ చరిత్రగా మారిన సింగీతానికి పౌర పురస్కారాలు మాత్రం ఎందుకో రాలేదని ఆయన అభిమానులు ఆవేదన చెందుతారు. ఆయన కృషికి పద్మ భూషణ్ వంటి అవార్డులు రావాల్సి ఉన్నా రాకపోవడం నిజంగా బాధాకరమే అంటారు. ఏది ఏమైనా సింగీతం అంటే పదికాలాల పాటు అంతా చెప్పుకునే ఎన్నో అద్భుతమైన సినిమాలను తీసిన దిగ్దర్శకుడుగా ఆయన సినీ చరిత్రలో నిలిచిపోతారు అన్నది సత్యం.

Tags:    

Similar News