ఆ భూమి ఉండుంటే హీరో నవదీప్ 200 కోట్ల ఆస్తిపరుడు!
ఇదే వేదికపై నూతనంగా సినిమా రంగంలోకి అడుగుపెడుతున్న నిర్మాతలు-సాంకేతిక నిపుణుల గురించి కూడా అజయ్ ఘోష్ పలు విలువైన సూచనలు చేశారు.
యువహీరో నవదీప్ నటుడిగా కొన్నేళ్లుగా అవిశ్రామంగా ప్రయాణం సాగిస్తూనే ఉన్నాడు. పెద్దతెర, బుల్లితెరపైనా అతడి ప్రతిభ అందరికీ తెలుసు. అయితే స్టార్ డమ్ మాత్రం అందని ద్రాక్షగా మారింది. కెరీర్ లో `చందమామ` లాంటి బ్లాక్ బస్టర్ ఉంది. స్టార్ హీరోలతో సమానంగా సినిమాని లీడ్ చేయగల ప్రతిభా ఉంది. కానీ ఎందుకనో అతడు ఆశించిన విధంగా కెరీర్ సాగలేదన్నది వాస్తవం. అయినా అతడికి ఆఫర్ల పరంగా వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. తనకు అందివచ్చిన సినిమాల్లో నటిస్తూ.. బుల్లితెర కార్యక్రమాలు చేస్తూ ఎప్పుడూ బిజీగానే ఉన్నాడు. ఆర్జన పరంగాను ఢోఖా లేదు.
అయితే ఈరోజుల్లో ప్రతి అగ్ర కథానాయకుడు 100 కోట్ల పారితోషికం సునాయాసంగా అందుకుంటున్నారు. అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి పెద్ద హీరోలతో కలిసి నటించాడు. ఆర్య, ధృవ చిత్రాలలో అతడి నటనకు గుర్తింపు దక్కింది. అయితే స్టార్ గా వంద కోట్లు అందుకోవాలి అనేంత పెద్ద ఆశలు ఏవీ లేవు కానీ.. నిజానికి నవదీప్ కుటుంబ నేపథ్యం అంతే గొప్పది. దీని గురించి నటుడు అజయ్ ఘోష్ చెప్పిన ఆ ఒక్క విషయం వింటే ఎవరైనా అరెరే... నిజమా! అని ముక్కున వేలేసుకుంటారు. అలాంటి కఠినమైన నిజం ఒకటి నవదీప్ తండ్రి గురించి అజయ్ ఘోష్ తాజా ఈవెంట్లో చెప్పుకొచ్చాడు.
నవదీప్ తండ్రి గారైన కరుణాకర్ వ్యాపార నేపథ్యం గురించి నటుడు అజయ్ ఘోష్ చెప్పిన విషయాలు షాకిచ్చాయి. అప్పట్లోనే అంటే 2002 నాటికే చీరాల సమీపంలోని రామాపురంలో నవదీప్ తండ్రి రామారావు గారు రిసార్ట్స్ నిర్మించారని ఆయన గుర్తుచేసుకున్నారు. ఆ కాలంలోనే అంతటి దూరచూపుతో వ్యాపారాలు చేయడం గొప్ప విషయమని అజయ్ ఘోష్ కొనియాడారు.
అయితే ఆ కాలంలో వారు నిర్మించిన ఆ ల్యాండ్‌ను - రిసార్ట్స్‌ను గనుక అప్పట్లో అమ్మకుండా అలాగే ఉంచి ఉంటే నేడు దాని విలువ వందల కోట్లలో ఉండేదని అభిప్రాయపడ్డారు. కాలక్రమేణా పరిస్థితులరీత్యా అవి అమ్మాల్సి వచ్చినా.. నాటి వారి ఆలోచన విధానం .. వ్యాపార దృక్పథం ఎంతో ప్రత్యేకమైనవని తెలిపారు. నవదీప్ బాబాయ్ లీలా ప్రసాద్ తనకు క్లాస్‌మేట్ అని పేర్కొంటూ.. ఆ కుటుంబంతో ఉన్న పాత పరిచయాలను ఈ సందర్భంగా ఆయన నెరువేసుకున్నారు.
ఇదే వేదికపై నూతనంగా సినిమా రంగంలోకి అడుగుపెడుతున్న నిర్మాతలు-సాంకేతిక నిపుణుల గురించి కూడా అజయ్ ఘోష్ పలు విలువైన సూచనలు చేశారు. విదేశాలలో స్థిరపడి మంచి ఉద్యోగాలు చేసుకుంటూ వచ్చి కేవలం సినిమాపై ఉన్న మక్కువతో (పాషన్) ఇలాంటి ప్రాజెక్ట్‌లు నిర్మించడం అభినందనీయమని అన్నారు. మొదటి సినిమాతోనే బంపర్ హిట్లు వస్తుందని ఆశపడకుండా.. వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలని ఘోష్ హితవు పలికారు.
ముఖ్యంగా కొత్త నిర్మాతలు తాము అనుకున్న బడ్జెట్లోనే సినిమాలు పూర్తి చేయాలని.. అనవసరమైన ఖర్చులతో ఇబ్బందులు పడకూడదని సూచించారు. తక్కువ పెట్టుబడితో నాణ్యమైన సినిమాలు తీస్తే మరింత కొత్త ప్రతిభ వెలుగులోకి వస్తుందని, అప్పుడే పరిశ్రమపై ఆధారపడిన కార్మికులు- టెక్నీషియన్లందరూ సుఖసంతోషాలతో ఉంటారని ఆయన పేర్కొన్నారు. `మొహబ్బత్` చిత్రానికి పనిచేసిన ప్రొఫెసర్లు, సంగీత దర్శకులు, ఇతర బృందం ఎంతో కష్టపడి ఈ సినిమాను రూపొందించారని తెలిపారు.
మొత్తానికి ఈ చిన్న సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఎవరికీ ఎలాంటి బకాయిలు లేకుండా సకాలంలో పారితోషికాలు అందాయని అజయ్ ఘోష్ స్పష్టం చేశారు. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ వాస్తవిక కథా చిత్రాన్ని ప్రేక్షకులు, మీడియా మిత్రులు అందరూ ఆదరించి విజయవంతం చేయాలని ఆయన కోరారు. మంచి మనసుతో సినిమా తీస్తున్న ఈ యువ బృందానికి అందరి మద్దతు ఉంటుందని పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు.